టీఎస్‌ ట్రాన్స్‌కోకు రూ.50 లక్షల జరిమానా

మొయినాబాద్‌ సమీపంలోని మృగవని నేషనల్‌ పార్కు భూమిలో అనుమతుల్లేకుండా విద్యుత్‌ టవర్ల నిర్మాణం చేపట్టారన్న అభియోగంపై టీఎస్‌ ట్రాన్స్‌కోకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రూ.50 లక్షల జరిమానా విధించింది.

Updated : 23 May 2024 04:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: మొయినాబాద్‌ సమీపంలోని మృగవని నేషనల్‌ పార్కు భూమిలో అనుమతుల్లేకుండా విద్యుత్‌ టవర్ల నిర్మాణం చేపట్టారన్న అభియోగంపై టీఎస్‌ ట్రాన్స్‌కోకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రూ.50 లక్షల జరిమానా విధించింది. ఓఆర్‌ఆర్‌ నిర్మాణంతో ఇప్పటికే అటవీ భూమి కుంచించుకుపోయిందని, తాజాగా ట్రాన్స్‌కో చర్యలతో మరింత నష్టపోయిందంటూ నగరానికి చెందిన పర్యావరణవేత్తలు దొంతి నర్సింహారెడ్డి, మహేశ్‌ మామిండ్ల ఎన్జీటీని ఆశ్రయించారు. అనుమతులు లేకుండా టవర్స్‌ ఏర్పాటు చేయడమే కాకుండా మోనోపోల్స్‌కు బదులు క్వాడ్‌ టవర్స్‌ను వేయడంతో వన్యప్రాణులకు ప్రమాదం పొంచి ఉందని వివరించారు. ఈ పనుల కోసం 1851 చెట్లు నరికేశారని తెలిపారు. ఈ వాదనలను ఖండించిన ట్రాన్స్‌కో క్వాడ్‌ టవర్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా రూ.కోట్ల ఖర్చు తగ్గిందని ట్రైబ్యునల్‌కు వివరించింది. అయితే చేస్తున్న ఖర్చుకు, ఇచ్చిన వివరణకు పొంతన లేదని బెంచ్‌ అభిప్రాయపడింది. మరో ప్రతివాదిగా అటవీశాఖను పేర్కొనడంతో ఆ శాఖ సిబ్బంది విచారణకు హాజరై వివరాలు అందించారు. వాదోపవాదాలు విన్న ట్రైబ్యునల్‌.. రూ.50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని