నైనీ బ్లాకులో తవ్వకాలకు తొలగిన అడ్డంకులు

ఒడిశాలోని నైనీ బ్లాకులో బొగ్గు తవ్వకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ మరో నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి చేపట్టే అవకాశం ఉంది.

Published : 22 May 2024 05:20 IST

నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి..
పదేళ్ల క్రితం సింగరేణికి కేటాయింపు

న్యూస్‌టుడే, గోదావరిఖని: ఒడిశాలోని నైనీ బ్లాకులో బొగ్గు తవ్వకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ మరో నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి చేపట్టే అవకాశం ఉంది. ఈ బ్లాకు వన్యప్రాణుల జోన్‌ పరిధిలో ఉందంటూ అక్కడి ప్రభుత్వం అనుమతుల విషయంలో అభ్యంతరం తెలపడంతో ఏడాది కాలంగా అక్కడ పనులు నిలిచిపోయాయి. పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ గనిని సింగరేణికి కేటాయించింది. అనంతరం రూ.కోట్లు వెచ్చించి భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ సహా ప్రారంభానికి అవసరమైన పనులను సంస్థ పూర్తిచేసింది. అయితే ఈ గని ఏనుగుల జోన్‌ కిందకు వస్తుందని ఏడాది క్రితం ఒడిశా ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇక్కడ తవ్వకాలపై సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. దీంతో వారం క్రితమే వన్యప్రాణుల జోన్‌కు సంబంధించి అనుమతి లభించిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే రైల్వే సైడింగ్‌ పనులు పూర్తి చేసిన సంస్థ.. గనిని ప్రారంభించేందుకు అవసరమైన పనులు చేపట్టాల్సి ఉంది. 315 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న ఈ బ్లాకులో.. ఏటా 10 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. 

తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని గనుల్లో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తి చేయాలంటే 7 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తొలగించాలి. దీంతో ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ.3000 నుంచి రూ.3500 వరకు అవుతోంది. ఒడిశాలో రెండు నుంచి మూడు క్యూబిక్‌ మీటర్ల మట్టిని తొలగిస్తే ఒక టన్ను బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉండడంతో, ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ.600 నుంచి రూ.700 మాత్రమే అవుతుందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని