రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకం కాదు

రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ స్పష్టం చేశారు.

Published : 29 Apr 2024 03:10 IST

మోహన్‌ భాగవత్‌ స్పష్టీకరణ

ఈనాడు డిజిటల్‌-హైదరాబాద్‌, బాలాపూర్‌-న్యూస్‌టుడే: రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకమంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోతో తమకు సంబంధం లేదన్నారు. దేశంలో అసమానతలు తొలగేవరకు రిజర్వేషన్లు అమలు కావాలని.. వాటికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో ఆదివారం విద్యాభారతి విజ్ఞాన కేంద్రం(వీబీవీకే) ప్రారంభోత్సవంలో మోహన్‌ భాగవత్‌, చినజీయర్‌స్వామి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో భాగవత్‌ మాట్లాడారు. ‘‘రిజర్వేషన్లకు సంఘ్‌ వ్యతిరేకమంటూ సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న వీడియో ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉంది. కృత్రిమ మేధ ఉపయోగించి.. ఆర్‌ఎస్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

వీబీవీకేల్లో విలువలతో కూడిన విద్య..

వీబీవీకేలు విలువలతో కూడిన విద్య నేర్పుతూ విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తున్నాయి. విద్యతో పాటు వినయం, సంస్కారం ముఖ్యం. శాస్త్రవిజ్ఞానాన్ని చెడు విషయాలకు కాకుండా మంచి కోసం వినియోగించేలా విద్యార్థుల్లో ప్రేరణ కల్పించాలి. విదేశీ భాషలతోపాటు మాతృభాష ముఖ్యమని గుర్తుంచుకోవాలి. విదేశాలకు వెళ్లాలని ఉన్నట్లే దేశంలోని తీర్థ స్థలాలనూ సందర్శించాలి. సింగపూర్‌ వెళ్దాం.. అంతకుముందు అయోధ్యను దర్శించుకుందాం. అందరూ శ్రీరాముని బాటలో నడవాలి. విశ్వభావనతో.. వసుధైక కుటుంబ స్ఫూర్తితో ముందుకు సాగాలి’’ అని భాగవత్‌ ఉద్బోధించారు.


భారత్‌ను విశ్వగురు స్థాయికి చేర్చేందుకు మోదీ కృషి

-చినజీయర్‌స్వామి

దేశంలోని సమస్యలను పరిష్కరించేందుకు, దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ ఎనలేని కృషి చేస్తున్నారని చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, కేవలం భారతీయుడిగా తన అభిప్రాయాలను తెలియజేస్తున్నానని చెప్పారు. విద్యార్థులకు మాతృభాషను చేరువ చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యాభారతి విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి సహాయం అందించిన దాతలను మోహన్‌ భాగవత్‌ సన్మానించారు. బడంగ్‌పేటకు చెందిన బీమిడి పెద్ద పెంటారెడ్డి, యశోద విరాళంగా ఇచ్చిన 14 ఎకరాల స్థలంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షుడు డాక్టర్‌ చామర్తి ఉమామహేశ్వరరావు, విజ్ఞాన కేంద్రం అధ్యక్షుడు తేలుకుంట్ల రమేశ్‌గుప్తా, క్షేత్ర కోశాధికారి వసర్తి మల్లయ్య, సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి, సంఘ్‌ సంచాలక్‌ సుందర్‌రెడ్డి, బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగురింత పారిజాత తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని