ఉపాధి కూలీల వేతన పెంపునకు చర్యలు

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉపాధిహామీ పథకం కూలీలకు దినసరి వేతనం పెంపు దిశగా చర్యలు చేపడుతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి సీతక్క తెలిపారు.

Published : 11 Jun 2024 05:42 IST

రాష్ట్ర మంత్రి సీతక్క
 

సదస్సులో మాట్లాడుతున్న మంత్రి సీతక్క. చిత్రంలో ప్రసాద్, వెంకట్రాములు, శివదాసన్, వెంకట్, నాగయ్య

ఈనాడు, హైదరాబాద్‌- బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉపాధిహామీ పథకం కూలీలకు దినసరి వేతనం పెంపు దిశగా చర్యలు చేపడుతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) ఆధ్వర్యంలో ‘గ్రామీణ ఉపాధిహామీ చట్టం అమలు - సవాళ్లు’ అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘పదేళ్ల ఎన్డీయే సర్కారు పాలనలో పేదలను పక్కనపెట్టి బహుళజాతి సంస్థలకు పెద్దఎత్తున లబ్ధి చేకూర్చారు. యూపీఏ హయాంలో తెచ్చిన ఉపాధిహామీ చట్టాన్ని భాజపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కూలీలకు పని దినాలను పెంచకుండా, పని ప్రదేశాల్లో వసతులు కల్పించకుండా, పెండింగ్‌ నిధులు విడుదల చేయకుండా ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయాలనే కుట్ర చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ పథకంపై ప్రత్యేక సమీక్ష చేస్తున్నాం’ అని తెలిపారు. కేరళకు చెందిన రాజ్యసభ సభ్యుడు శివదాసన్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ.. పట్టణ కార్మికులకు కూడా ఉపాధిహామీ పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. కూలీలకు 200 రోజుల పనిదినాలను కల్పించడంతోపాటు పథకానికి నిధుల కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సదస్సులో వ్యకాస రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్వి ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.


వానాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రతిరోజూ పర్యవేక్షణ

ర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని, జిల్లా, డివిజనల్, మండల పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య పనులను రోజూ పర్యవేక్షించాలన్నారు. ఆమె సోమవారం సచివాలయంలో వానాకాలం సీజన్‌లో వర్షాలు, వరదల పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ‘కుంటలు, చెరువులు, జలాశయాలకు వస్తున్న వరదపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకొని ముంపు నివారణ చర్యలు తీసుకోవాలి. కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్ల నుంచి నివాసితులను తరలించాలి. పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటితో అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలి. తాగునీటి ట్యాంకులను శుద్ధి చేయాలి. ఆరోగ్యశాఖ సహకారంతో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేయాలి’ అని సూచించారు. మహిళాశక్తి పథకం కింద పాఠశాలల విద్యార్థులకు విద్యాసంవత్సరం ఆరంభంలోనే యూనిఫాంలు పంపిణీ చేస్తామని సీతక్క చెప్పారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, కమిషనర్‌ అనితా రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని