కవిత కస్టడీ జూన్‌ 3 వరకు పొడిగింపు

దిల్లీ మద్యం కేసులో అరెస్టై, ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా జూన్‌ 3 వరకు పొడిగించారు.

Updated : 21 May 2024 05:48 IST

ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై నేడూ కొనసాగనున్న వాదనలు 

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టై, ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా జూన్‌ 3 వరకు పొడిగించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు విధించిన కస్టడీ గడువు సోమవారంతో ముగియడంతో దర్యాప్తు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసినందున ఆమె కస్టడీని పొడిగించాల్సిన అవసరం లేదని కవిత తరఫు న్యాయవాది నితేష్‌ రాణా కోర్టుకు విన్నవించారు. అయితే, ఛార్జిషీట్‌ దాఖలైతే నిందితుల జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించకూడదన్న నిబంధన ఎక్కడా లేదని, దర్యాప్తు సాగుతున్నప్పుడు నిందితుల కస్టడీని పొడిగించవచ్చని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని ఈడీ తరఫు న్యాయవాది జోయెబ్‌హుస్సేన్‌ పేర్కొన్నారు. వాదనలు విన్న అనంతరం కవిత కస్టడీని న్యాయమూర్తి జూన్‌ 3వరకు పొడిగించారు. మరోవైపు ఈ కేసులో కవితతోపాటు మరో నలుగురి పాత్రను ధ్రువీకరిస్తూ ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొనే అంశంపైనా వాదనలు జరిగాయి. ఛార్జిషీట్‌లో ఐదుగురి పాత్రపై ఆధారాలు సహా వివరాలు పొందుపరిచామని, దాన్ని పరిశీలించి పరిగణనలోకి తీసుకోవాలని న్యాయమూర్తికి ఈడీ తరఫు న్యాయవాది విన్నవించారు. ఈడీ న్యాయవాది ప్రిన్స్‌కుమార్‌ పాత్రను కోర్టుకు వివరిస్తూ... ‘‘అతను చారియట్‌ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. ఆప్‌ నేతలకు సౌత్‌గ్రూప్‌ ముట్టజెప్పిన రూ.100 కోట్లను హవాలా మార్గంలో మళ్లించడంలో ఇతని పాత్ర ఉంది. హవాలా ఆపరేటర్‌ ఆర్‌.కాంతికుమార్‌ ద్వారా ప్రిన్స్‌కుమార్‌కు రూ.16 లక్షలు అందాయి. సంబంధిత కాల్‌రికార్డింగ్, కాల్‌డేటా ఆధారాలను సేకరించాం. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్‌కుమార్‌ మూడు మొబైల్‌ నంబర్లు వాడారు’’ అని వెల్లడించారు. న్యాయమూర్తి కావేరి బవేజా జోక్యం చేసుకొని ఆ మూడు నంబర్లు ఎవరి పేరిట ఉన్నాయని ప్రశ్నించారు. మరో నిందితుడు అర్వింద్‌ సింగ్‌ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకపాత్ర పోషించినట్లు ఈడీ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈయన విషయంలోనూ న్యాయమూర్తి వివరణలు కోరడంతో అందుకు కొంత సమయం కావాలని ఈడీ న్యాయవాది విన్నవించారు. ఈడీ అందించిన వివరాలు సమగ్రంగా లేకపోవడంతో న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని