KCR: కేసీఆర్‌కు కమిషన్‌ నోటీసు

యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం అంశాల్లో తీసుకున్న నిర్ణయాలపై మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ నోటీసు జారీచేసింది.

Updated : 12 Jun 2024 07:03 IST

యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై 15లోపు సమాధానాలు పంపాలని నిర్దేశం
భద్రాద్రిలో సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీతో ఏటా రూ.300 కోట్ల నష్టం
ఛత్తీస్‌గఢ్‌లో ప్లాంటు నిర్మాణం పూర్తికాకుండానే ఆ రాష్ట్రంతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం
మీడియా సమావేశంలో వెల్లడించిన ఛైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం అంశాల్లో తీసుకున్న నిర్ణయాలపై మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ నోటీసు జారీచేసింది. ఈ నెల 15లోగా రాతపూర్వకంగా సమాధానాలు పంపాలని నిర్దేశించింది. ఈ విషయాన్ని కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి స్వయంగా వెల్లడించారు. సమాధానం ఇచ్చేందుకు జులై నెలాఖరుదాకా సమయం ఇవ్వాలని కేసీఆర్‌ కోరినట్లు తెలిపారు. కమిషన్‌ కార్యాలయంలో మంగళవారం జస్టిస్‌ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు. విచారణలో ఇప్పటివరకు గుర్తించిన అంశాలను వివరించారు. ‘‘యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం టెండరు పద్ధతిలో కాకుండా నామినేషన్‌ విధానంలో చేపట్టడం సహా విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడినట్టు ప్రాథమికంగా గుర్తించాం. ఆయా అంశాల్లో సమగ్ర సమాచారం కోసం ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు 25 మంది అధికారులు, ప్రజాప్రతినిధులకు లేఖలు రాశాం. ఇంధన శాఖలో గత భారాస ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్య కార్యదర్శులు సురేష్‌ చందా, అర్వింద్‌కుమార్, ఎస్‌.కె.జోషి, అజయ్‌ మిశ్రలతో పాటు ట్రాన్స్‌కో-జెన్‌కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావును విచారించి వివిధ అంశాలపై వివరాలు సేకరించాం. ప్రొఫెసర్‌ కోదండరాం, విద్యుత్‌ ఉద్యోగి రఘు, ఈ రంగ నిపుణులు వేణుగోపాల్‌ కూడా కొంత సమాచారం అందించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అమలు చేశాం తప్ప జెన్‌కోగానీ, ఇతర విద్యుత్‌ సంస్థలుగానీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. తాను కొద్దికాలం మాత్రమే పనిచేశానని.. ఈ మూడింటి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సురేష్‌ చందా వివరణ ఇచ్చారు. ఎస్‌.కె.జోషి, అర్వింద్‌కుమార్‌లు మంగళవారం విచారణకు హాజరై కొంత సమాచారం ఇచ్చారు. 

తొలుత ఒక జీవో.. తర్వాత మరొకటి

రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉందన్న కారణంగా రెండు వేల మెగావాట్లను దక్షిణాది రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల వద్ద కొనుగోలు చేసేందుకు తొలుత ఒక జీవో ఇచ్చారని, రెండు నెలల అనంతరం దేశంలో ఎక్కడి నుంచైనా కరెంటు కొనుగోలు చేయవచ్చంటూ ఆ జీవోను మార్చి మరొకటి ఇచ్చారని ఎస్‌.కె.జోషి కమిషన్‌కు వివరించారు.

‘అత్యవసరం’లో అనుమానాలు

టెండరు ప్రక్రియ లేకుండా ఒప్పందం ఎందుకు చేసుకున్నారని.. ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులను ప్రశ్నించాం. కరెంటు కొరత వల్ల అత్యవసరంగా కొనుగోలు చేయాల్సి వచ్చినందున నేరుగా ఒప్పందం చేసుకున్నట్లు వారు చెప్పారు. అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకు అలా చేసినట్టు చెప్పారు. ఆ దిశగా దస్త్రాలు పరిశీలించగా.. మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. ఒప్పందం చేసుకునే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్‌ కేంద్రం నిర్మాణ దశలో ఉందని తేలింది. చివరికి మూడేళ్ల తర్వాత 2017లో కరెంటు సరఫరా మొదలుపెట్టిన ఆ రాష్ట్రం నాలుగు సంవత్సరాలపాటు కొనసాగించి.. ఆ తర్వాత ఆపేసినట్టు గుర్తించాం. ఈ మొత్తం వ్యవహారంలో ఎంత నష్టం వాటిల్లింది? నిర్ణయం ఎక్కడ జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉంది.

భద్రాద్రి నిర్మాణంపైనా సందేహాలు

భద్రాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణం విషయంలోనూ అనేక అనుమానాలున్నాయి. దాన్ని సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మించాలని అప్పటి భారాస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బొగ్గు అదనపు కొనుగోలు రూపంలో ఏటా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల నష్టం రావడమే కాకుండా వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం జరుగుతుండగా, భద్రాద్రిని మాత్రం సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మించారు. సత్వరమే నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో ఆ సాంకేతికత వైపు వెళ్లినట్లు అప్పటి అధికారులు చెప్పారు. కానీ భద్రాద్రి ప్రారంభానికి ముందే కొత్తగూడెంలో సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో ఒక యూనిట్‌ నిర్మాణం జరిగినా.. ఆ విషయాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నది ప్రశ్న. మరోవైపు యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని టెండరు ప్రక్రియతో కాకుండా నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చారు. దీనిపై భెల్‌ మాజీ, ప్రస్తుత సీఎండీల నుంచి వివరణ అడిగాం. ఇప్పటివరకు యాదాద్రిలో విద్యుదుత్పత్తి ప్రారంభం కాలేదు. త్వరలో ప్రారంభిస్తామంటున్నారు. ఇటీవల నేను వెళ్లి పరిశీలిస్తే యాదాద్రి ప్లాంటుకు బొగ్గు తరలించడానికి అవసరమైన రైల్వే లైన్‌ నిర్మాణం కూడా పూర్తికాలేదని తేలింది’’ అని జస్టిస్‌ నరసింహారెడ్డి వివరించారు.


ముందే హెచ్చరిస్తూ అర్వింద్‌కుమార్‌ లేఖ..

‘ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వల్ల రాష్ట్రంపై భారీగా ఆర్థికభారం పడే అవకాశాలున్నాయని అప్పట్లో రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌కుమార్‌ 2016 నవంబరులో తెలంగాణ ఈఆర్‌సీకి లేఖ రాశారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు చేస్తే డబ్బు ఆదా అవుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత తాను బదిలీ అయ్యానని, ఏం జరిగిందో తనకు తెలియదని అర్వింద్‌కుమార్‌ మంగళవారం కమిషన్‌కు తెలిపారు. ఆయన బదిలీ అయ్యాక ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకోవడానికి దస్త్రాలు పరిశీలిస్తున్నాం.

అర్వింద్‌కుమార్‌ లేఖపై ఈఆర్సీ కూడా దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. రెండు రాష్ట్రాలు విద్యుత్‌ ఒప్పందం చేసుకున్నప్పుడు విక్రయ ధరను నిర్ణయించే అధికారం కేంద్ర రెగ్యులేటరీ కమిషన్‌కి ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొనుగోలు ఒప్పందం విషయంలో ధర నిర్ణయాధికారం ఆ రాష్ట్ర ఈఆర్‌సీకే ఇవ్వడానికి అప్పటి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో అధికంగా చెల్లింపులు చేయాల్సి వచ్చినట్టు కమిషన్‌ దృష్టికి వచ్చింది’ అని జస్టిస్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు