Regional Ring Road: మించుతున్న అంచనాలు..!

భూ సేకరణ కొలిక్కి రాలేదు.. శంకుస్థాపన జరగలేదు.. ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అంచనా వ్యయం మాత్రం భారీగా పెరుగుతోంది.

Updated : 25 May 2024 12:03 IST

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి తొలుత రూ.9,164 కోట్లు అవుతుందని అంచనా..
తాజాగా రూ.15 వేల కోట్లకు చేరిక..
ఎన్నికల కోడ్‌ ముగిశాక భూ సేకరణ వేగవంతం

ఈనాడు, హైదరాబాద్‌: భూ సేకరణ కొలిక్కి రాలేదు.. శంకుస్థాపన జరగలేదు.. ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అంచనా వ్యయం మాత్రం భారీగా పెరుగుతోంది. ఎలైన్‌మెంట్‌ ఖరారు సమయానికి.. ప్రస్తుతం.. అంచనా వ్యయాల మధ్య వ్యత్యాసం గణనీయంగా ఉంది. 347.85 కిలోమీటర్ల మార్గాన్ని రెండు భాగాలుగా నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 158.65 కిలోమీటర్ల ఉత్తర భాగాన్ని తొలుత నిర్మించాలని నిర్ణయించి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారి నంబరును సైతం కేటాయించింది. 2021 డిసెంబరులో ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. భూ విలువలు పెరగడంతోపాటు సిమెంటు, స్టీలు తదితర ఉపకరణాల ధరలు, ఆయా మార్గాల్లో ఉన్న వినిమయాల తరలింపు, వంతెనల నిర్మాణం.. ఇలా ఒక్కొక్కటిగా వ్యయం పెరగడంతో అంచనా వ్యయం అధికమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మార్గంలో భూ సేకరణ నష్టపరిహారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని నిర్ణయించాయి. రహదారి నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించనుంది.

రూ.ఆరు వేల కోట్లకుపైగా పెరిగిన వ్యయం

ఉత్తర భాగం వ్యయం గణనీయంగా పెరిగింది. తాజా అంచనాల ప్రకారం 158 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేసేందుకు సుమారు రూ.15 వేల కోట్లు అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్మాణ వ్యయం పెరుగుదల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఉత్తర భాగాన్ని నిర్మించేందుకు భూ సేకరణ తదితరాలతో కలిపి రూ.9,164 కోట్ల వ్యయం అవుతుందని 2021 డిసెంబరులో అంచనా వేశారు. గడిచిన రెండున్నర సంవత్సరాల్లో ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణంలో ముందడుగు పడలేదు. అంచనా వ్యయం మాత్రం సుమారు రూ.ఆరు వేల కోట్లకుపైగా పెరిగింది. ప్రాంతీయ రింగు రోడ్డును భారత్‌మాల ప్రాజెక్టులో నిర్మించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. అయితే, ఆ పథకంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉండటంతో మరో పథకంలో అమలు చేయాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల క్రతువు ముగిశాక నూతన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తుందని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించింది. 

ఐదారు నెలల్లో కొలిక్కి..

రహదారి నిర్మాణం కోసం 1,879.05 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. ఆ భూసేకరణకు వీలుగా చట్టబద్ధమైన అంశాలను పూర్తి చేశారు. ఒక్క నర్సాపూర్‌ ప్రాంతంలో స్వల్ప భాగానికి గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వచ్చే నెలలో ముగియనుంది. ఆ తర్వాత భూ సేకరణ వ్యవహారాన్ని వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. యాదాద్రి-భువనగిరి జిల్లాకు సంబంధించిన భూ సేకరణ వ్యవహారంలో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయ నిపుణులను సంప్రదించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తంమీద ఐదారు నెలల వ్యవధిలో భూ సేకరణ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. 

326 వంతెనల నిర్మాణానికి ప్రణాళిక

ఉత్తర భాగం రహదారి నిర్మాణంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో 326 వంతెనలు నిర్మించాల్సి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి నిర్మాణానికి నీటిపారుదల, రైల్వే శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఆ తర్వాత అంచనా వ్యయాలు రూపొందించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని