ఈసెట్‌లో 95.86% ఉత్తీర్ణత

పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ గణితం పూర్తయిన విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఈసెట్‌లో 95.86 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 11 బ్రాంచీల్లో ప్రవేశాలకు 23,330 మంది ఈసెట్‌ రాశారు.

Published : 21 May 2024 05:46 IST

బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలకు 23,330 మందికి అర్హత
3 బ్రాంచీల్లో ఏపీ విద్యార్థులకు ప్రథమ ర్యాంకు

సీడీని ఆవిష్కరిస్తున్న ఓయూ వీసీ రవీందర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, ఉపాధ్యక్షులు వెంకటరమణ, కన్వీనర్‌ చంద్రశేఖర్‌

ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ గణితం పూర్తయిన విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఈసెట్‌లో 95.86 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 11 బ్రాంచీల్లో ప్రవేశాలకు 23,330 మంది ఈసెట్‌ రాశారు. వారిలో 22,365 మంది కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటాలో సీట్లు పొందేందుకు అర్హత సాధించారు. ఈసెట్‌ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, సెట్‌ ఛైర్మన్, ఓయూ వీసీ రవీందర్‌లు సోమవారం విడుదల చేశారు. కన్వీనర్‌ పి.చంద్రశేఖర్, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు బి.వెంకటరమణ, మహమూద్‌అలీ, కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్, ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

అందుబాటులో 10,834 సీట్లు

ఈసెట్‌ ద్వారా ప్రవేశాలకు 10,834 సీట్లు అందుబాటులో ఉన్నాయని లింబాద్రి తెలిపారు. జూన్‌ రెండో వారంలో కౌన్సెలింగ్‌ కాలపట్టిక ఇస్తామని చెప్పారు. తెలంగాణలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులు లేవని, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. అందుకే ఆ బ్రాంచీలో టాపర్లు ఆ రాష్ట్ర విద్యార్థులే ఉంటారని వివరించారు. 

ఉద్యోగుల కోసం..

ఉద్యోగులు బీటెక్‌ చదువుకునేలా అఖిల భారత సాంకేతిక విద్యామండలి.. 2023-24 విద్యా సంవత్సరం నుంచి  సాయంత్రం కోర్సులకు (ఆన్‌లైన్‌+ఆఫ్‌లైన్‌లో) అనుమతి ఇచ్చిందని సాంకేతిక విద్యాశాఖ క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలో 12 కళాశాలలు ఈ అనుమతులు పొందాయని, ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో మాత్రమే ప్రవేశాలు జరిగాయని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని