నేత పేరిట మేత

తెలంగాణలో పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థులకు ఏకరూపదుస్తు(యూనిఫాం)ల తయారీకి చేనేతకు బదులు పవర్‌లూమ్‌ వస్త్రాలను సరఫరాచేసి లబ్ధి పొందాలని కొన్ని చేనేత సహకార సంఘాలు యత్నించినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

Published : 25 May 2024 04:59 IST

చేనేతకు బదులు పవర్‌లూమ్‌లు
యూనిఫాం వస్త్రాల తయారీలో కొన్ని సొసైటీల నిర్వాకం
మూడురెట్ల లాభార్జనకు మోసాలు
తనిఖీల్లో గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థులకు ఏకరూపదుస్తు(యూనిఫాం)ల తయారీకి చేనేతకు బదులు పవర్‌లూమ్‌ వస్త్రాలను సరఫరాచేసి లబ్ధి పొందాలని కొన్ని చేనేత సహకార సంఘాలు యత్నించినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. చేనేత శాఖ అధికారులు ఆయా సంఘాల వద్ద గల నిల్వలను ప్రయోగశాలలో తనిఖీ చేయించగా... అసలు గుట్టు రట్టయింది. దీంతో వాటిపై చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఏటా రాష్ట్ర విద్యా, సంక్షేమ శాఖలు తమ పరిధిలోని విద్యార్థులకు రూ.160 కోట్ల విలువైన ఏకరూప దుస్తులను రాష్ట్ర చేనేత సహకార సంస్థ(టెస్కో) ద్వారా తయారు చేయిస్తున్నాయి. టెస్కో అధికారులు చేనేత సంఘాలకు ఆర్డర్లు ఇచ్చి వీటిని తయారు చేయిస్తారు. నూలును వస్త్రాలుగా మార్చి సంఘాలు మీటర్ల లెక్కన టెస్కోకు సరఫరా చేస్తారు. అధికారులు వాటిని దుస్తులుగా కుట్టించి విద్యార్థులకు అందజేస్తారు. ఇందుకు చేనేత వస్త్రాలను మాత్రమే వినియోగించాలి. ఈ ఏడాది సంఘాలకు ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఉన్నతాధికారులు వస్త్రాల నాణ్యతను పరిశీలించాలని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. కొన్ని చోట్ల వస్త్రాలు నాణ్యంగా లేకపోవడం, పరిశీలిస్తుండగానే చిరిగిపోవడంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారులు జిల్లాలవారీగా వస్త్రాల నమూనాలను తెప్పించి వాటిని బెంగళూరులోని సెంట్రల్‌ సిల్క్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. అక్కడి శాస్త్రవేత్తలు వాటిని పరిశీలించగా విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. 

17 సొసైటీల్లో 10 పవర్‌లూమే 

మొత్తం 17 సొసైటీల నుంచి వచ్చిన వస్త్రాల నమూనాలను పరిశీలించగా అందులో 10 సొసైటీలవి పవర్‌లూమ్‌ వస్త్రాలే అని తేలింది. పవర్‌లూమ్‌ వస్త్రాలపై డిజైన్‌ ప్రింట్లు వేసి సరఫరా చేశారని గుర్తించారు. చేనేత వస్త్రాలు నాణ్యంగా ఉంటాయి. వాటిని సాగదీయడానికి అవకాశం ఉండదు. కానీ, సొసైటీలు ఇచ్చిన నమూనా వస్త్రాలను సాగదీసినట్లు తేలింది. 

చేనేత శాఖ విచారణ.. 

బెంగళూరు ప్రయోగశాల తేల్చిన ఫలితాలతో రాష్ట్ర చేనేత శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల తనిఖీలు నిర్వహించింది. అక్రమంగా లాభాలు ఆర్జించేందుకే సొసైటీలు ఇలా చేనేతకు బదులు పవర్‌లూమ్‌ను వినియోగించినట్లు గుర్తించింది. ప్రస్తుతం చేనేత శాఖ మీటర్‌ వస్త్రానికి రూ.101 చెల్లిస్తోంది. అదే పవర్‌లూమ్‌ వస్త్రం మీటర్‌ ధర రూ.37 మాత్రమే. ఇలా చేనేతకు బదులు పవర్‌లూమ్‌ వస్త్రాలు అందజేసి మూడొంతుల లాభాలను ఆర్జించేందుకు సొసైటీలు ఈ మోసానికి పాల్పడ్డట్లు తనిఖీల్లో నిర్ధారణ అయింది. ఆయా సొసైటీలపై చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు బెంగళూరు ప్రయోగశాలలో తేలిన ఫలితాలపై తమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో పలు చేనేత సంఘాలు ఏకరూపదుస్తులలోనేగాక ఇతరత్రా వస్త్రాల తయారీలోనూ ఇలా అక్రమాలకు పాల్పడ్డాయనే అనుమానంతో విస్తృతస్థాయి విచారణ జరిపేందుకు   సమాయత్తమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని