జీడిమెట్ల భూ వివాదంపై రికార్డులు సమర్పించండి

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం జీడిమెట్లలోని సర్వే నం.82, 83లలోని భూ వివాదంపై ఉన్న కోర్టు కేసుల రికార్డులను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Published : 25 May 2024 03:19 IST

మల్లారెడ్డి తదితరుల పిటిషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం జీడిమెట్లలోని సర్వే నం.82, 83లలోని భూ వివాదంపై ఉన్న కోర్టు కేసుల రికార్డులను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ, డీసీపీ, ఇన్‌స్పెక్టర్, కుత్బుల్లాపూర్‌ తహసీల్దారును ఆదేశించాలంటూ ఎమ్మెల్యేలు సి.హెచ్‌.మల్లారెడ్డి, ఎం.రాజశేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జీడిమెట్లలోని సర్వే నం.82, 83లలో పిటిషనరు, వారి కుటుంబసభ్యులు 2011లో 2.14 ఎకరాలను కొనుగోలు చేసి లీజుకు ఇచ్చారన్నారు. పిటిషనర్లకు నోటీసు, సమాచారం ఇవ్వకుండా తహసీల్దారు, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ సర్వే చేయడానికి వెళ్లారన్నారు. పిటిషనర్లు కొనుగోలు చేసిన స్థలం తమదేనంటూ శ్రీనివాసరెడ్డి, మరికొందరు చుట్టూ ఉన్న షీట్లను కూల్చివేశారని, ఆ భూములను చట్టవిరుద్ధంగా ఖాళీ చేయించే ప్రయత్నాలను నిరోధించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఈ వివాదానికి సంబంధించి పూర్తి రికార్డులతోపాటు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వారానికి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని