Life Insurance Claim: బీమా సొమ్ము ఎగవేతకు నకిలీ ఆధారాల సృష్టి

జీవిత బీమా పాలసీ సొమ్ము నిరాకరించడానికి ఓ బీమా సంస్థ నకిలీ అధారాలను సృష్టించింది. ఓ ఆసుపత్రిలో పాలసీదారు చికిత్స పొందినట్లు చూపి, వాస్తవాలను దాచి పాలసీ తీసుకున్నారన్న నెపంతో పాలసీని తిరస్కరించింది.

Updated : 28 May 2024 07:29 IST

డాక్టర్‌ సాక్ష్యంతో బీమా కంపెనీ గుట్టు రట్టు
రూ.75 లక్షల ప్రీమియం 7 శాతం వడ్డీతో చెల్లించాల్సిందే
హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: జీవిత బీమా పాలసీ సొమ్ము నిరాకరించడానికి ఓ బీమా సంస్థ నకిలీ అధారాలను సృష్టించింది. ఓ ఆసుపత్రిలో పాలసీదారు చికిత్స పొందినట్లు చూపి, వాస్తవాలను దాచి పాలసీ తీసుకున్నారన్న నెపంతో పాలసీని తిరస్కరించింది. పాలసీదారు చికిత్సలకు సంబంధించిన ఎలాంటి రికార్డు లేదని, బీమా సంస్థ పేర్కొన్న రికార్డులోని తేదీ నాటికి అసలు ఆసుపత్రిలో తాను పనిచేయలేదని, ఆ సంతకం తనది కాదంటూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ముందు డాక్టర్‌ సాక్ష్యం ఇవ్వడంతో అసలు గుట్టు బయటపడింది. దీంతో పాలసీ సొమ్ము రూ.75 లక్షలను నామినీకి 2018 నుంచి 7 శాతం వడ్డీతో చెల్లించాలని, దీంతోపాటు ఖర్చుల కింద మరో రూ.25 వేలు ఇవ్వాలంటూ హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. 

ఇదీ నేపథ్యం..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం లక్ష్మీగూడకు చెందిన ఇ.భాగ్యమ్మ 2016లో రూ.75 లక్షలకు హెచ్‌డీఎఫ్‌సీ నుంచి జీవిత బీమా పాలసీ తీసుకున్నారు. రెండేళ్లపాటు రూ.30 వేలకుపైగా ప్రీమియం చెల్లించారు. 2018లో భాగ్యమ్మ గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో తనకు పాలసీ సొమ్ము ఇప్పించాలంటూ నామినీ అయిన ఆమె భర్త ఇ.సహదేవకుమార్‌ బీమా సంస్థకు దరఖాస్తు చేసుకున్నారు. పాలసీదారుకు గతంలోనే అధిక రక్తపోటుతోపాటు గుండె సంబంధిత ఇబ్బందులున్నాయని, యాంజియోప్లాస్టీ చేసినట్లు రికార్డులున్నాయంటూ ఆ దరఖాస్తును బీమా సంస్థ తిరస్కరించింది. దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో సహదేవకుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పాలసీ సొమ్ము రూ.75 లక్షలను 15 శాతం వడ్డీతో, పరిహారంగా రూ.5 లక్షలు, ఖర్చుల కింద రూ.లక్ష ఇప్పించాలని కోరారు. దీనిపై కమిషన్‌ సభ్యులు కె.రంగారావు, ఆర్‌.ఎస్‌.రాజెశ్రీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బీమా సంస్థ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పాలసీదారు వాస్తవాలు వెల్లడించలేదని, 2015 జూన్‌ 15 నుంచి 19 వరకు సిగ్మా ఆసుపత్రిలో చికిత్స పొందారని తమ విచారణలో తేలడంతో పరిహారాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. దీనిపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది వి.గౌరీశంకరరావు అభ్యంతరం తెలిపారు. పాలసీదారుకు ఎలాంటి జబ్బు లేదని, సిగ్మా ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స తీసుకోలేదని, కావాలంటే సంబంధిత డాక్టర్‌ను పిలిపించవచ్చన్నారు. బీమా సంస్థ తప్పుడు రికార్డులు సృష్టించిందన్నారు. పాలసీ సొమ్మును నిరాకరించడం సేవాలోపమేనని పేర్కొన్నారు. కమిషన్‌ సమన్లతో హాజరైన సిగ్మా ఆసుపత్రి డాక్టర్‌ కె.అనూప్‌రామన్‌.. తాను ఆసుపత్రిలో 2016లో చేరానని, పాలసీదారుకు సంబంధించి ఎలాంటి చికిత్సల రికార్డు లేదని, బీమా సంస్థ సమర్పించిన రికార్డులోని చేతిరాత తనది కాదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని వెల్లడించారు. ఈ సాక్ష్యం తప్పని నిరూపించుకోవడానికి వినియోగదారుల కమిషన్‌ ఇచ్చిన అవకాశాలను బీమా సంస్థ వినియోగించుకోలేదు. పాలసీపై విచారణ జరిపిన వ్యక్తిని, బీమా సంస్థ బ్రాంచి మేనేజర్లను ప్రశ్నించడానికి తమకు అవకాశం కల్పించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరగా.. వారు హాజరు కాలేదు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పాలసీదారుకు చికిత్స జరిగిందని నిరూపించడంలో బీమా సంస్థ విఫలమైందని పేర్కొంది. పిటిషనర్‌కు పాలసీ సొమ్ము రూ.75 లక్షలను 7 శాతం వడ్డీతో చెల్లించాల్సిందేనని హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని