Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ అనుమతుల్లోనే కుట్రకోణం

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్‌కు అనుమతి ప్రక్రియలో అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది.

Updated : 15 May 2024 07:36 IST

ప్రభాకర్‌రావుకు జారీ అధికారం కట్టబెట్టడంలో గూడుపుఠాణి
ఇండియన్‌ టెలీగ్రాఫ్‌ చట్ట ఉల్లంఘనపై ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్‌కు అనుమతి ప్రక్రియలో అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్‌కు అనుమతులు జారీ చేసే అధికారాన్ని అప్పటి స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) ఓఎస్డీ ప్రభాకర్‌రావుకు అప్పగించినట్లు అధికారులు గుర్తించారని సమాచారం. ఆనాటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే ఇది జరిగిందని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. ఇండియన్‌ టెలీగ్రాఫ్‌ చట్టం రూల్‌ 419(ఎ) సెక్షన్‌ ప్రకారం ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతిచ్చే అధికారం రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఉంటుంది. అయితే ప్రజాభద్రతకు సంబంధించి ఆపరేషన్లు నిర్వహించినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం హోంశాఖ అనుమతి పొందే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. సంయుక్త కార్యదర్శి(ఐజీ) లేదా ఆపై స్థాయి ఉన్నతాధికారి ట్యాపింగ్‌కు అనుమతి ఇవ్వొచ్చని టెలీగ్రాఫ్‌ చట్టం చెబుతోంది. ఈమేరకు సర్వీస్‌ ప్రొవైడర్‌కు లేఖ రాసి అనుమతి తీసుకోవచ్చు. అయితే ఇది తాత్కాలిక అనుమతి మాత్రమే. ఇలా తీసుకున్న అనుమతి ద్వారా మూడు రోజులపాటు ట్యాపింగ్‌ చేయొచ్చు. అనివార్య పరిస్థితుల్లో గరిష్ఠంగా వారం రోజులు మాత్రమే కొనసాగించొచ్చు. ఆ తర్వాత తప్పనిసరిగా హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకొని కొనసాగించాలి. అనుమతి రాకపోతే సర్వీస్‌ ప్రొవైడర్లు ట్యాపింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలి.

ప్రభాకర్‌రావుకు అధికారం ఇచ్చిందెవరు?

ఐజీగా ఉద్యోగ విరమణ పొంది ఓఎస్డీగా కొనసాగిన ప్రభాకర్‌రావుకు ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడానికి అనుమతి ఇచ్చే అధికారం ఎవరు.. ఎలా కట్టబెట్టారన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. ఇది టెలీగ్రాఫ్‌ చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ పొందిన వారి సేవల్ని వినియోగించుకోవాల్సి వస్తే మరొకరి పర్యవేక్షణలోనే విధులు నిర్వర్తించే బాధ్యత అప్పగించాల్సి ఉంటుంది. ప్రభాకర్‌రావు విషయంలో అలా జరగలేదు. ఎస్‌ఐబీనే కాకుండా కీలకమైన ఇంటెలిజెన్స్‌ విభాగంలోనూ చీఫ్‌ బాధ్యతల్నీ ఆయనకు అప్పగించారు. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఉల్లంఘన జరిగితే ఆయనను బాధ్యుడిని చేసే అవకాశం ఎలా ఉంటుందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాకర్‌రావుకు ఈ అధికారాన్ని అప్పగించడంలోనే గూడుపుఠాణి దాగి ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తుండటం తాజా అంశం. ఇదంతా ఎలా జరిగిందనేది తేలితే ట్యాపింగ్‌ కుట్ర కోణంలోని మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావచ్చు. ప్రభాకర్‌రావును విచారించడం ద్వారానే ఇందులో స్పష్టత వస్తుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.


ఎస్‌ఐబీలో డీఐజీగా అడుగుపెట్టి..

వాస్తవానికి డీఐజీగా ఎస్‌ఐబీలో అడుగుపెట్టిన ప్రభాకర్‌రావు అక్కడే ఐజీగా పదోన్నతి పొంది 2020 జూన్‌లో రిటైరయ్యారు. అయితే ప్రభుత్వం ఆయన్ని పునర్నియమించి రెండేళ్లపాటు ఎస్‌ఐబీ ఓఎస్డీగా బాధ్యతలు అప్పగించింది. అంతటితో ఆగకుండా అదే ఏడాది అక్టోబరులో అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌ ఉద్యోగ విరమణ పొందడంతో పూర్తి అదనపు బాధ్యతల్ని సైతం ప్రభాకర్‌రావుకు అప్పగించింది. ఈ నియామకం అప్పట్లో సంచలనం కలిగించింది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనూ కీలకమైన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బాధ్యతల్ని అలా రిటైరైన వారికి అప్పగించిన దాఖలాలు లేవు. 2021 ఆగస్టులో అదనపు డీజీపీ అనిల్‌కుమార్‌కు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బాధ్యతలు అప్పగించేవరకు ప్రభాకర్‌రావు ఆ పోస్టులో కొనసాగారు. భారాస ప్రభుత్వం మారే వరకు ఎస్‌ఐబీ ఓఎస్డీగా కొనసాగారు. నాటి ప్రభుత్వం ఆయనకు అంతటి ప్రాధాన్యం ఇవ్వడంపై అప్పట్లోనే విమర్శలు చెలరేగాయి. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి అప్పట్లోనే ప్రభాకర్‌రావుపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేశారు. ఎస్‌ఐబీ కేంద్రంగా ఆయన నేతృత్వంలో రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని బహిరంగ వేదికలపైనే ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని