Teachers Transfers: నేటి నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శుక్రవారం సాయంత్రం షెడ్యూల్‌ విడుదల చేశారు.

Published : 08 Jun 2024 06:33 IST

 మల్టీ జోన్‌-1, 2 వారీగా షెడ్యూల్‌ జారీ
జోన్‌-1లో ఈ నెల 22కు, జోన్‌-2లో 30వ తేదీకి ప్రక్రియ పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శుక్రవారం సాయంత్రం షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రక్రియ మొదలు కానుంది. గత ఏడాది సెప్టెంబరులో న్యాయ వివాదాలతో ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. మళ్లీ అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఫలితంగా మల్టీ జోన్‌-1లో ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు (15 రోజులు), మల్టీ జోన్‌-2లో 30వ తేదీ వరకు (23 రోజులు) ప్రక్రియ జరగనుంది. మల్టీ జోన్‌-2 పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో కోర్టు కేసులున్నందున మల్టీ జోన్‌ స్థాయి అయిన గెజిటెడ్‌ హెచ్‌ఎంల పదోన్నతులు మాత్రమే పూర్తి చేస్తారు.

పదోన్నతులు పొందేది 18,495 మంది

రాష్ట్రవ్యాప్తంగా 18,495 మంది ఉపాధ్యాయులు పదోన్నతి పొందనున్నారు. ప్రధానోపాధ్యాయులుగా 763 మంది, స్కూల్‌ అసిస్టెంట్లుగా 5,123, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా 2,130, భాషా పండితులు, పీఈటీలు 10,479 మంది స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్‌ పొందనున్నారు. గత ఏడాది గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా రెండు జోన్లలో 1250 మందికి పదోన్నతి లభించింది.

గత ఏడాది 12,472 మంది బదిలీ అయ్యారు. ఈసారి మరో 40 వేల మందికి పైగా బదిలీ అవుతారని విద్యాశాఖ అంచనా వేసింది. ఉద్యోగ విరమణ సమయం మూడేళ్లలోపు ఉన్న వారిని బదిలీ చేయరు.

మల్టీ జోన్‌-1 (వరంగల్‌) షెడ్యూల్‌ ఇదీ...

  • 8 నుంచి 9 వరకు: స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు అర్హులైన వారి సీనియారిటీ జాబితా (ఎస్‌జీటీ, సమానమైన) ప్రదర్శన
  • 13-16 వరకు: ఆన్‌లైన్‌ పోర్టల్‌లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడం, పదోన్నతి ఉత్తర్వుల జారీ
  • 17వ తేదీ: ఎస్‌జీటీల బదిలీలకు ఖాళీల వెల్లడి
  • 18-20 వరకు: సీనియారిటీ జాబితా వెల్లడి, వెబ్‌ ఆప్షన్ల నమోదు
  • 21-22 వరకు: ఎస్‌జీటీలకు బదిలీ ఉత్తర్వుల జారీ

మల్టీ జోన్‌-2 షెడ్యూల్‌ ఇదీ...

  • 8న: గెజిటెడ్‌ హెచ్‌ఎం పదోన్నతులకు అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్ల జాబితా వెల్లడి
  • 10-11 వరకు: తుది సీనియారిటీ జాబితా వెల్లడి, వెబ్‌ ఆప్షన్ల నమోదు, పదోన్నతి ఉత్తర్వుల జారీ
  • 12-13 వరకు: స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీల వెల్లడి
  • 16-18 వరకు: స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలకు తుది సీనియారిటీ జాబితా వెల్లడి, ఆప్షన్ల నమోదు
  • 19న: స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీ ఉత్తర్వుల జారీ
  • 20న: స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీల తర్వాత ఖాళీల వెల్లడి. వాటిని ఎస్‌జీటీలకు పదోన్నతి ఇచ్చి భర్తీ చేస్తారు.
  • 21-24 వరకు: స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతికి అర్హులైన ఎస్‌జీటీ తుది సీనియారిటీ జాబితా ప్రదర్శన, పదోన్నతి ఉత్తర్వుల జారీ
  • 25న: ఎస్‌జీటీ ఖాళీల వెల్లడి 
  • 26-28వ తేదీ: బదిలీల కోసం ఎస్‌జీటీల తుది సీనియారిటీ జాబితా ప్రదర్శన, వెబ్‌ ఆప్షన్ల నమోదు
  • 29-30 వరకు: ఎస్‌జీటీల బదిలీ ఉత్తర్వుల జారీ 

ఉపాధ్యాయ సంఘాల హర్షం

తొమ్మిది నెలలుగా వేచిచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయడంపై పలు సంఘాలు హర్షం ప్రకటించాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంలకు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్‌ కోరారు. రంగారెడ్డి జిల్లాలో జీహెచ్‌ఎం పదోన్నతులు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న భాషా పండితులు, పీఈటీల పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేస్తున్నందుకు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు (ఆర్‌యూపీపీటీఎస్‌) సి.జగదీష్, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, తెలంగాణ (ఎస్‌ఎల్‌టీఏ టీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్, ఆర్‌యూపీపీ తెలంగాణ ప్రతినిధులు వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని