తాయిలాలతో తలరాత మారుతుందా?

పేదల తలరాతను, దేశ భవితను మార్చడానికి గొప్ప అవకాశం... ఎన్నికల్లో ప్రజలు కట్టబెట్టే అధికారం. ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూర్చడం వదిలేసి ప్రభుత్వాలు తాత్కాలిక లబ్ధి కలిగించే పథకాలతో ఏమారుస్తున్నాయి. దానివల్ల సామాన్యుల బతుకులు మారడం లేదు.

Published : 30 Apr 2024 00:15 IST

పేదల తలరాతను, దేశ భవితను మార్చడానికి గొప్ప అవకాశం... ఎన్నికల్లో ప్రజలు కట్టబెట్టే అధికారం. ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూర్చడం వదిలేసి ప్రభుత్వాలు తాత్కాలిక లబ్ధి కలిగించే పథకాలతో ఏమారుస్తున్నాయి. దానివల్ల సామాన్యుల బతుకులు మారడం లేదు. ముఖ్యంగా ఏపీలో మౌలిక వసతుల కల్పన అటకెక్కడంతో ప్రజల జీవితాలు మరింత నరకప్రాయంగా మారాయి.

దేశానికి స్వాతంత్య్రం లభించిన తరవాత ఏడున్నర దశాబ్దాల్లో వివిధ పార్టీలు అధికారంలోకి వచ్చి పాలన సాగించాయి. అయితే, ఇప్పటికీ ఇండియాలో 28శాతం నిరక్షరాస్యులున్నారు. తాగడానికి మంచినీరు లేని గ్రామాలు 30శాతం ఉన్నాయి. వైద్యంకోసం పది, పదిహేను కిలోమీటర్ల దూరం వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్ళాల్సిన దుస్థితి కొన్ని చోట్ల నెలకొంది. ఇప్పటికీ అయిదోవంతు నివాసాలు విద్యుత్‌ సౌకర్యానికి నోచుకోవడంలేదు. లాంతర్ల వెలుగులే వాటికి దిక్కవుతున్నాయి. వర్షాకాలంలో పట్టణాలలో కొన్నిచోట్ల ప్రజలు రోజుల తరబడి వరదనీటిలో చిక్కుకుపోవాల్సి వస్తోంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలన్నీ పాలకుల గత హామీలను గుర్తుకు తెస్తాయి.

విద్య, వైద్యం అధ్వానం

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర ప్రస్థానంలో దేశం సాధించింది ఏమీ లేదా అంటే... ప్రైవేటు రంగం వెలిగిపోతోంది! సరళీకృత ఆర్థిక విధానాల తరవాత దేశంలో ప్రైవేటు రంగం ఆకాశమే హద్దుగా ఎదిగింది. పర్యవసానంగా విద్య, వైద్య రంగాల్లో నేడు ప్రైవేటు రంగమే దూసుకెళ్తోంది. దేశంలోని మొత్తం విద్యాలయాల్లో 32శాతం, మొత్తం ఆస్పత్రుల్లో 40శాతం ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. నగర ప్రాంతాల్లోని రోగుల్లో 60శాతం ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారు. 70శాతం విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థల్లోనే చదువుతున్నారు. ముఖ్యంగా బడి అయినా, దవాఖానా అయినా ప్రభుత్వ నిర్వహణలో ఉంటే తగిన ప్రమాణాలు ఉండవన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుంది. వాస్తవ పరిస్థితులూ అదే విధంగా ఉన్నాయి. అందుకే ప్రజలు ప్రైవేట్‌ రంగ సంస్థలను ఎంపిక చేసుకుంటున్నారు. ఓటు వేసి గెలిపించుకున్న ప్రభుత్వాలు ప్రజలకు విద్యా వైద్యాల పరంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలను ఎందుకు అందించలేకపోతున్నాయి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడున్నర దశాబ్దాల నుంచి ఎన్నోరకాల గృహనిర్మాణ పథకాలు అమలు చేస్తున్నా ఇంకా కోట్ల మంది సొంతింటి కల ఎందుకు నెరవేరడంలేదు?

ప్రజలు కట్టే పన్నులు ఏటేటా పెరుగుతున్నాయి. 2022-23లో వసూలు చేసిన ప్రత్యక్ష, పరోక్ష పన్నుల మొత్తం రూ.29లక్షల కోట్లు. ప్రజలు ఇంత భారీగా పన్నులు కడుతుంటే, వారికి అందే సేవలు ఎందుకింత అరకొరగా, ఘోరంగా ఉంటున్నాయి? దీనికి ఇటీవల వినిపిస్తున్న జవాబు- వస్తున్న డబ్బు అంతా పేరుగొప్ప పథకాలకే సరిపోతోందని! రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి, ఆ తరవాత దాన్ని పటిష్ఠం చేసుకోవడానికి ఇలాంటి పథకాలను ఆసరాగా చేసుకుంటున్నాయి. వాస్తవానికి, ప్రజలు ఇచ్చిన అధికారంతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేయాలి. విద్య, వైద్యం, మంచినీరు, విద్యుత్‌, రహదారుల వంటి మౌలిక వసతులు కల్పించాలి. వృద్ధులు, దివ్యాంగులకు చేయూతనిచ్చే పథకాలను అమలు చేయాలి. కానీ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసి, సమాజంలోని వివిధ వర్గాలకు తాత్కాలిక ప్రయోజనాలు... అదీ పరిమితంగా కల్పిస్తూ దాన్నే సంక్షేమంగా నాయకులు భ్రమింపజేస్తున్నారు. దేశానికి ఆయువుపట్టు లాంటి సేద్యరంగంలో రైతుల రుణమాఫీలు, పెట్టుబడి సహాయం పేరిట దండిగా ఖర్చుచేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా- కర్షకుల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వలసలు ఆగడంలేదు. కౌలుదారుల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ప్రభుత్వాల పేరుగొప్ప పథకాలవల్ల పేదల జీవితాలు బాగుపడుతున్నాయా? నానాటికీ పెరుగుతున్న ధరలు పేదల నడ్డి విరుస్తున్నాయి. పథకం డబ్బు చేతికి అందిన రోజు లాటరీ మాదిరిగా వారికి క్షణికానందం కలిగిస్తోంది. ప్రస్తుత ఖర్చుల ధాటికి అది వెంటనే ఖర్చయిపోతోంది. ఆ తరవాత సామాన్యుడి నిత్య జీవితం నరకప్రాయంగానే అఘోరిస్తోంది. గతుకులు, గుంతల రహదారిపై రోజంతా తిరిగి కూరగాయలో, పండ్లు, పూలో అమ్ముకొనే పేదవాడు తనకు నగదు ఇవ్వడం కన్నా రోడ్డును బాగుచేస్తే తన చిరువ్యాపారం సాఫీగా సాగుతుందన్న వివేకవంతమైన ఆలోచన చేయలేనంత కాలం- ప్రభుత్వాలు పేరుగొప్ప పథకాలతో ప్రజలను వంచిస్తూనే ఉంటాయి. ఇలాంటి పథకాలు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించవని ఆర్థికవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నా, పాలకుల చెవికెక్కడం లేదు. రైతన్నలకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లపై రాయితీ ఇస్తే ఆ ప్రయోజనం దీర్ఘకాలం నిలిచి ఉంటుంది. ఈ రూపంలో ప్రభుత్వాలు పెట్టే పెట్టుబడి ఉత్పాదక వ్యయంగా నిలుస్తుంది.

వివేచన చూపించాల్సిన సమయం...

సమాజంలో ప్రజలు పడుతున్న కష్టాలకు కారణం ఎవరని ప్రశ్నిస్తే... ప్రజలే అని కొందరు అంటుంటారు. అసలైన అభివృద్ధికి అర్థం తెలియని ప్రభుత్వాలను ఎన్నుకున్నది వారే కదా అని విశ్లేషిస్తుంటారు. అయితే, ఎన్నికల్లో తమ తీర్పు వికటించినప్పుడు, దాన్ని సరిచేసుకోగలిగే విజ్ఞత ప్రజలకు ఉంది. తమ సంక్షేమం గురించి పట్టించుకుంటూనే దీర్ఘకాలిక ప్రయోజనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేసే దార్శనిక, బాధ్యతాయుత ప్రభుత్వాలను ఎన్నుకోవాలన్న తెలివితేటలు శ్రామికవర్గం నుంచి శ్రీమంతుల వరకూ అందరిలో ఉన్నాయి. అదే వివేకాన్ని ఉపయోగించి, తాయిలాలకు లొంగకుండా తమ తలరాతను మార్చగలిగే సర్కారును తెచ్చుకునే బాధ్యత ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలపైనా ఉంది.


జగన్‌ ప్రభుత్వంపై ప్రజాగ్రహం

డచిన అయిదేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలను వివిధ పథకాల కోసం వెచ్చించినట్లు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం పదేపదే టముకువేస్తోంది. అయితే తమనుంచి వసూలు చేసిన పన్నులతో తమ ప్రాంతంలో ఒక రోడ్డు వేయడమో లేదా మురుగు కాలువ బాగుచేయడమో చేయని ప్రభుత్వానికి తామెందుకు మద్దతు ఇవ్వాలని ప్రజలు అడుగుతున్నారు. దానికితోడు ఇష్టారీతిగా అప్పులు చేసి, రాష్ట్రాన్ని రుణభారంలోకి నెట్టివేయడంపై మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్లు అధికారం ఇస్తే ప్రతి ఒక్కరి తలపై అప్పుల కుంపటి పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. పైగా, కష్టార్జితంలో కొంత భాగాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తున్న సగటు పౌరుడు తన ఆవేదనను వ్యక్తం చేయడాన్నీ పాలక శ్రేణులు భరించలేకపోతున్నాయి. ధిక్కార స్వరంగా పరిగణించి ఉక్కుపాదం మోపుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.