మరింత చేరువగా ‘కృషి విజ్ఞానం’

రైతులకు నవీన సాంకేతికత, పరిశోధన ఫలితాలతోపాటు బహుముఖ సేవలందిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది.

Published : 09 Jun 2024 04:33 IST

ప్రతి గ్రామీణ జిల్లాకో కేవీకే ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం  
రాష్ట్రానికి కొత్తగా 16 వచ్చే అవకాశం 

ఈనాడు, హైదరాబాద్‌: రైతులకు నవీన సాంకేతికత, పరిశోధన ఫలితాలతోపాటు బహుముఖ సేవలందిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతమున్న కేంద్రాలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా, జిల్లాస్థాయి సమగ్ర వ్యవసాయ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించింది. తెలంగాణలో ఇప్పటికే 16 కేవీకేలు ఉండగా కొత్తగా 16 రానున్నాయి. దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్రం అవసరమైన వివరాలను సిద్ధం చేస్తోంది. కేవీకేలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేస్తున్నాయి. వీటి నిర్వహణ, జీతభత్యాలను పూర్తిగా కేంద్ర వ్యవసాయ శాఖనే భరిస్తుంది. పరిశోధన సంస్థలు సృష్టించిన నూతన వంగడాలను మొదట వీటి క్షేత్రాల్లో పరిశీలిస్తారు. వచ్చిన ఫలితాలపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. నూతన సాగు విధానాలపైనా వీటిల్లో పరిశోధనలు జరుతాయి. వీటిద్వారా నాణ్యమైన విత్తనాలను, భూసార పరీక్షల కిట్లను, వ్యవసాయ యంత్రాలు, పరికరాలనూ అందజేస్తున్నారు. చీడపీడలు, తెగుళ్ల నివారణ, వాతావరణ సమాచారమూ లభిస్తోంది. 

ప్రస్తుతం నడుస్తున్న 16 కేంద్రాలివీ...

తెలంగాణలో ప్రస్తుతం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎనిమిది... ఆదిలాబాద్‌ జిల్లా రామ్‌నగర్, ఖమ్మం జిల్లా వైరా, నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెం, నల్గొండ జిల్లా కంపాసాగర్, నిజామాబాద్‌ జిల్లా రుద్రూరు, మహబూబాబాద్‌ జిల్లా మల్యాల, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా గరిమల్లెపాడు, మంచిర్యాల జిల్లా బుడాకలాన్‌లో కేవీకేలు ఉన్నాయి. పశువైద్య వర్సిటీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా మామునూరులో, ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లాలో, కేంద్ర మెట్ట నేలల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో కృషి విజ్ఞాన కేంద్రాలున్నాయి. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, మహబూబ్‌నగర్‌ జిల్లా మదనాపురం, సంగారెడ్డి జిల్లా దిడ్గి, నల్గొండ జిల్లా గరిడేపల్లి, మెదక్‌ జిల్లా తునికిలలో కేంద్రాలు నడుస్తున్నాయి. 

కొత్తగా ఏర్పాటయ్యే ప్రాంతాలివీ... 

కేంద్రం నిర్ణయం అమలైతే ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, వరంగల్, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, సిద్దిపేట, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, జగిత్యాల, జనగామ, మెదక్, మల్కాజిగిరి మేడ్చల్‌ జిల్లాల్లో కొత్త కేవీకేలు ఏర్పాటవుతాయి. 

ఒక్కో కేంద్రం 50 ఎకరాల్లో... 

విశ్వ విద్యాలయాలతోపాటు ఏవైనా స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం వాటికి కేవీకేలను మంజూరు చేస్తుంది. ప్రతీ కేవీకే 50 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. రైతులు ప్రయోగాల కోసం తమ పొలాలను ఇచ్చేందుకు ముందుకొస్తే వాటినే కేంద్రాలుగా ఉపయోగిస్తారు. ఇందులో ఒక సీనియర్‌ సెంటిస్టు, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక శాస్త్రవేత్తలు ఆరుగురితోపాటు ఒక మేనేజర్, ఇద్దరు కార్యక్రమ సహాయకులు, మరో ఇద్దరు పరిపాలన సిబ్బంది, ఒక ట్రాక్టర్‌ డ్రైవర్, మరో ముగ్గురు సాంకేతిక ఉద్యోగులను నియమిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని