హరిత ఇంధన రాష్ట్రంగా తెలంగాణ

కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణహిత, హరిత ఇంధన రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. శనివారం ప్లాజా హోటల్‌లో ‘‘బొగ్గు ఆధారిత విద్యుత్తు నుంచి పర్యావరణహిత హరిత ఇంధనం వైపు తెలంగాణ మారాలి’’ అనే అంశంపై ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Updated : 26 May 2024 03:42 IST

పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌ : కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణహిత, హరిత ఇంధన రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. శనివారం ప్లాజా హోటల్‌లో ‘‘బొగ్గు ఆధారిత విద్యుత్తు నుంచి పర్యావరణహిత హరిత ఇంధనం వైపు తెలంగాణ మారాలి’’ అనే అంశంపై ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ..‘‘మా ప్రభుత్వం అన్ని రంగాలకు నిరంతరం విద్యుత్తు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తితో ఎక్కువ కాలుష్యం వెలువడుతున్నందున సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి కోసం చర్యలు తీసుకుంటాం. ఇంధనశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా నేను ఐదేళ్లు పనిచేశాను. కర్బన ఉద్గారాలను నియంత్రించడం ద్వారా మాత్రమే పుడమిని కాపాడుకోగలం. ప్రస్తుతం విపరీతంగా వెలువడుతున్న కర్బన ఉద్గారాలతో అనేక నష్టాలు జరుగుతున్నాయి మంత్రిగా నా శాయశక్తులా ప్రయత్నించి పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తాను. అందరం కలసి పనిచేస్తే మన పుడమిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం కష్టమేమీ కాదు. దేశంలో సౌర విద్యుదుత్పత్తి ప్రారంభించినప్పుడు ఒక్కో యూనిట్‌ ధర రూ.18 వరకూ ఉండేది. ఇప్పుడు థర్మల్‌కన్నా తక్కువకే వస్తోంది. విద్యుత్‌ నిల్వ చేసే బ్యాటరీలను తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా కూడా నాకు హరిత ఇంధన వినియోగమే ఇష్టం’’ అని చెప్పారు. రైతుసంఘం నేత దొండి మాధవరెడ్డి, మాజీ సమాచార కమిషనర్‌ దిలీప్‌రెడ్డి తదితరులు హరిత ఇంధనాన్ని అందరూ వినియోగించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని