ఎక్సైజ్‌ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?

ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్‌ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.

Published : 24 Apr 2024 05:42 IST

ఎన్నికల సంఘాన్ని వివరణ కోరిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్‌ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఎక్సైజ్‌ అధికారులను బదిలీ చేయకుండా కొనసాగిస్తుండటాన్ని సవాల్‌ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన బి.నాగధర్‌సింగ్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేయాలంటూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. ఒకే జిల్లాలో మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసినా, ఇందులో ఎక్సైజ్‌ అధికారులకు మినహాయింపు ఇచ్చిందన్నారు. స్థానికంగా ఉన్న అధికారులను బదిలీ చేయకపోవడంతో అక్రమాలకు అవకాశం ఉంటుందన్నారు. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. స్వాధీనం చేసుకున్న మద్యంపై పలు ఆరోపణలు వస్తున్నాయన్నారు. మద్యం సరఫరా విషయంలో రాజకీయ నాయకులకు ఎక్సైజ్‌ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందువల్ల వారిని మరో నియోజకవర్గ పరిధిలోకి బదిలీ చేయాల్సి ఉందన్నారు. మార్గదర్శకాల ప్రకారమే బదిలీలు జరిగాయని ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని