Tummala: ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ

ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న తెలంగాణను బియ్యం ఎగుమతుల్లోనూ త్వరలో మొదటిస్థానానికి చేరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Published : 08 Jun 2024 05:25 IST

అన్ని విధాలా ప్రభుత్వ ప్రోత్సాహం
వ్యవసాయ మంత్రి తుమ్మల
ఏటేటా పెరగనున్న సాగు: మంత్రి ఉత్తమ్‌
హైదరాబాద్‌లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ప్రారంభం

ఉత్తమ బాస్మతి బియ్యం ఎగుమతులకు గాను ఐసీఐ అందించిన పురస్కారంతో
మంత్రులు ఉత్తమ్, తుమ్మల. చిత్రంలో ఐసీఐ అధ్యక్షుడు జెరెమీ జివింగర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న తెలంగాణను బియ్యం ఎగుమతుల్లోనూ త్వరలో మొదటిస్థానానికి చేరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో పండే తెలంగాణ సోనా తదితర రకాలకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం ఉందని, అందుకు అనుగుణంగా మరిన్ని రకాలను రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ఎగుమతుల ద్వారా రైతులు అన్నివిధాలా లబ్ధి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై వెంటనే నిషేధాన్ని ఎత్తివేసి ప్రోత్సాహం అందించాలని కోరారు. హైదరాబాద్‌లో రెండు రోజుల ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును శుక్రవారం తుమ్మల, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ‘తెలంగాణ సాగులో అద్భుతాలు సాధిస్తోంది. గత ఏడాది రాష్ట్రంలోని 1.2 కోట్ల ఎకరాల్లో వరి సాగవగా.. 26 మిలియన్‌ టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. బియ్యం ఎగుమతుల్లో తెలంగాణ ప్రధాన భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలో దాదాపు 220 రకాల ధాన్యం ఉత్పత్తి జరుగుతోంది. ధాన్యం ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఇటీవలే క్వింటాలు ధాన్యానికి రూ.500 బోనస్‌ ప్రకటించాం. ఈ సదస్సు ఎగుమతులకు విస్తృతమైన మార్కెట్‌ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రపంచస్థాయిలోని కీలకమైన వర్తకులతో స్థానిక వ్యాపారులు కలిసి పని చేసే అవకాశం లభిస్తుంది’ అని తుమ్మల తెలిపారు.  

వ్యవసాయానికి అన్ని విధాలా మద్దతు 

రాష్ట్రంలో రైతు అనుకూల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని, వారి ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు వ్యవసాయానికి అన్ని విధాలుగా మద్దతు అందిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన ప్రసంగంలో తెలిపారు. దేశంలోనే అత్యధికంగా అన్నదాతలు పండించిన ధాన్యాన్ని సర్కార్‌ కనీస మద్దతు ధరకు సేకరిస్తోందని పేర్కొన్నారు. ‘తెలంగాణ వరి ఉత్పత్తి థాయ్‌లాండ్‌తో సమానం. రాష్ట్రంలో మూడువేల అత్యాధునిక రైస్‌ మిల్లులు ఉన్నాయి. రాష్ట్రంలో  నీటిపారుదల వనరులు పెరుగుతుండడంతో వరిసాగు ఏటేటా వృద్ధి చెందుతోంది. తెలంగాణ ప్రభుత్వం బియ్యం ఎగుమతిపై చర్చలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఉన్న కొన్ని పరిమితులపై కేంద్రాన్ని ఒప్పించేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణలో ఆధునిక మిల్లింగ్‌ పద్ధతుల ద్వారా నాణ్యమైన బియ్యం ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని ఉత్తమ్‌ చెప్పారు. రాష్ట్ర ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. అన్నదాతలు ప్రత్యక్ష లాభాలను పెంపొందించేందుకు ఇజ్రాయెల్‌లో నెలకొల్పిన ఉత్తమ విధానాలపై చర్చించేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, వ్యాపారుల సహకారంతో కమోడిటీ బోర్డులను ప్రవేశపెట్టాలని కేంద్రానికి సూచించారు. వరిసాగును సులభతరం చేసే మార్గాలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అంతర్జాతీయ ఆహారధాన్యాల సంస్థ (ఐసీఐ) అధ్యక్షుడు జెరెమీ జివింగర్, ఐసీఐ సలహాదారు ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య, జాతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య అధ్యక్షుడు ప్రేమ్‌గార్గ్, జాతీయ బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు, ఐసీఏఆర్‌ అనుబంధ ఐఐఆర్‌ఆర్‌ శాస్త్రవేత్తలు, రైస్‌ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు, ఆదర్శరైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచ బియ్యం మార్కెట్, హైబ్రిడ్‌ బియ్యం పరిశ్రమ, ఆహారభద్రతపై బియ్యం విధానాల ప్రభావం తదితర అంశాలపై తొలిరోజు చర్చాగోష్ఠులు జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు. వివిధ స్టాళ్లను వారు సందర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని