ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలి

రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులను వేగంగా పరిష్కరించి, ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.

Updated : 08 Jun 2024 06:27 IST

 అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులను వేగంగా పరిష్కరించి, ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. పూర్తిగా అర్హమైన స్థలాలకే ఈ పథకాన్ని అమలు చేయాలని, కబ్జాదారులకు వర్తింపజేయొద్దని సూచించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఆర్థిక, రెవెన్యూ, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరు, గత రెండేళ్ల ఆర్థిక ప్రగతిపై భట్టి సమీక్షించారు. ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో నియమించిన కమిటీ పనితీరు తెలుసుకున్నారు. ఆదాయం పెరిగేలా తరచూ సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకునేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని పటిష్ఠం చేసి బడ్జెట్‌ అంచనాలు అందుకోవాలన్నారు. ఆర్టీసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న వడ్డీని సమీక్షించుకుని తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సంస్థలకు ఆయా రుణాలు బదిలీ చేసుకోవాలని చెప్పారు. ఇటీవల సింగరేణిలో ఈ విధానం అమలు చేయడంతో రూ.వందల కోట్ల ప్రయోజనం చేకూరిందని వివరించారు. హౌసింగ్‌ బోర్డు, రాజీవ్‌ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన గృహాలు, వచ్చిన ఆదాయం వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ధరలకే... ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్సలు అందించేలా యాజమాన్యాలను ఒప్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వాణిజ్యపన్నుల కమిషనర్‌ శ్రీదేవి, రవాణాశాఖ కమిషనర్‌ బుద్ధప్రసాద్, ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి హరిత, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని