Hyderabad: పెంచిన బంధం.. కన్నీటి సంద్రం

‘కడుపున మోయకున్నా.. గుండెల్లో దాచుకుని పెంచుకుంటున్నాం.. పేగుబంధం కాకున్నా కంటిపాపలా చూసుకున్నాం.. దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దు’ అంటూ దంపతులు ఓ వైపు.

Updated : 29 May 2024 15:01 IST

పోలీసులు తీసుకుంటున్నా రానంటూ తనను పెంచిన మహిళను పట్టుకుని గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి

హైదరాబాద్‌: ‘కడుపున మోయకున్నా.. గుండెల్లో దాచుకుని పెంచుకుంటున్నాం.. పేగుబంధం కాకున్నా కంటిపాపలా చూసుకున్నాం.. దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దు’ అంటూ దంపతులు ఓ వైపు. ఏడాది నుంచి రెండేళ్లుగా వారి ఆలనాపాలనలో పెరిగిన పిల్లల ఏడుపులు మరోవైపు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో కనిపించిన ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి.

అంగడి సరకులా 60 మంది శిశువుల విక్రయం

నిందితుల నుంచి అక్రమ పద్ధతిలో పిల్లల్ని కొన్న 16 మందిని గుర్తించిన పోలీసులు ఆయా చిన్నారులతో సహా వారిని కార్యాలయానికి రప్పించారు. అనంతరం శిశువిహార్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇన్నాళ్లూ వారిని పెంచిన మహిళలు ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నారులు సైతం పోలీసుల దగ్గరకు వెళ్లకుండా మహిళలను గట్టిగా హత్తుకొని మారాం చేశారు. ఎట్టకేలకు 16 మందిని తీసుకొని వాహనంలో తీసుకెళ్తుండగా కొందరు దంపతులు అడ్డుగా నిలబడ్డారు. సంతానం లేదన్న బాధలో తెలిసో, తెలియకో పిల్లల్ని కొనుగోలు చేశామని.. ఏళ్ల తరబడి పెంచుకున్నాక దూరం చేస్తే ఎలా బతికేదంటూ కొందరు రోడ్డుపైనే కూలబడి గుండెలవిసేలా రోదించారు. ఈ 16 మందిలో 12 మంది ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు ఉన్నారు.

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ప్రాంగణంలో విలపిస్తున్న మహిళలు 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని