కోర్టు ధిక్కరణ శిక్ష అమలుపై స్టే

ఆరోగ్య కార్యకర్తల వేతనాల చెల్లింపులకు సంబంధించి కోర్టు ఉత్తర్వులను 15 రోజుల్లో అమలు చేయని పక్షంలో నిర్మల్‌ కలెక్టర్‌కు నెల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా, మున్సిపల్‌ కమిషనర్‌కు 15 రోజుల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ..

Published : 24 May 2024 04:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్య కార్యకర్తల వేతనాల చెల్లింపులకు సంబంధించి కోర్టు ఉత్తర్వులను 15 రోజుల్లో అమలు చేయని పక్షంలో నిర్మల్‌ కలెక్టర్‌కు నెల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా, మున్సిపల్‌ కమిషనర్‌కు 15 రోజుల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో 44 మంది ఆరోగ్య కార్యకర్తల నియామకం జరిగింది. ఆరు నెలలైనా వీరికి వేతనాలు చెల్లించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. వేతనాలు చెల్లించాలంటూ 2022 సెప్టెంబరులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో సయ్యద్‌ షకీర్‌ అహ్మద్, మరో 27 మంది వేర్వేరుగా రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారించిన సింగిల్‌ జడ్జి.. కలెక్టర్‌ స్థాయి వ్యక్తి కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోగా, వాస్తవాలను వక్రీకరించి అఫిడవిట్‌ దాఖలు చేయడం కోర్టు ధిక్కరణేనని తేల్చి చెప్పారు. చివరి అవకాశంగా వేతనాలు చెల్లించడానికి  15 రోజుల గడువు ఇస్తూ మే 3న ఉత్తర్వులు జారీచేశారు. చెల్లించకుంటే కోర్టు ధిక్కరణ కింద కలెక్టర్‌ నెల రోజులు, కమిషనర్‌ 15 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు వెలువరించారు. దీనిని సవాలు చేస్తూ అప్పటి నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ అప్పీలు దాఖలు చేశారు. అప్పీలుపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని