సమస్యలపై ఐక్యంగా పోరాడాలి

దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది.

Published : 29 Apr 2024 03:04 IST

న్యాయవాదులకు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. మొదటిసారిగా హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో ఆదివారం అసోసియేషన్‌ హాలులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 110 బార్‌ అసోసియేషన్‌ల సమావేశం జరిగింది. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి జిల్లాల నుంచి హాజరైన బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, కార్యదర్శులతో వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. జూనియర్‌ న్యాయవాదులకు ఐదేళ్ల వరకు రూ.5 వేల చొప్పున స్టైపెండ్‌, పదేళ్ల పాటు వృత్తిలో ఉండి ఇల్లు లేని వారికి ఇంటి స్థలాల కేటాయింపు వంటి డిమాండ్ల సాధనకు ప్రయత్నిద్దామన్నారు.

అసోసియేషన్ల పదవీ కాలం పెంచాలి

ఈ కార్యక్రమంలో పలువురు అసోసియేషన్‌ అధ్యక్షులు, కార్యదర్శులు మాట్లాడుతూ, అసోసియేషన్‌ కార్యవర్గ పదవీ కాలపరిమితి ఏడాది మాత్రమే ఉందని, ఈ కారణంగా న్యాయవాదుల సమస్యలను కార్యవర్గం పరిష్కరించలేకపోతోందని అభిప్రాయపడ్డారు. కాల పరిమితిని రెండేళ్లకు పెంచేలా బార్‌ కౌన్సిల్‌ చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కొన్ని బార్‌ అసోసియేషన్‌లు, ముఖ్యంగా మారుమూల జిల్లాల్లో ఉన్నవి ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సమావేశం దృష్టికి తెచ్చారు.

కేసుల విచారణ సందర్భంగా కోర్టులు విధించే జరిమానాలు జిల్లా న్యాయసేవాధికార సంస్థకు చెందేలా హైకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసిందని, దీన్ని సవరించి ఆ సొమ్మును బార్‌ అసోసియేషన్‌లకు చెల్లించేలా న్యాయాధికారులు ఆదేశాలు జారీ చేయాల్సి ఉందన్నారు. సీఆర్‌పీసీ 41ఎ వల్ల సామాన్య ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండటంలేదని, దానివల్ల న్యాయవాదులూ నష్టపోతున్నారని, దాని రద్దుకు పోరాటం చేయాల్సి ఉందన్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి ఏటా కొంత మొత్తం ప్రభుత్వం జమచేసేలా చూడాలని విన్నవించారు. ప్రధాన న్యాయమూర్తిని కలవడానికి జిల్లా బార్‌ అసోసియేషన్‌లు ప్రయత్నిస్తే కార్యాలయం నుంచి దురుసుగా సమాధానం వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాన న్యాయమూర్తిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడంలేదని, ఈ సమస్యను హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సీజే దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షురాలు దీప్తి, కార్యదర్శులు ఉప్పాల శాంతి భూషణ్‌రావు, జి.సంజీవ్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి నవీన్‌కుమార్‌, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని