కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులపై కొత్త మార్గదర్శకాలు

కేంద్ర ప్రాయోజిత పథకాల (సెంట్రల్‌ స్పాన్సర్డ్‌ స్కీమ్స్‌-సీఎస్‌ఎస్‌) నిధుల విడుదల, వ్యయానికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలకు రాష్ట్ర ఆర్థికశాఖ బుధవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

Updated : 23 May 2024 04:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రాయోజిత పథకాల (సెంట్రల్‌ స్పాన్సర్డ్‌ స్కీమ్స్‌-సీఎస్‌ఎస్‌) నిధుల విడుదల, వ్యయానికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలకు రాష్ట్ర ఆర్థికశాఖ బుధవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పథకాల అమలులో కేంద్ర ఆర్థికశాఖలోని ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ.. రాష్ట్ర ఆర్థికశాఖలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ, సమాచార వ్యవస్థ.. రిజర్వు బ్యాంకులోని ‘ఈ-కుబేర్‌’ వ్యవస్థలు కలసి పనిచేయాలని కేంద్రం సూచించింది. సీఎస్‌ఎస్‌ను అమలు చేసే కేంద్ర మంత్రిత్వ శాఖ రిజర్వు బ్యాంకులో ప్రత్యేక కోడ్‌తో ఖాతా తెరుస్తుంది. రాష్ట్ర ఆర్థికశాఖ కూడా ‘రాష్ట్ర అనుసంధాన(లింక్డ్‌) పథకం’ పేరుతో రిజర్వు బ్యాంకులో ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. కేంద్రం సూచనల మేరకు.. ప్రభుత్వ శాఖల్లో అమలవుతున్న సీఎస్‌ఎస్‌లకు విడివిడిగా నిధుల విడుదల కోడ్‌లను రాష్ట్ర ఆర్థికశాఖ కేటాయించింది. ఉదాహరణకు పంచాయతీరాజ్‌ శాఖ అమలు చేసే ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్‌ మిషన్‌ సీఎస్‌ఎస్‌కు 015-000 అనే కోడ్‌ను కేటాయించింది. రాష్ట్రంలో సీఎస్‌ఎస్‌ను ఏ శాఖ అమలు చేస్తే.. అదే కోడ్‌తో నిధుల విడుదలకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. వాటి ప్రకారం నిధుల విడుదలకు ఆయా శాఖలు పరిపాలనా ఉత్తర్వులిస్తాయి. డ్రాయింగ్‌ అధికారం ఉన్న అధికారులు నిధుల కోసం ఖజానాకు బిల్లులు దాఖలు చేయాలి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు వాటా నిధులను విడుదల చేయకపోవడంతో కేంద్రం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని