Mega Food Park: ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్‌ పార్క్‌

దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు..  రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్‌పార్క్‌ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది.

Published : 19 May 2024 06:23 IST

ఖమ్మం జిల్లా బుగ్గపాడులో నిర్మాణం.. వచ్చే నెలలో ప్రారంభం
26 ఎకరాల్లో పరిశ్రమలకు స్థలాల కేటాయింపు
భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు
25 వేల మందికి ఉపాధి అవకాశాలు

ఫుడ్‌ పార్క్‌లోని కోల్డ్‌ స్టోరేజీ

ఈనాడు, హైదరాబాద్‌: దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు..  రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్‌పార్క్‌ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత వచ్చే నెలలో దీన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ పార్క్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

ఆహారశుద్ధి రంగంలో..

ఆహారశుద్ధి రంగంలో తెలంగాణ ఇప్పుడిప్పుడే పురోగమిస్తోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినా.. ఇప్పటివరకు ఒక్క ఫుడ్‌ పార్క్‌ కూడా ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో బుగ్గపాడులో ప్రభుత్వ రంగంలో అదిపెద్ద మెగా ఫుడ్‌పార్క్‌ ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు 200 ఎకరాలు సేకరించింది. 2016లో నవంబరు 13న శంకుస్థాపన చేసింది. పార్క్‌ కోసం సేకరించిన మొత్తం భూమిలో 85.85 ఎకరాలను ఆహారశుద్ధి ప్రత్యేక మండలిగా మార్చింది.


బుగ్గపాడులో నిర్మించిన మెగా ఫుడ్‌ పార్క్‌ ప్రవేశ ద్వారం 

సమగ్ర ప్రణాళికతో..

రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు దేశవిదేశాల్లో పర్యటించి.. పార్క్‌కు సంబంధించిన బృహత్తర ప్రణాళిక రూపొందించారు. మొత్తం స్థలంలో 41.26 ఎకరాలను నిర్మాణాలు, ఇతర మౌలిక వసతులకు, 10.45 ఎకరాలు రోడ్లకు కేటాయించారు. రూ.109.44 కోట్ల వ్యయంతో అంతర్గత రోడ్లు, మురుగు, వాననీటి పారుదల వ్యవస్థ, సెంట్రల్‌ లైటింగ్, 33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్, మంచినీటి వసతి సౌకర్యం కల్పించారు. మెగా పార్కు కోసం విశాలమైన పరిపాలనాభవనం, సరకుల నిల్వ గోదాం, స్టాండర్డ్‌ డిజైన్‌ కర్మాగారం, ప్యాక్‌ హౌస్, శిక్షణ కేంద్రం, కోల్డ్‌ స్టోరేజీ, వ్యర్థాల శుద్ధి కేంద్రం, క్యాంటీన్, వేబ్రిడ్జిలను నిర్మించారు. వాషింగ్, గ్రేడింగ్, వేయింగ్, ప్యాకింగ్‌ వంటి సదుపాయాలతో పాటు రీఫర్‌ వ్యాన్లు, మెటీరియల్‌ హ్యాండ్లింగ్, రీపెనింగ్‌ ఛాంబర్లు ఉన్నాయి. పార్కింగ్‌ వసతులు కల్పించారు. పార్క్‌ చుట్టూ ప్రహరీ నిర్మించారు. 

సమీపంలో వివిధ పంటల సాగు..

స్థానికంగా లభించే పండ్లతో ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు గాను మెగా ఫుడ్‌పార్క్‌ శంకుస్థాపన నుంచే సమీపంలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో 203 ఎకరాల్లో జామ, మామిడి, జీడిమామిడి, కొబ్బరి, ఆయిల్‌పామ్, సపోటా, నిమ్మ, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసేలా రైతుల్ని అధికారులు ప్రోత్సహించారు. అవి ఏపుగా ఎదిగి ఫలసాయాలు లభిస్తున్నాయి. మరోవైపు, పార్కుకు 200 కిలోమీటర్లలోపు దూరంలోని వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో మొక్కజొన్న; నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో వరి; నల్గొండ, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో మామిడి; నల్గొండ, వరంగల్‌లలో మాంసం; నల్గొండ, వరంగల్‌లలో కోళ్లు, గుడ్లు, పాలు; వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో మిర్చి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మౌలిక వసతుల నిర్మాణాలు పూర్తి కావడంతో పాటు ముడి వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో ఈ పార్క్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. 


ప్యాక్‌హౌస్‌ 

పరిశ్రమలకు స్థలాలు 

పార్కులో వివిధ కంపెనీలకు స్థలాలు కేటాయించి.. వాటి ద్వారా ఆహారశుద్ధి రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 40.32 ఎకరాల్లో పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం 26 ఎకరాల్లో మౌలిక వసతులున్నాయి. పారిశ్రామిక యూనిట్లకు దరఖాస్తులు కోరగా.. 70 సంస్థలు ముందుకొచ్చాయి. వీటిలో అయిదు సంస్థలకు స్థలాలు కేటాయించారు. మిగిలిన సంస్థలకు వివిధ పంటలకు సంబంధించిన యూనిట్లు కేటాయించాలని నిర్ణయించారు. ప్రధానంగా అధునాతన రైస్‌ మిల్లులు, తవుడు నూనె తయారీ, పామాయిల్, బియ్యం ఆధారిత స్నాక్స్, నూడుల్స్, పల్ప్‌డ్‌ రైస్, వెర్మిసెల్లి, ఇతర ఆహార ఉత్పత్తుల యూనిట్లు, ప్యాక్‌ హౌస్‌.. కూరగాయలు, పండ్లు, మిర్చి, మొక్కజొన్న శుద్ధి యూనిట్లు.. మసాలాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా యూనిట్లు.. చేపలు, మాంసాహార పదార్థాల శుద్ధి, తయారీ యూనిట్లకు స్థలాలను కేటాయిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు స్టాంపు డ్యూటీ వంద శాతం తిరిగి చెల్లిస్తారు. భూమార్పిడి సందర్భంగా ప్లాట్ల ధరలో గరిష్ఠంగా రూ.పది లక్షల వరకు 25 శాతం రాయితీ ఇస్తారు. యూనిట్‌కు రూపాయి చొప్పున అయిదేళ్లపాటు విద్యుత్‌ రాయితీ లభిస్తుంది. అయిదేళ్లపాటు చిన్న పరిశ్రమలకు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఎస్‌జీఎస్‌టీలో 100 శాతం, మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం తిరిగి చెల్లిస్తారు. యంత్రాల వ్యయంలో 10 శాతం, నైపుణ్యాభివృద్ధిలో 50 శాతం రీయింబర్స్‌మెంట్‌ లభిస్తుంది. చిన్న పరిశ్రమలకు, మహిళలకు పావలా వడ్డీ, రూ.20 లక్షల వరకు పెట్టుబడి రాయితీ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద ప్రైవేటు వ్యాపారవేత్తలకు రూ.5 కోట్ల వరకు గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్, రైతు ఉత్పత్తి, స్వయం సహాయక సంఘాలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.10 లక్షల గ్రాంట్‌ ఇస్తారు. 

చేరువగా రవాణా..

మెగా ఫుడ్‌పార్క్‌కు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. బుగ్గపాడు సమీపంలో 365, 216, 65 నంబరు జాతీయ రహదారులతో పాటు నాగ్‌పుర్‌-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి ఉన్నాయి. కాకినాడ పోర్టు 184 కి.మీ. దూరంలో, మచిలీపట్నం (170 కి.మీ.), విశాఖపట్నం (325 కి.మీ.), కృష్ణపట్నం 420 కి.మీ. దూరంలో ఉన్నాయి. విజయవాడ విమానాశ్రయం 111 కి.మీ., హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు 299 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్లలో కొత్తగూడెం (49 కి.మీ.), ఖమ్మం (92 కి.మీ.), కొండపల్లి (95 కి.మీ.) కూడా చేరువగానే ఉన్నాయి. 


దేశానికి తలమానికంగా తీర్చిదిద్దుతాం

బుగ్గపాడు మెగా ఫుడ్‌పార్క్‌ ఏర్పాటుకు నేనే చొరవ తీసుకున్నాను. హరితంగా, పర్యావరణహితంగా, అన్నదాతలకు మంచి లాభాలు కల్పించే బృహత్తర లక్ష్యంతో దీన్ని నిర్మించాం. దీన్ని దేశానికి తలమానికంగా తీర్చిదిద్దుతాం. రైతులకు వరంగా, జాతీయస్థాయి పెట్టుబడులకు కేంద్రంగా మారుతుంది. పార్క్‌లో పరిశ్రమలకు స్థలాలు కేటాయిస్తాం. జామ, మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్లను మొదట్లోనే ప్రారంభిస్తాం. పార్క్‌ కోసం 200 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. యూనిట్లు ప్రారంభమయ్యాక మరింత విస్తరిస్తాం.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని