‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Updated : 28 Apr 2024 05:45 IST

ప్రభుత్వానికి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఆదేశం
‘కాళేశ్వరం’పై మే మొదటి వారంలో రెండో విడత విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి శనివారం వరకు విచారణ చేపట్టిన కమిషన్‌ పలు అంశాలపై దృష్టిసారించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివీ...

  • 2015లో విశ్రాంత ఇంజినీర్ల సంఘంతో కూడిన ఆరుగురు సభ్యుల కమిటీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతానికి సంబంధించి అధ్యయనం చేసింది. నీటిని తీసుకోవడానికి మేడిగడ్డ అనువైన ప్రాంతమా లేదా అన్నదానిపై పరిశీలించింది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక సమర్పించాలని కమిషన్‌   ఆదేశించింది.
  • విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ సందర్భంగా నీటిపారుదల శాఖ నుంచి కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించి తీసుకెళ్లిన దస్త్రాలను కమిషన్‌కు అప్పగించాలని ఆదేశాలను జారీ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ పియర్లు గతేడాది అక్టోబరు 21న కుంగాయి. అన్నారం, సుందిళ్లలోనూ పలు లోపాలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా అధికారులు హైదరాబాద్‌లోని నీటిపారుదల ప్రధాన కార్యాలయం జలసౌధతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల కార్యాలయాలు ఉన్న జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో కూడా సోదాలు నిర్వహించి పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
  • జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నివేదికను వీలైనంత త్వరగా తెప్పించాలని కమిషన్‌ నీటిపారుదల శాఖను ఆదేశించింది. మూడు బ్యారేజీలపై సమగ్ర అధ్యయనం చేయాలని, మేడిగడ్డ పునరుద్ధరణకు మధ్యంతర నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్‌ఏను కోరడంతో మార్చిలో ఆ సంస్థ విచారణ ప్రారంభించింది. పలు దఫాలుగా క్షేత్రస్థాయిలో, వివిధ ఇంజినీరింగ్‌ విభాగాలు, గుత్తేదారులతో విచారణ ప్రక్రియ చేపట్టి పలు దస్త్రాలను దిల్లీకి తీసుకెళ్లింది.

కాళేశ్వరంపై నాలుగు రోజులపాటు విచారణ చేపట్టిన కమిషన్‌ ఛైర్మన్‌ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కోల్‌కతా తిరిగి వెళ్లారు. మే నెల మొదటి వారంలో రెండో దఫా విచారణ జరగనున్నట్లు తెలిసింది. మరోవైపు మూడు బ్యారేజీలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదులు సమర్పించేందుకు కమిషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెట్టెలను అధికారులు సీజ్‌ చేశారు. రెండో దఫా విచారణ ప్రారంభం సందర్భంగా తిరిగి వాటిని అందుబాటులో ఉంచనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని