Uttam Kumar Reddy: ప్రాజెక్టుల నిర్మాణానికి.. మరో రూ.11 వేల కోట్లు కావాలి
ఆర్థిక శాఖను కోరతాం
నెలాఖరులో సదర్మాట్, ఆగస్టు 15న రాజీవ్‌గాంధీ కాలువ ప్రారంభం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై 20న దిల్లీకి అధికారులు
నీటి పారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్.. చిత్రంలో నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చేలా ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అదనంగా మరో రూ.11 వేల కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖను కోరనున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో వివిధ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, భీమా, నారాయణపేట-కొడంగల్, అచ్చంపేట, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ-2, చిన్న కాళేశ్వరం, శ్రీపాద, లోయర్ పెన్‌గంగ తదితర ప్రాజెక్టుల నిర్మాణం, పురోగతిపై చర్చించారు. జులై నెలాఖరు నాటికి నిర్మల్ జిల్లా సదర్మాట్, ఆగస్టు 15న రాజీవ్‌గాంధీ కెనాల్(సీతారామ ప్రాజెక్టు)ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ప్రకటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తిచేయాలని గుత్తేదారులను ఆదేశించారు. త్వరలోనే నీటి పారుదల శాఖలో బదిలీలు, పదోన్నతులు చేపడుతామన్నారు.
ఈ ఏడాదిలో 6.5 లక్షల ఎకరాల ఆయకట్టు
‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10-11 వేల కోట్ల ఖర్చుతో కొత్తగా 6.5 లక్షల ఎకరాల ఆయకట్టును తీసుకువస్తాం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్ ఇచ్చిన హామీల అమలుకు కోయిలసాగర్, కల్వకుర్తి ఎత్తిపోతలు, ఇతర ప్రాజెక్టులను సకాలంలో వంద శాతం పూర్తిచేయడంపై చర్చించాం. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలోని చిన్న కాళేశ్వరం, మోదీకుంట, లోయర్ పెన్‌గంగా, చనాఖా-కోర్ట, శ్రీపాద ఎల్లంపల్లి, జేసీఆర్‌డీఎల్‌ఐఎస్‌ల పూర్తికి రూ.8 వేల కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. 2025 డిసెంబరు నాటికి అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు అదనంగా మరో రూ.11 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తాం.
డ్యాం సేఫ్టీ అథారిటీతో చర్చలు
దిల్లీలో ఈ నెల 20న నీటి పారుదల శాఖ సలహాదారు, ముఖ్యకార్యదర్శి, నిపుణుల కమిటీ సభ్యులు.. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) ఛైర్మన్‌తో సమావేశం కానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, ఆనకట్టల భద్రతపై ఆ సమావేశంలో చర్చించిన ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఆయా బ్యారేజీలపై తీసుకున్న చర్యలు, పెండింగ్ అంశాలపై చర్చిస్తాం.
గత ప్రభుత్వ అప్పులకే రూ.18 వేల కోట్లు
మధ్యంతర బడ్జెట్‌లో రూ.28 వేల కోట్లు కేటాయించగా అందులో రూ.18 వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే పోతున్నాయి. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు మరో రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి. అందుకే తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనులను సకాలంలో పూర్తిచేసి ఎక్కువ ఆయకట్టుకు నీరందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రాజెక్టుల పురోగతిని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించాం. నిర్మాణాలు తుదిదశకు చేరుకున్న ప్రాజెక్టులు ఏ కేటగిరీ కింద, తర్వాతి దశలోనివి బీ, సీ కేటగిరీల్లో ఉన్నాయి. ఏ కేటగిరీలో రూ.240.66 కోట్లతో 47,882 ఎకరాలు, బీ, సీ కేటగిరీల్లో రూ.7500 కోట్ల అంచనాతో 5,84,770 ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకురానున్నాం’ అని ఉత్తమ్ విలేకరులకు వివరించారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 


