iPhone: భారత్‌లో తయారీ... భవితకు దిక్సూచీ!

Eenadu icon
By Editorial Desk Published : 24 Aug 2024 00:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అధిక వృద్ధిరేటు సాధిస్తోంది. కానీ, దానికి తగ్గట్టు యువతకు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. మన దేశంలో గతంలోనైనా, ప్రస్తుతమైనా పారిశ్రామిక విప్లవం సంభవించకపోవడమే ఇందుకు కారణం. భారతీయ యువతకు నాణ్యమైన, అధిక వేతన ఉద్యోగాలను అందించే విధానాలను చేపట్టడం తక్షణావసరం. 

ర్థిక సంస్కరణలు చేపట్టిన తరవాత 30 ఏళ్లపాటు మన జీడీపీ ఏటా ఆరుశాతం వృద్ధిరేటును అందుకోవడంతో 45 కోట్లమంది ప్రజలను పేదరికం నుంచి ఉద్ధరించగలిగాం. ఆ కాలంలో దేశ జనాభాలో మధ్యతరగతి ప్రజలు 10 నుంచి 30శాతానికి పెరిగారు. వారి వల్ల వస్తుసేవలకు గిరాకీ పెరిగి, ఆర్థిక వ్యవస్థ పురోగమించింది. సేవా రంగంలో అద్భుతంగా ఉపాధి అవకాశాలు సృష్టించగలిగిన భారత్‌- పారిశ్రామిక రంగంలో మాత్రం అదే ఊపు కనబరచలేకపోయింది. దేశ జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా కేవలం 15శాతం కాగా, ఉపాధి అవకాశాల్లో ఈ రంగం వాటా 10శాతమే. ప్రపంచ వస్తు ఎగుమతుల్లో మన వాటా మరీ తక్కువగా రెండు శాతమే ఉంది. కార్మికులను ఎక్కువగా ఉపయోగించుకునే పరిశ్రమలు, వాటి ఎగుమతులు లేకుండా ప్రపంచంలో ఏ దేశమూ పురోభివృద్ధి సాధించలేదు. మొదట ఐరోపా, అమెరికా, తరవాత జపాన్, దక్షిణ కొరియా ఈ వాస్తవాన్ని నిరూపించాయి. చైనా తాజా ఉదాహరణ. 

చిత్తశుద్ధితో కృషి 

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో ఆపిల్‌ ఐఫోన్ల తయారీ వార్త ఎంతో శుభపరిణామం. 2021 వరకు దాదాపు అన్ని ఆపిల్‌ ఐఫోన్లు చైనాలోనే ఉత్పత్తయ్యేవి. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకలలో తయారు అవుతుండటం విశేషం. భారత్‌లో దీనివల్ల 1,50,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 4.5 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రత్యక్ష ఉద్యోగాల్లో 70శాతం మహిళలకే దక్కడం గమనార్హం. తమిళనాడులో ఆపిల్‌ ఫోన్ల తయారీ యూనిట్ల దగ్గర మహిళా ఉద్యోగుల కోసం భద్రమైన బస కూడా ఏర్పాటు చేశారు. భారత్‌లో నేడు 1400 కోట్ల డాలర్ల విలువైన ఆపిల్‌ ఫోన్లు తయారవుతుంటే, వాటిలో 1,000 కోట్ల డాలర్ల విలువైన ఫోన్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇంతాచేసి అంతర్జాతీయ ఆపిల్‌ ఐఫోన్ల తయారీలో భారత్‌ వాటా 14శాతమే. 2026కల్లా ఇది 26 నుంచి 30శాతం వరకు పెరగవచ్చని జేపీ మోర్గాన్‌ సంస్థ అంచనా. ఆపిల్‌ ఐఫోన్‌ విడిభాగాలను తయారు చేసే విదేశీ సంస్థలను కూడా భారత్‌కు పెద్దయెత్తున ఆహ్వానించాల్సి ఉంది. ఐఫోన్‌ విలువలో 85శాతాన్ని విడిభాగాలే ఆక్రమిస్తాయి. ప్రస్తుతం అవి ప్రధానంగా చైనాలోనే తయారవుతున్నాయి. విడిభాగాల తయారీ వల్ల మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయి. వాటి తయారీకి ఆధునిక సాంకేతికత, నైపుణ్యాలు కావాలి. ఐఫోన్లు, వాటి విడిభాగాల తయారీ పరిజ్ఞానాలు భారత్‌కు, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలకు) బదిలీ అయితే పెద్దయెత్తున ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. భారతీయ ఎంఎస్‌ఎంఈలు అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో భాగస్వాములవుతాయి. జపాన్‌ కంపెనీ సుజుకి భారత్‌లో మారుతి కార్ల తయారీని చేపట్టినప్పుడు జరిగింది ఇదే. ఇక్కడ మారుతి కార్లతోపాటు వాటి విడిభాగాల తయారీకి అనేకానేక చిన్న యూనిట్లు ఏర్పడ్డాయి, యువతకు ఉపాధిని అందించాయి. 

భారతదేశం సువిశాల మార్కెట్‌ కాబట్టి విదేశీ కంపెనీలు ఇక్కడకు పొలోమని తరలి వచ్చేస్తాయనే పొరపాటు అంచనా ఒకటుంది. భారత జనాభా ఎక్కువైనంత మాత్రాన మన మార్కెట్‌ ప్రపంచంలో పెద్దది కాదని గుర్తుంచుకోవాలి. మన జనాభా కొనుగోలు శక్తి తక్కువ కాబట్టి వారు కొనగలిగే వస్తుసేవలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆపిల్‌ కంపెనీని మన దేశంలో ఐఫోన్ల తయారీ చేపట్టేలా ఒప్పించడానికి భారత ప్రభుత్వాధికారులు ఎంతో పట్టుదలగా ప్రయత్నించారు. కంపెనీ అవసరాల గురించి ఆలకించి, వాటిని తీరుస్తామని భరోసా ఇచ్చాకే ఆపిల్‌ ఇక్కడ తయారీ మొదలుపెట్టింది. కాబట్టి ప్రభుత్వం అంతర్జాతీయ పరిశ్రమలను ఆకర్షించడానికి చిత్తశుద్ధితో, పారదర్శకతతో కృషిచేయాలి. ప్రపంచంలో ఏ దేశమూ పూర్తిగా స్వదేశీ మార్కెట్‌పైనే ఆధారపడి ఉద్యోగాలు సృష్టించలేదు. చైనా మార్కెట్‌ మనకన్నా పెద్దది. చైనా విదేశీ మార్కెట్లకు ఎగుమతిపై దృష్టి కేంద్రీకరించి పారిశ్రామిక విస్తరణ, తద్వారా ఉపాధి విజృంభణను సాధించింది. ప్రపంచ వస్తు వాణిజ్య విలువ 24 లక్షల కోట్ల డాలర్లు. అందులో 70శాతం గ్లోబెల్‌ వాల్యూచైన్‌ (జీవీసీ) కిందనే జరుగుతోంది. ఉదాహరణకు ఒక స్మార్ట్‌ ఫోన్‌ సాంకేతికత, డిజైన్‌ ఒక దేశంలో రూపుదిద్దుకుంటే, దాని విడిభాగాల ఉత్పత్తి మరో దేశంలో జరగవచ్చు. కూర్పు ఇంకొక దేశంలో జరుగుతుంది. ఆ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెటింగ్‌కు వేరే దేశం కేంద్రంగా నిలవవచ్చు. ఈ అంచెలన్నీ జీవీసీలో అంతర్భాగాలే. 

ఉద్యోగాల సృష్టి

భారీ కంపెనీ ఇచ్చే కాంట్రాక్టు వల్లే ఎంఎస్‌ఎంఈ రంగంలో ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ఎంఎస్‌ఎంఈలకు రుణ సదుపాయం, ఇతర వసతులు కల్పించడం ద్వారా కొత్త ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం ఊతమివ్వాలి. అంతర్జాతీయంగా భారీ కంపెనీలు టాటా వంటి స్థానిక కంపెనీలను భాగస్వాములుగా స్వీకరిస్తాయి. ఆపిల్‌ ఐఫోన్ల తయారీలో టాటా భాగస్వామ్యమే ఇందుకు నిదర్శనం. బడా భారతీయ కంపెనీలు కూడా పరిశోధన, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి తామే బహుళజాతి సంస్థలుగా ఎదగాలి. నైపుణ్య శిక్షణ కీలకమే కానీ, ఆపిల్‌ ఐఫోన్ల కర్మాగారంలో పనిచేసే మహిళలు కేవలం 4-6 వారాల శిక్షణతోనే పూర్తిస్థాయిలో పనిచేయగలుగుతున్నారని గుర్తించాలి. మన ఐటీఐలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు పరిశ్రమలతో అనుసంధానమైనప్పుడే నిపుణ సిబ్బందిని పెద్దయెత్తున తయారుచేసుకోగలం. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ద్వారా అంతర్జాతీయ కంపెనీలను ఇక్కడికి రప్పించి ఉపాధి, వ్యాపార అవకాశాలను విస్తరించాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సుఖీభవ

చదువు