తెలంగాణ భగభగ!

తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి.

Published : 29 Apr 2024 03:14 IST

ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత
ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాలులు
నేడు.. రేపు ఎండల తీవ్రత: ఐఎండీ

ఈనాడు, హైదరాబాద్‌: తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. ఆదివారం కూడా ఆరు జిల్లాలు పొగలుగక్కాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయింది. ఈ జిల్లాలోని చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లోని పలు మండలాల్లో 45 నుంచి 45.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మహబూబాబాద్‌, నిజామాబాద్‌ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఎండ తీవ్రత కొనసాగింది. ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని, కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది.  


వడదెబ్బతో ఇద్దరి మృతి

జన్నారం, నర్సాపూర్‌ రూరల్‌, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్‌ మేజర్‌ గ్రామపంచాయతీకి చెందిన మేడిశెట్టి మహేశ్‌(42), మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన నరసయ్య(57) ఆదివారం వడదెబ్బతో మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని