ఆర్టీసీ కార్మికులకు ఊరట

రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్‌)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది.

Published : 29 Apr 2024 03:13 IST

సీసీఎస్‌లో దరఖాస్తులకు వారంలో మోక్షం
నిధుల సర్దుబాటుతో మూడున్నరేళ్ల నిరీక్షణకు తెరపడే అవకాశం
10,600 మంది దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్‌)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల్ని పరిష్కరించి చెల్లింపులు ప్రారంభించాలని సీసీఎస్‌ నిర్ణయించింది. వారం రోజుల్లోపే ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని సీసీఎస్‌ వర్గాల సమాచారం.

50 వేల నుంచి 31 వేల మంది

టీఎస్‌ఆర్టీసీలోని ఉద్యోగులు, కార్మికులు కలిసి రుణపరపతి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నెలనెలా వేతనంలోంచి కొంత సొమ్మును సీసీఎస్‌లో పొదుపు చేసుకుంటారు. అవసరం వచ్చినప్పుడు తక్కువ వడ్డీతో రుణం తీసుకుంటారు. సభ్యత్వం రద్దు చేసుకున్నప్పుడు లేదా ఉద్యోగ విరమణ పొందినప్పుడు వారి సొమ్మంతా వడ్డీతో కలిపి వెనక్కి వస్తుంది. ఈ సొమ్మును ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకుంది. దీంతో 2020 అక్టోబరు నుంచి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. గతంలో సీసీఎస్‌లో 51 వేల మంది సభ్యులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 31 వేలకే పరిమితమైంది.

పెండింగ్‌ దరఖాస్తులు 10,600

అసలు, వడ్డీ కలిపి ఆర్టీసీ యాజమాన్యం తమకు రూ.1,130 కోట్లు ఇవ్వాలని సీసీఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించి ప్రస్తుతానికి రూ.150 కోట్లు చెల్లించింది. కార్మికుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 10,600 పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రుణం కోసం వచ్చినవి 6,800. ఉద్యోగ విరమణ చెందిన వారివి వెయ్యి, సభ్యత్వం రద్దు చేసుకున్న ఉద్యోగుల నుంచి 2,800 అర్జీలున్నాయి. రుణ దరఖాస్తుల కోసం రూ.200 కోట్లు.. రిటైర్మెంటు, సభ్యత్వం రద్దు చేసుకున్నవారికి రూ.90 కోట్లకుపైగా కావాలి. యాజమాన్యం ఇచ్చినవి రూ.150 కోట్లు కాగా, సీసీఎస్‌ రూ.150 కోట్లను రుణంగా తీసుకుంటోంది. దీంతో దరఖాస్తుదారులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతున్నాయని సీసీఎస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని