TGRTC: ఆర్టీసీ అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ

నేరుగా వచ్చే టికెట్‌ ఆదాయం తగ్గడంతో ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ప్రత్యక్ష రాబడి పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

Updated : 25 May 2024 03:38 IST

పురుషులకు 100 ప్రత్యేక బస్సులు నడపాలని ప్రతిపాదనలు
జూన్‌లో కొత్తగా 125 ‘మెట్రో డీలక్స్‌’లు

ఈనాడు, హైదరాబాద్‌: నేరుగా వచ్చే టికెట్‌ ఆదాయం తగ్గడంతో ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ప్రత్యక్ష రాబడి పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నూతనంగా 125 ‘మెట్రో డీలక్స్‌’ బస్సులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. వీటిలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే ‘మహాలక్ష్మి’ పథకం వర్తించదు. అదేవిధంగా పురుషుల కోసం ప్రత్యేకంగా 100కి పైగా బస్సులు నడిపేందుకు వచ్చిన ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీకి గతంలో రోజూ టికెట్ల రూపంలో 16-17 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ‘మహాలక్ష్మి’ పథకం ప్రవేశపెట్టాక ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) 64 నుంచి 90 శాతానికి చేరింది. కొన్ని డిపోల్లో 110 శాతం వరకు వెళుతోంది. ఈ ప్రకారంగా చూస్తే ‘జీరో’ టికెట్ల ఆదాయం కలిపితే రోజూ రూ.20 కోట్లకు పైగా ఉన్నట్లు కనిపిస్తోంది. మహిళలకు ఇచ్చే ‘జీరో’ టికెట్ల మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మొత్తం ప్రతి నెలా కాకుండా ప్రభుత్వం విడుదల చేసినప్పుడు వస్తుంది. దీంతో నేరుగా టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం రోజూ రూ.11 కోట్లకు పరిమితమవుతున్నట్లు సమాచారం. దీంతో డీజిల్‌ కొనుగోలు, బస్సుల నిర్వహణ, బ్యాంకు రుణాల ఈఎంఐలు, ఉద్యోగులకు వేతనాల విషయంలో ఆర్టీసీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దాదాపు రెండేళ్లపాటు ఆర్టీసీ యాజమాన్యం ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలిస్తుండగా.. ఈనెల మాత్రం ఆలస్యమైంది. దీంతో ఉన్నతాధికారులు కొద్దిరోజులుగా ఆదాయం పెంపుపై కసరత్తు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆర్టీసీలోని ఓ జోన్‌ కీలక అధికారి పురుషులకు ప్రత్యేక బస్సులు ఉండాలని సూచించారు. టికెట్‌కు పూర్తి డబ్బు చెల్లించినా బస్సుల్లో సీట్లు దొరకడం లేదంటూ పురుషులు బస్సులకు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారని వివరించారు. వందకు పైగా బస్సుల్ని పురుషుల కోసం నడిపేందుకు అనుమతించాలంటూ ఆర్టీసీ యాజమాన్యానికి లిఖితపూర్వకంగా ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. గ్రేటర్‌ ఆర్టీసీలో దాదాపు 95 శాతానికిపైగా బస్సులు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లే. ‘మహాలక్ష్మి’ పథకం వీటిలో అమలవుతుండటంతో నేరుగా వచ్చే టికెట్ల ఆదాయం తగ్గింది. మరోవైపు డొక్కు బస్సుల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ బస్సులు జూన్‌లో అందుబాటులోకి రానున్నాయి. వీటికి ‘మెట్రో డీలక్స్‌’ పేరుతో లేదంటే మరోపేరును పెట్టాలని ఆర్టీసీ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని