Phone Tapping Case: జడ్జీల ఫోన్లూ.. చాటుగా విన్నారు!

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్‌ చేసినట్లు తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది.

Updated : 29 May 2024 07:08 IST

వ్యక్తిగత సమాచారం సేకరించి.. అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్ర
భారాస కోసం రూ.13 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు కొన్న శ్రీధర్‌రావు
వాంగ్మూలంలో కీలక నిందితుడు భుజంగరావు వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్‌ చేసినట్లు తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. ప్రభుత్వ కేసులు, భారాస నేతలకు సంబంధించిన కేసుల్ని పర్యవేక్షిస్తున్న న్యాయవాదులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్‌ అయినట్లు న్యాయస్థానానికి పోలీసులు సమర్పించిన నిందితుడి నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొనడం కలకలం రేపుతోంది. ఇందుకు ఉదాహరణగా ఓ హైకోర్టు జడ్జి పేరును దర్యాప్తు అధికారులు ప్రస్తావించారు. ఇప్పటివరకూ రాజకీయ నాయకుల ఫోన్లనే ట్యాప్‌ చేసినట్లు బహిర్గతం కాగా.. ఆ జాబితాలో జడ్జీలు, జర్నలిస్టులు ఉన్నట్లు కేసులో కీలక నిందితుడు, అదనపు ఎస్పీ(సస్పెండెడ్‌) నాయిని భుజంగరావు వాంగ్మూలంలో తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారం సేకరించడం ద్వారా అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలనుకున్నట్లు భుజంగరావు వెల్లడించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై డీజీపీ, అదనపు డీజీపీలు క్షుణ్నంగా సమీక్ష జరిపేవారు కాదని.. ట్యాప్‌ చేసే ప్రతి ఫోన్‌ నంబర్‌ను పరిశీలించేవారు కాదని ఆయన చెప్పారు. దీంతో ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, డీఎస్పీ(సస్పెండెడ్‌) ప్రణీత్‌రావు ఇష్టానుసారంగా వ్యవహరించారని వాంగ్మూలంలో పేర్కొన్నారు. భారాసకు మేలు చేకూర్చేందుకు 2018 శాసనసభ ఎన్నికలకు ముందే అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌ను సంప్రదించిన తర్వాతే ఎస్‌ఐబీలో ప్రభాకర్‌రావు స్పెషల్‌ ఆపరేషన్‌ టీం(ఎస్‌వోటీ) ప్రారంభించినట్లు వెల్లడించారు. భుజంగరావు వాంగ్మూలంలోని మరిన్ని కీలకాంశాలు ఆయన మాటల్లోనే..

ఐపీడీఆర్‌ విశ్లేషణపై దృష్టి

‘‘మునుగోడు ఉపఎన్నిక సమయంలో మునుగోడు శివార్లలో రూ.కోటి పట్టుకోగలిగాం. ఎస్‌ఐబీలో ఫోన్‌ ట్యాపింగ్‌ అవుతోందన్న భయంతో చాలామంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, న్యాయవ్యవస్థకు చెందినవారు వాట్సప్, సిగ్నల్, స్నాప్‌చాట్‌ లాంటి సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫాంలను వినియోగించేవారు. ఇంటర్నెట్‌ కాల్స్‌ను పర్యవేక్షించేందుకు ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ డేటా రికార్డ్స్‌(ఐపీడీఆర్‌) విశ్లేషణపై ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు దృష్టి సారించారు. భారాస ప్రభుత్వ విధానాలను ట్రోల్‌ చేసే వ్యక్తుల ఫోన్లపై ప్రణీత్‌రావు బృందం నిఘా పెట్టేది. అనంతరం టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ బృందాలతో క్షేత్రస్థాయి ఆపరేషన్లు నిర్వహించేవారు. భారాసను ఇబ్బందిపెట్టే విద్యార్థి సంఘాల నేతల ఫోన్లనూ ట్యాప్‌ చేసేవారు. భారాస ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో బయటపడేసేందుకు ఫోన్‌ ట్యాపింగ్‌ సమాచారం ఆధారంగా ఆపరేషన్లు చేపట్టేవారు. ఈటల రాజేందర్‌ భారాస నుంచి సస్పెండ్‌ అయినప్పుడు.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికప్పుడు.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై నిరుద్యోగ యువత ఆందోళనలు నిర్వహించినప్పుడు.. అదే సమయంలో కేటీఆర్‌ కామెంట్లపై ఆందోళనలు జరిగినప్పుడు.. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలకు ఎర కేసు లాంటి సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పోలీసులకు సమాచారం చేరవేసి.. పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం జరిగేది.

శ్రీధర్‌రావుతో ఎలక్టోరల్‌ బాండ్ల కొనుగోలు..

క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు చేపట్టేందుకు హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, సైబరాబాద్‌లో ఎస్‌వోటీ అదనపు ఎస్పీ నారాయణతోపాటు కమిషనరేట్లు, జిల్లాల్లో అలాంటి విభాగాల సహకారం తీసుకునేవాళ్లం. ఎన్నికల్లో భారాసకు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు అవసరమైన సమాచారం కోసం ప్రభాకర్‌రావు మాకు ఆదేశాలిచ్చేవారు. ప్రైవేటు కంపెనీలు, స్థిరాస్తి వ్యాపార సంస్థల మధ్య తలెత్తే తగాదాలను పరిష్కరించడం ద్వారా నిధులను సమకూర్చే పనిలో రాధాకిషన్‌రావు ఉండేవారు. 

హైటెక్‌ సిటీలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వ్యవహారంలో సంధ్య కన్వెన్షన్‌ శ్రీధర్‌రావు, అతడి వ్యాపార భాగస్వామితో సాంబశివరావుకు వివాదం ఉండేది. వారిద్దరినీ సాంబశివరావు నా కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకొని భారాసకు రూ.15 కోట్ల నిధులు సమకూర్చాలని శ్రీధర్‌రావుపై ఒత్తిడి తెచ్చాం. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అప్పటికే అతడిపై పలు క్రిమినల్‌ కేసులుండటంతో భారాస నుంచి ఇబ్బందులు ఎదురుకావొద్దంటే ఆ నిధులివ్వాలన్నాం. ఈ క్రమంలో శ్రీధర్‌రావు భారాస కోసం ఎస్‌బీఐ నుంచి రూ.13 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు కొన్నారు. సాంబశివరావుతో రాజీ కోసం రూ.2 కోట్లు ఇచ్చారు. ప్రభాకర్‌రావు బంధువు రవీందర్‌రావుతోనూ శ్రీధర్‌రావుకు వివాదాలుండేవి. ప్రణీత్‌రావు నేతృత్వంలోని ఎస్‌వోటీ బృందం అతనిపై నిఘా ఉంచేది. భారాసకు ఎలక్టోరల్‌ బాండ్లు సమకూర్చినా సైబరాబాద్‌ పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు’’ అని భుజంగరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.


కామారెడ్డి ఎన్నికకు వాట్సప్‌ గ్రూప్‌

టీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ కామారెడ్డి నియోజకవర్గంలో బరిలో దిగడంతో.. ఆ ఎన్నిక కోసం ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసినట్లు భుజంగరావు, తిరుపతన్నలు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నారు. ‘‘ఎన్నికను పర్యవేక్షించేందుకు ప్రణీత్‌రావు తన బృందంతో ‘కేఎంఆర్‌’ పేరిట వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి.. రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిల కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ గ్రూప్‌లో సమాచారాన్ని షేర్‌ చేసుకునేవారు. కేసీఆర్‌ను గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరించాలో చర్చించేవారు’’ అని భుజంగరావు వెల్లడించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమైన పనులు నిర్వర్తించే బాధ్యతను గట్టుమల్లు, రాజవర్ధన్‌రెడ్డి, నరేష్‌గౌడ్‌ తదితరులకు అప్పగించారు. లక్ష్యంగా చేసుకున్నవారి ఫోన్లు ట్యాప్‌ చేసి... ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు చెప్పాలని ప్రణీత్‌రావు ఆదేశించారు. ‘కేఎంఆర్‌’ వాట్సప్‌ గ్రూప్‌లో నాతోపాటు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌కు చెందిన  వారినీ జోడించారు. కొండల్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నాయకులపై కన్నేసి ఉంచడం ద్వారా కామారెడ్డి పోలీసులు రూ.56.84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు’’ అని తిరుపతన్న పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని