నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!

అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది.

Published : 17 May 2024 03:02 IST

సలేశ్వరం ప్రాంతంలోరహదారి నిర్మాణం
పెద్దపులులు సంచరించే కోర్‌ ఏరియాలో పర్యాటక ప్యాకేజీ
ప్రస్తుతం ఏటా మూడ్రోజులే పర్యాటకులకు అనుమతి.. ఇక నుంచి 9 నెలలు

ఈనాడు, హైదరాబాద్‌: అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. ఇప్పటివరకు ఆ అడవిలోకి ఏడాదిలో మూడు రోజులే భక్తుల్ని, పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు. అది కూడా సలేశ్వరం జాతర జరిగే సమయంలోనే. అయితే, ఇన్నాళ్లు కొనసాగిన అటవీ పరిరక్షణ, పెద్దపులుల సంరక్షణపై ప్రతికూల ప్రభావం చూపే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సలేశ్వరం వరకు ప్రకృతి పర్యాటకం(ఎకో టూరిజం) ప్యాకేజీ ప్రవేశపెట్టేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. దీనికి అనుమతి వస్తే.. ఏడాదిలో 9 నెలలపాటు సలేశ్వరం వరకు పర్యాటకుల రాకపోకలు సాగుతాయి. వాహనాల రాకపోకలు, మానవ సంచారంతో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్ల ప్రశాంత జీవనానికి ఆటంకం కలుగుతుంది. అత్యంత సురక్షిత ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.

ఆధ్యాత్మిక క్షేత్రం.. సలేశ్వరం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని సలేశ్వరానికి పర్యావరణపరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీశైలం రహదారిలో మన్ననూరు తర్వాత ఫర్హాబాద్‌ గేట్‌ నుంచి దట్టమైన అడవిలో దాదాపు 30 కి.మీ. దూరం వెళ్తే సలేశ్వరం వస్తుంది. సలేశ్వరం చుట్టుపక్కల ఎనిమిది నుంచి పది వరకు పెద్దపులులు ఉంటాయని అంచనా. దట్టమైన లోయలోని గుహలో లింగమయ్య దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు వస్తారు. గతేడాది దాదాపు లక్షన్నర మంది రాగా, ఈసారి వడగాలుల కారణంగా 40 వేల మంది వరకు వచ్చారు. సలేశ్వరం జాతరకు ఏటా ఏప్రిల్‌లో మూడురోజుల పాటే అటవీశాఖ అనుమతిస్తోంది. అయితే, తాజాగా ప్రకృతి పర్యాటకం పేరుతో వానాకాలంలో మూడు నెలలు మినహా తొమ్మిది నెలలపాటు పర్యాటకులను అనుమతించే ప్రక్రియ మొదలుపెట్టింది. దీనికోసం వాహనాల రాకపోకల నిమిత్తం సలేశ్వరం క్షేత్రం ఉన్న ప్రాంతంలో చెట్లను తొలగించి మట్టి రహదారి నిర్మిస్తున్నారు. జీపు సఫారీతో పాటు.. ట్రెక్కింగ్‌ సహా మొత్తం ఆరు గంటల వ్యవధితో ప్రత్యేక ప్యాకేజీని అటవీశాఖ రూపొందిస్తోంది. ప్రస్తుతం రోజుకు 50-100 మందినే అనుమతిస్తామని చెబుతోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఆ తర్వాత ఒకవేళ రిసార్టుల వంటివి నిర్మిస్తే పెద్దపులులు, నల్లమల జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.

రాంపూర్‌ చెంచులతో తీర్మానానికి ప్రతిపాదన

సలేశ్వరం పక్కన రాంపూర్‌ చెంచుపెంట ఉంది. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఉండే డిస్ట్రిక్ట్‌ లెవల్‌ కమిటీ(డీఎల్‌సీ)లో సలేశ్వరం ఎకో టూరిజం ప్యాకేజీపై చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనను రాంపూర్‌ వాసుల ప్రజాభిప్రాయ సేకరణకు రెండు, మూడు రోజుల్లో పంపించనున్నట్లు సమాచారం. బీట్‌ అధికారి, స్థానిక ప్రజలతో కూడిన ఈడీసీ(ఎకో టూరిజం డెవలప్‌మెంట్‌ కమిటీ) ఆమోదం తర్వాత డీఎల్‌సీకి వస్తుంది. ఆ తర్వాత డీఎల్‌సీ నుంచి పీసీసీఎఫ్‌ (ప్రధాన అటవీ సంరక్షణ అధికారి)కి పంపించి.. ఆమోదముద్ర వేయించేలా ప్రణాళిక రూపొందించారు. ఎకో టూరిజంతో స్థానికులకు ఉపాధి లభిస్తుందన్న కారణంతో చెంచుల్ని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు, రాంపూర్‌తో పాటు మరికొన్ని చెంచుపెంటల్ని కోర్‌ ఏరియా నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే కసరత్తు కూడా అటవీశాఖ చేస్తోందని తెలుస్తోంది.

అనుమతుల విషయం ఏంటి?

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులోని సలేశ్వరం ప్రాంతంలో పర్యాటకుల్ని అనుమతించాలంటే ఎన్టీసీఏ(నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ) అనుమతి తీసుకోవాలి. నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డు నుంచి ఆమోదం పొందాలి. అటవీ ప్రాంతంలో రోడ్డు మార్గం నిర్మిస్తున్న నేపథ్యంలో పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోవాలి. ఇవేమీ లేకుండానే, ఈ ప్రక్రియను అనుసరించకుండానే అటవీశాఖ ముందుకు వెళ్తోందన్న ఆరోపణలున్నాయి.


జాతర ఒత్తిడి తగ్గించేందుకు..

జాతర సమయంలో లక్షల మందిని మూడ్రోజుల పాటే అనుమతించడం కంటే.. ఎకో టూరిజంతో 9 నెలలు అనుమతించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆ లోయలో ఒకేసారి రెండు వేల మందికి మించి పట్టరు. రద్దీతో గతేడాది ఇద్దరు మరణించారు. ఏపీలో శ్రీశైలం క్షేత్రం సమీపంలో ఇష్టకామేశ్వరి ఆలయ ప్రాంతం పెద్దపులుల కోర్‌ ఏరియానే. అక్కడ ఎకో టూరిజం ప్యాకేజీ ఉంది. సలేశ్వరంలో జాతర బదులు ఎకో టూరిజమే విధానమే ఉత్తమం.

 రోహిత్‌ గొప్పిడి, డీఎఫ్‌వో, నాగర్‌కర్నూల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని