ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని.. గేట్లు, కాలువల మరమ్మతులు, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం) కమిటీ అధికారులకు సూచించింది.

Published : 29 May 2024 04:51 IST

ఓఅండ్‌ఎం కమిటీ సమావేశంలో నిర్ణయం

ఈనాడు హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని.. గేట్లు, కాలువల మరమ్మతులు, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం) కమిటీ అధికారులకు సూచించింది. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్వహణ, చేపట్టాల్సిన పనులపై కమిటీ మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమై చర్చించింది. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నాగేంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌) అనిల్‌ కుమార్, అన్ని ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు. మరమ్మతులకు సంబంధించి సుమారు 60 ప్రతిపాదనలు చీఫ్‌ ఇంజినీర్లు అందజేయగా వాటి గురించి వివరంగా చర్చించారు. గేట్ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం, అవసరమైన చోట డీజిల్‌ జనరేటర్ల కొనుగోలు, నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా చూడటం, పంపుహౌస్‌ల నిర్వహణ, మోటార్లు, పంపులు, ప్యానల్‌బోర్డులు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవడం, కడియం ప్రాజెక్టులో గ్రౌటింగ్‌ పనులు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎస్సారెస్పీలో స్పిల్‌వే నిర్వహణకు 365 రోజులు సిబ్బంది ఉండేలా నియామకం చేపట్టాలని, ఇందుకోసం రూ.1.11 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. చెరువులు, చెక్‌డ్యాంల మరమ్మతులు, చిన్న ఎత్తిపోతల నిర్వహణ గురించి చర్చించి చీఫ్‌ ఇంజినీర్లు అందజేసిన ప్రతిపాదనల్లో ఎక్కువ భాగం ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొన్ని తిరస్కరించినట్లు తెలిసింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని