అమెరికాతో హైదరాబాద్‌ది బలమైన బంధం: భట్టి

స్నేహం, వ్యాపారం విషయాల్లో అమెరికాతో హైదరాబాద్‌ బంధం ఎంతో బలమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Published : 08 Jun 2024 05:29 IST

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క. చిత్రంలో అమెరికా
కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్, అమెరికా మెరైన్‌ అడ్మిరల్‌ మైఖేల్‌ ఎల్‌.బాకర్‌ 

మాదాపూర్, న్యూస్‌టుడే: స్నేహం, వ్యాపారం విషయాల్లో అమెరికాతో హైదరాబాద్‌ బంధం ఎంతో బలమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యూఎస్‌ కాన్సులేట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన అమెరికా 248వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ... ‘‘అతి ప్రాచీన ప్రజాస్వామిక దేశమైన అమెరికా భారత్‌కు మంచి మిత్రదేశం. ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఆ దేశంతో అవినాభావ సంబంధముంది. అందుకే మన పిల్లలు ఉన్నత చదువుల నిమిత్తం ఎక్కువగా అమెరికాకే వెళ్తున్నారు. అక్కడ తెలుగు భాష అతివేగంగా విస్తరిస్తోంది. వ్యాపారం, సంస్కృతి, స్నేహం వంటి విషయాల్లో తెలంగాణ... అమెరికాల మధ్య బలమైన బంధం ఉంది. మున్ముందు మరింత బలపడుతుంది’’ అని ఆశాభావం వ్యక్తంచేశారు. అంతకుముందు యూఎస్‌ పోలీసులు భట్టికి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్, హైదరాబాద్‌ జెన్నీఫర్‌ లార్సన్, అమెరికా మెరైన్‌ అడ్మిరల్‌ మైఖేల్‌ ఎల్‌.బాకర్, డీజీపీ రవిగుప్తా, అదనపు డీజీలు జితేందర్, మహేశ్‌భగవత్, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జయప్రకాశ్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని