Engineering Colleges: స్లైడింగ్‌ దందాకు కళ్లెం పడుతుందా?

ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 70 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ అవుతాయన్నది కాగితాలకే పరిమితమవుతోంది. వాటిని కూడా విద్యాశాఖ భర్తీ చేయకుండా కళాశాలల యాజమాన్యాల చేతుల్లో పెడుతోంది.

Published : 24 May 2024 04:24 IST

యాజమాన్యాల చేతుల్లోనే.. బ్రాంచి మార్పిడి వ్యవహారం 
బి కేటగిరీ సీట్ల విషయంలోనూ వాటిదే ఇష్టారాజ్యం
ఏళ్లుగా పట్టించుకోని విద్యాశాఖ 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 70 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ అవుతాయన్నది కాగితాలకే పరిమితమవుతోంది. వాటిని కూడా విద్యాశాఖ భర్తీ చేయకుండా కళాశాలల యాజమాన్యాల చేతుల్లో పెడుతోంది. రెండు లేదా మూడు విడతల కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత సీటు సాధించిన కళాశాలలోనే ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి మారేందుకు నిర్వహించే అంతర్గత స్లైడింగ్‌ను ప్రవేశాల కన్వీనర్‌ చేపట్టేందుకు అవకాశమున్నా విద్యాశాఖ  నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా విద్యార్థులు పలు రకాలుగా నష్టపోతున్నారు.

వారికి లబ్ధి చేకూర్చేందుకే ఉదాసీనతా?

రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 70 శాతం కన్వీనర్, 30% యాజమాన్యం(బి కేటగిరీ) భర్తీచేసుకునేందుకు వీలుగా బీటెక్‌సీట్లు ఉంటాయి. ఆ ప్రకారం ఒక బ్రాంచిలో ఒక సెక్షన్‌కు 60 సీట్లుంటే 42 సీట్లు కన్వీనర్, 18 సీట్లు యాజమాన్యం భర్తీ చేసుకుంటాయి.

ప్రవేశాల కమిటీకి కన్వీనర్‌గా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ వ్యవహరిస్తారు. రెండు లేదా మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి మారేందుకు అంతర్గత స్లైడింగ్‌ను నిర్వహిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రక్రియను ఆయా కళాశాలల యాజమాన్యాలకే రాష్ట్ర సర్కారు వదిలేసింది. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్లు వచ్చిన వారు ఇక్కడ సీట్లను వదిలేస్తుంటారు. దాంతో డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు సైతం పలు కళాశాలల్లో ఖాళీగా ఉంటాయి. అప్పటికే ఆ కళాశాలల్లో ఇతర బ్రాంచిలలో చేరిన వారు బ్రాంచి మారదామంటే చిక్కొచ్చిపడుతోంది. అలా మారితే వారికి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ వర్తించదు. దాంతో అనేక మంది మానుకుంటున్నారు. మరికొందరు అప్పోసొప్పో చేసి బ్రాంచి మారుతున్నారు. మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు రూ.6 లక్షల నుంచి రూ.14 లక్షలకు అమ్ముకుంటున్నాయి. ఏటా సుమారు 5 వేల మంది వరకు నష్టపోతున్నారు. యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చడానికే విద్యాశాఖ కొన్నేళ్లుగా ఈ సమస్యపై దృష్టి పెట్టడం లేద]న్న ఆరోపణలున్నాయి. గత రెండేళ్లుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప చివరకు యాజమాన్యాలకే అప్పగిస్తున్నారు. కన్వీనర్‌ ఆధ్వర్యంలో చేపట్టాలంటే ప్రభుత్వ ఆమోదం కోసం దస్త్రం పంపాలని,  ఒకవేళ పంపితే దానిపై నిర్ణయం వెలువడకపోతే సీట్ల భర్తీ ప్రక్రియ మరింత జాప్యమవుతుందన్న భావనతోనే గత రెండేళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తోంది.

ఈ సారైనా....

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ టైంటేబుల్‌ను ఖరారు చేసేందుకు శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఎప్‌సెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం జరగనుంది. విద్యాశాఖ కమిషనర్‌గా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కూడా సమావేశంలో పాల్గొననున్నారు. కన్వీనర్‌ ఆధ్వర్యంలో అంతర్గత స్లైడింగ్‌ చేపట్టే అంశంపై కూడా చర్చ జరగనుంది. ఈసారైనా విద్యార్థులకు న్యాయం జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి. యాజమాన్య కోటా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకోకుండా కట్టడి చేసే చర్యలు తీసుకుంటామని ఎప్‌సెట్‌ ఫలితాల సందర్భంగా బుర్రా వెంకటేశం వెల్లడించారు. దానిపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు మాత్రం యాజమాన్య కోటా సీట్లను కళాశాలలే భర్తీ చేసుకోవాలని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులున్నాయని, ఇతర న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని చెబుతూ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని