Windstorm: ఉసురు తీసిన గాలివాన

అకాలవర్షాలు, ఈదురుగాలులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రెమాల్‌ తుపాను ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. అప్పటి వరకు ఎండ కాస్తూ... మధ్యాహ్నం ఉన్నట్లుండి భారీ ఈదురుగాలులు విరుచుకుపడటంతో వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated : 27 May 2024 07:28 IST

విరిగిపడిన చెట్లు.. కూలిన షెడ్లు, కరెంటు స్తంభాలు
రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృత్యువాత
నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే ఏడుగురి దుర్మరణం
హైదరాబాద్‌లో నలుగురు, మెదక్‌లో ఇద్దరి మృతి
ఈనాడు, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌

హైదరాబాద్‌ వనస్థలిపురం గణేశ్‌ ఆలయం ప్రాంతంలోని కెనరా బ్యాంకు రోడ్డులో కారు, ఆటోపై కూలిన వృక్షం

అకాలవర్షాలు, ఈదురుగాలులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రెమాల్‌ తుపాను ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. అప్పటి వరకు ఎండ కాస్తూ... మధ్యాహ్నం ఉన్నట్లుండి భారీ ఈదురుగాలులు విరుచుకుపడటంతో వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. షెడ్డు కూలడంతో తండ్రీకూతుళ్లు సహా నలుగురు, పిడుగుపాటుతో ఇద్దరు, ఓ డ్రైవరు చనిపోయారు. రాజధాని హైదరాబాద్‌లో నలుగురు, మెదక్‌లో ఇద్దరు వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. పలు జిల్లాల్లో భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటంతో అనేక చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గాలుల ధాటికి రోడ్లపై, ఇళ్ల ఆవరణల్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గాలిదుమారం రేగింది. నల్గొండ జిల్లా పెద్ద అడిశెర్లపాడు మండలం ఘన్‌పూర్, హాలియా మండలం ఇబ్రహీంపేట, గుర్రంపోడు మండల కేంద్రాల్లో వాన కురిసింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరులో కూలిపోయిన రేకులషెడ్డు శిథిలాల్లో నలుగురి మృతదేహాలు

హైదరాబాద్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రహదారులు, ఇళ్లు, వాహనాలపై భారీ చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి.  బహుళ అంతస్తులపై ఏర్పాటు చేసిన పలు హోర్డింగ్‌లు, సెల్‌టవర్లు పడిపోయాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. కొద్దిసేపటికి గాలులకు భారీ వర్షం తోడవ్వడంతో ప్రజలు వణికిపోయారు. హయత్‌నగర్‌ నుంచి వనస్థలిపురం మీదుగా ఎల్బీనగర్‌ వరకూ, మల్కాజిగిరి, మేడ్చల్‌ నుంచి శామీర్‌పేట్‌ మీదుగా కీసర, ఘట్‌కేసర్‌ వరకూ వాహనాల రాకపోకలు స్తంభించాయి. సాయంత్రం 6 గంటలకు కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలు, ఐటీ కారిడార్‌లో భారీ వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో ఓ ఇంటిపై పడిపోయిన హోర్డింగ్‌  

పలు జిల్లాల్లో ఎండల తీవ్రత 

మరోవైపు రాష్ట్రంలో ఎండలు ఆదివారం 46.5 డిగ్రీల మార్కును తాకాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో 46.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇదే మండలం బుద్దేష్పల్లిలో 46.1 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.8, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ 45.8, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌ 45.6, ధర్మపురి మండలం నేరెళ్ల 45.6, ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి 45.2, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌ 45.2, పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రం 45.1, మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రం 45, నిర్మల్‌ జిల్లా కేంద్రం 45, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్‌లో 45 డిగ్రీల ఎండ కాసింది. మరికొన్ని జిల్లాల్లో 44.8 నుంచి 44.9 డిగ్రీల మధ్య నమోదైంది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది.పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. 

హయత్‌నగర్‌ ఇన్ఫర్మేషన్‌ కాలనీలో ద్విచక్రవాహనంపై కూలిన భారీ వృక్షం

వనస్థలిపురం సాగర్‌ కాంప్లెక్స్‌పై విరిగి పడిన సెల్‌ఫోన్‌ టవర్‌


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఏడుగురి మృత్యువాత

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు శివారులోని ఇంద్రకల్‌ రోడ్డు సమీపంలో రైతు మల్లేశ్‌(38) తన పొలంలో రేకుల షెడ్డు నిర్మించుకుంటున్నారు. ఆయనతోపాటు భార్య పార్వతమ్మ, కుమారుడు రాజు, కుమార్తె అనూష(12), పని చేయడానికి వచ్చిన పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన ఇద్దరు మేస్త్రీలు, ఇద్దరు అడ్డాకూలీలు చెన్నమ్మ(38), రాముడు(36) అక్కడే ఉన్నారు. ఉన్నట్లుండి ఈదురుగాలులతో వర్షం కురవడంతో మల్లేశ్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు, మేస్త్రీలు చిన్ననాగులు, కుర్మయ్య, చెన్నమ్మ, రాముడు, పక్క పొలం రైతు నాగరాజు షెడ్డులో తలదాచుకున్నారు. నిర్మాణంలో ఉన్న షెడ్డు ఒక్కసారిగా కూలిపోవడంతో మల్లేశ్, అనూష, చెన్నమ్మ, రాముడు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రగాయాలైన పార్వతమ్మ, రాజు, చిన్ననాగులు, నాగరాజులును ఆసుపత్రికి తరలించారు. నాగర్‌కర్నూల్‌ మంతటి గేట్‌ సమీపంలో రేకుల షెడ్డుపై ఉన్న రాయి పడి వేణుగోపాల్‌(38) మృతిచెందారు. వికారాబాద్‌ జిల్లా బాషీర్‌బాద్‌ మండలం నీళ్లపల్లి చెందిన వేణుగోపాల్‌ కారు కిరాయికి తిప్పుతూ జీవనం సాగించేవారు. శ్రీశైలం కిరాయికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈదురుగాలులకు మంతటి గేటు సమీపంలో రోడ్డు పక్కనే రేకుల షెడ్డుపై ఉన్న రాయి వేగంగా దూసుకొచ్చి కారు అద్దాన్ని పగులగొట్టుకొని లోపలున్న వేణుగోపాల్‌పై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందారు. అలాగే తెలకపల్లికి చెందిన లక్ష్మణ్‌(12), తిమ్మాజీపేట మండలం మారేపల్లికి చెందిన కుమ్మరి వెంకటయ్య(54) వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు బలయ్యారు.


హైదరాబాద్‌లో నలుగురి మృతి

కీసర, మియాపూర్, న్యూస్‌టుడే: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి, ధనుంజయ్‌లు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తిమ్మాయిపల్లి సమీపంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద బలమైన ఈదురుగాలులకు భారీ చెట్టు విరిగి వారిపై పడింది. దీంతో వెనుక కూర్చున్న నాగిరెడ్డి రామిరెడ్డి(56) అక్కడికక్కడే చనిపోయారు. తీవ్ర గాయాలైన ధనుంజయ్‌(44)ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. హఫీజ్‌పేట్‌లోని సాయినగర్‌లో ఓ ఇంటి మూడో అంతస్తులో రేకులషెడ్డు వేసి, పైన ఇటుకలు పెట్టారు. గాలివానకు రేకులు ఎగిరిపోగా.. ఇటుకలు పక్క ఇంట్లో ఉంటున్న చిన్నారి సమద్‌(3)తోపాటు రోడ్డుపై వెళ్తున్న రషీద్‌(45)పై పడ్డాయి. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే చనిపోగా.. రషీద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.


కోళ్ల ఫారం గోడ కూలి ఇద్దరి దుర్మరణం

ములుగు, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఘనపూర్‌ గ్రామానికి చెందిన గంగ గౌరీశంకర్‌(30).. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు చెందిన భాగ్యమ్మ(50)(గౌరీ శంకర్‌కు వదిన) తమ కుటుంబసభ్యులతో కలిసి శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌లో బంధువులు విభూతి శ్రీనివాస్‌ ఇంటికి వచ్చారు. ఆదివారం శ్రీనివాస్‌ పొలానికి అందరూ కలిసి వెళ్లారు. ఉరుములు, మెరుపులతో గాలివాన రావడంతో సమీపంలోని ఇరుకుల రాములు కోళ్లఫారం గోడ వద్దకు వెళ్లారు. గాలి ధాటికి అది ఒక్కసారిగా కూలిపోవడంతో గౌరీశంకర్, భాగ్యమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. గంగామాధవి, విభూతి శ్వేత, ఇంద్రజ, గంగ సునీతలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గౌరీశంకర్‌ బ్యాంకు ఉద్యోగి కాగా అతని తండ్రి నాలుగేళ్ల క్రితం, సోదరుడు మూడేళ్ల క్రితం మృతిచెందారు.


నైరుతి రుతుపవనాలు ఆదివారం నాటికి మరింత విస్తరించాయి. మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు చేరుకున్నాయి. దీన్ని బట్టి ఈ నెల 31 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


తగ్గిన విద్యుత్‌ డిమాండ్‌

రాష్ట్రంలో వర్షాలతో వాతావరణం చల్లబడటం, యాసంగి సాగు దాదాపు పూర్తవడంతో విద్యుత్‌ డిమాండు గణనీయంగా తగ్గిపోయింది. ఆదివారం రాష్ట్ర విద్యుత్‌ గరిష్ఠ డిమాండు 8797 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది ఇదేరోజు 9262 మెగావాట్లు ఉంది. రాత్రి సమయంలో డిమాండు 7 వేల మెగావాట్లకు చేరుతోంది. నెల క్రితం వరకూ రోజూవారీ గరిష్ఠ డిమాండు 15 వేల మెగావాట్లకు పైగా ఉన్న సంగతి తెలిసిందే.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని