Child Selling: అంగడి సరకులా 60 మంది శిశువుల విక్రయం

పసికందులకు అంగట్లో సరకులా ధర నిర్ణయించి అమ్మేస్తున్న అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా రాకెట్‌ గుట్టును మేడిపల్లి పోలీసులు రట్టు చేశారు.

Updated : 29 May 2024 13:23 IST

దిల్లీ, పుణెల నుంచి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్మకం
స్టింగ్‌ ఆపరేషన్‌తో పిల్లల అక్రమ రవాణా గుట్టురట్టు
ముఠాలో 11 మంది అరెస్టు.. పరారీలో ప్రధాన నిందితులు 
16 మంది చిన్నారులు శిశువిహార్‌కు తరలింపు 

పాపను తీసుకెళ్లొద్దంటూ రోదిస్తున్న మహిళ

ఈనాడు, హైదరాబాద్‌: పసికందులకు అంగట్లో సరకులా ధర నిర్ణయించి అమ్మేస్తున్న అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా రాకెట్‌ గుట్టును మేడిపల్లి పోలీసులు రట్టు చేశారు. దిల్లీ, పుణెల నుంచి చిన్నారుల్ని తీసుకొచ్చి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠాలోని 11 మందిని అరెస్టు చేశారు. వీరు రెండు మూడేళ్లుగా సుమారు 60 మందిని విక్రయించినట్లు తేల్చారు. ప్రస్తుతానికి వారి నుంచి కొనుగోలు చేసిన 16 మందిని గుర్తించారు. సదరు దంపతుల నుంచి ఆయా చిన్నారుల్ని స్వాధీనం చేసుకొని శిశువిహార్‌కు తరలించేందుకు ప్రయత్నించగా పెంచుకున్న బంధాన్ని విడదీయొద్దంటూ కన్నీటిపర్యంతమవడంతో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాచకొండ పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు.మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలోని రామకృష్ణానగర్‌లో ఫస్ట్‌ఎయిడ్‌ క్లినిక్‌ నిర్వహించే శోభారాణి, బోడుప్పల్‌కు చెందిన హేమలత, షేక్‌ సలీమ్, ఘట్‌కేసర్‌లోని అన్నోజిగూడకు చెందిన తల్లీకుమారులు బండారి పద్మ, హరిహరచేతన్‌లు ఓ ముఠాగా ఏర్పడి సంతానలేమితో బాధపడే దంపతుల్ని గుర్తిస్తారు. అధిక సంతానం, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులు తమకు తెలుసని, వారు పిల్లల్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతారు. వ్యక్తిని బట్టి ఒక్కో చిన్నారికి రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ధర చెబుతారు. ఎవరైనా కొనుగోలుకు అంగీకరిస్తే.. మరో ముఠాకు సమాచారం ఇస్తారు. ఇందులో విజయవాడకు చెందిన బలగం సరోజ, ముదావత్‌ శారద అలియాస్‌ షకీలా పఠాన్, పఠాన్‌ ముంతాజ్, జగన్నాథం అనురాధ, మహబూబ్‌నగర్‌కు చెందిన ముదావత్‌ రాజు, హైదరాబాద్‌ చర్లపల్లికి చెందిన యాత మమత ఉన్నారు. వీరు దిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణెకు చెందిన కన్నయ్యలను సంప్రదిస్తారు. వీరు తమ నగరాల్లో పిల్లలను సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి అప్పగిస్తారు. అయితే వీరు పేద తల్లిదండ్రుల వద్ద కొనుగోలు చేస్తున్నారా లేక కిడ్నాప్‌లు చేస్తున్నారా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఒక్కో చిన్నారికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కమీషన్‌ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ పరారీలో ఉన్నారని, మిగతా 11 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 

పెంచిన బంధం.. కన్నీటి సంద్రం

స్టింగ్‌ ఆపరేషన్‌తో బయటపడిందిలా.. 

శోభారాణి, హేమలత కలిసి చిన్నారుల్ని విక్రయిస్తున్నట్లు పీర్జాదిగూడలోని అక్షరజ్యోతి ఫౌండేషన్‌ నిర్వాహకులకు, సాయికుమార్‌ అనే యువకుడికి తెలిసింది. దీంతో మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ గోవిందరెడ్డి సాయంతో స్టింగ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. తమకు పిల్లలు కావాలని శోభారాణిని సంప్రదించగా బాబుకు రూ.6 లక్షలు, పాపకు రూ.4.5 లక్షలు అవుతుందని చెప్పింది. అడ్వాన్సు కింద రూ.10 వేలు తీసుకొని బిడ్డ కుదిరిన తరువాత చెబుతానని పంపింది. ఈ నెల 21న ఫోన్‌ చేసి పాప ఉందని, బుధవారం రావాలని సమాచారం ఇచ్చింది. ఈ మేరకు ఫౌండేషన్‌ నిర్వాహకులు ఆ రోజున  వెళ్లగా శోభారాణి, హేమలత ఓ పాపను చూపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు చేరుకుని ఇద్దరినీ అరెస్టు చేశారు. చిన్నారిని స్వాధీనం చేసుకొని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని విచారించగా.. ఒక్కో లింకు బయటపడ్డాయి.  

చిన్నారుల్ని కొన్నవారిపైనా కేసులు

అక్రమంగా చిన్నారుల్ని కొన్నట్లు తేలిన 16 మందిపైనా కేసులు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు. 11 మందిని అరెస్టు చేశారు. ఈ 16 మందిలో తెలంగాణకు చెందిన వారు 9 మంది, ఏపీకి చెందినవారు ఏడుగురు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని