Heavy rains: తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం

అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు.

Published : 18 May 2024 03:55 IST

వడ్లను ముంచెత్తిన అకాల వర్షాలు
పలు జిల్లాల్లో అన్నదాతలకు తీవ్ర నష్టం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం తాడిచెర్లకు చెందిన రైతు పేరాల నిరంజన్‌కు చెందిన
రెండెకరాల వరి పంట వర్షానికి నేలవాలింది. రూ.30 వేలకు పైగా నష్టమొచ్చిందని ఆయన వాపోతున్నారు 

ఈనాడు, మహబూబాబాద్, పెద్దపల్లి - ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి: అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వాన... రాష్ట్రంలోని అనేక కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల కుప్పలను ముంచెత్తింది. కొన్నిచోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. అనేకచోట్ల పెద్దఎత్తున తడిసింది. మార్కెట్‌ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన వడ్లు తమ కళ్ల ముందే వర్షార్పణం కావడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

తూకంలో జాప్యం... టార్పాలిన్లు కప్పేలోపే... 

పెద్దపల్లి జిల్లా ధర్మారం, జూలపల్లి, పెద్దపల్లి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. రైతులు సర్దుకుని టార్పాలిన్లు కప్పేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక్కడ కేంద్రాలకు వారం క్రితమే ధాన్యం తెచ్చినప్పటికీ నిర్ణీత తేమ శాతం రాలేదంటూ నిర్వాహకులు తూకం వేయడంలో జాప్యం చేశారని రైతులు వాపోయారు. మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీపురం కొనుగోలు కేంద్రంలో వర్షాలకు 200 క్వింటాళ్ల వడ్లు తడిసిపోయాయి. 

రంగు మారుతోంది... మొలకెత్తుతోంది 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. పరదాలు కప్పినా   రాశుల కింది నుంచి వరదనీరు వెళ్లడంతో ధాన్యం కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. వరుస వానలతో ధాన్యం తడిసి రంగు మారుతోంది. హనుమకొండ జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు మొలకెత్తాయి. భూపాలపల్లిలో 20%, ములుగులో 30%, వరంగల్‌ జిల్లా పాకాల ఆయకట్టు పరిధిలో 40% వరకు పంట కోత కోయాల్సిన వరి పొలాలున్నాయి. 

పది రోజుల్లో మూడుసార్లు వానలు 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పది రోజుల్లో మూడుసార్లు వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా యాసంగిలో 83 వేల ఎకరాల్లో వరి వేశారు. ఇంకా 15 వేలకుపైగా ఎకరాల్లో కోతలు కోయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టుకున్న ధాన్యం వర్షానికి తడిసిపోయింది. జిల్లావ్యాప్తంగా 25 వేల టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.


వారం రోజులుగా తడుస్తోంది

వారం రోజుల కిందట వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాం. తేమశాతం తగ్గాలని ఆరబోశాం. వర్షానికి అంతా తడిసిపోయింది. వర్షం కురిసినప్పుడల్లా ధాన్యంపై కవర్లు కప్పుతున్నాం. ఎండ కాసినప్పుడు ఆరబోస్తున్నాం. మరోసారి వర్షం పడితే వడ్లన్నీ మొలకెత్తుతాయనే భయంగా ఉంది.

దోలె పద్మ, మోరంచపల్లి, భూపాలపల్లి మండలం


3 క్వింటాళ్లు కొట్టుకుపోయాయి

నాకున్న 4.5 ఎకరాల్లో వరి వేస్తే 70 క్వింటాళ్ల ధాన్యం వచ్చింది. మూడ్రోజుల కిందట ధర్మారం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. తేమ తగ్గడానికి ఇక్కడే ఆరబోశా. హఠాత్తుగా వాన పడటంతో టార్పాలిన్లు తెచ్చేలోగానే మూడు క్వింటాళ్ల వడ్లు కొట్టుకుపోయాయి. మిగిలింది తడిసిపోయింది. మొత్తం ఎండాలంటే ఎన్ని రోజులు పడుతుందో.. 

నూనె రాజేశం, ధర్మారం


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు