తగ్గిన గనులశాఖ ఆదాయం

రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది.

Published : 20 May 2024 04:46 IST

గతేడాది రూ.7,705 కోట్లు.. ఈసారి రూ.5,439 కోట్లు
నిర్దేశిత లక్ష్యంలో సాధించిన రాబడి 92 శాతం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. మొత్తంమీద రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రూ.5,916.63 కోట్లతో పోలిస్తే గనులశాఖ 92 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు ఏడాది 2022-23లో ఆదాయ లక్ష్యం రూ.6,399 కోట్లు అయితే ఏకంగా రూ.7,705.54 కోట్ల ఆదాయం వచ్చింది. 

బొగ్గు, సున్నపురాయి, గ్రానైట్, బైరటీస్, డోలమైట్, క్వార్ట్జ్, లేటరైట్, మొరం సహా 19 రకాలకు పైగా ఖనిజాలు రాష్ట్రంలో ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఈ ఏడాది గనులశాఖ పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించారు. అక్కడ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మొత్తం ఆదాయంలో 57.12 శాతం బొగ్గు, లైమ్‌స్టోన్, మాంగనీస్, స్టోయింగ్‌ శాండ్‌ వంటి పెద్ద ఖనిజాల ద్వారా వచ్చింది. వీటిలో బొగ్గు ఆదాయం రూ.2900 కోట్లు, మిగిలినవి రూ.212.65 కోట్లు కలిపి రూ.3112.65 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం రూ.3,166.13 కోట్లలో 98 శాతం సాధించినట్లయింది. మిగిలిన చిన్న ఖనిజాల ద్వారా రూ.1,395.50 కోట్లు వస్తాయని అంచనా వేయగా... రూ.1,653.70 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విషయంలో గనులశాఖ లక్ష్యాన్ని మించి 119 శాతం ఫలితాన్ని సాధించింది.

 పెరగని ఇసుక రాబడి...

ఇసుక ఆదాయ లక్ష్యం రూ.1,355 కోట్లు కాగా వచ్చింది రూ.673.55 కోట్లు. అంటే లక్ష్యసాధన 50 శాతం మాత్రమే. 2022-23లో ఇసుకతో రూ.1,564.20 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశిస్తే రూ.757.32 కోట్ల ఆదాయం వచ్చింది. ఇసుక అక్రమాలను నియంత్రించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కొద్దిరోజుల పాటు అధికారులు హడావుడి చేసినా... ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత చూస్తే ఆశించిన మేర ఆదాయం రాలేదు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేది తెలంగాణలోనే. అయితే నదులు, వాగుల్లో ఇసుక అక్రమ తరలింపు కొనసాగుతుండటం, మరోవైపు భవన నిర్మాణాల జోరు తగ్గడం, హైదరాబాద్‌ చుట్టుపక్కల రాతి ఇసుక క్వారీలు..వంటి అంశాలు ఇసుక ఆదాయంపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని