సైబరాసురుల నయా అడ్డా... ఆగ్నేయాసియా!

మానవ అక్రమ రవాణాలో ఇదో కొత్త కోణం. నేర ప్రపంచంలో అత్యాధునిక పార్శ్వం. ఉద్యోగాల పేరిట ఎరవేసి కట్టుబానిసలుగా కట్టిపడేసి మోసాలు చేయిస్తున్న వైనమిది. దొంగ కాల్‌సెంటర్లను ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డాలుగా మార్చి దండుకుంటున్న సైబరాసురుల తీరు దారుణం. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న సైబర్‌ రాక్షసులకు అడ్డుకట్ట వేయాల్సిందే!

Updated : 29 May 2024 07:33 IST

మానవ అక్రమ రవాణాలో ఇదో కొత్త కోణం. నేర ప్రపంచంలో అత్యాధునిక పార్శ్వం. ఉద్యోగాల పేరిట ఎరవేసి కట్టుబానిసలుగా కట్టిపడేసి మోసాలు చేయిస్తున్న వైనమిది. దొంగ కాల్‌సెంటర్లను ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డాలుగా మార్చి దండుకుంటున్న సైబరాసురుల తీరు దారుణం. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న సైబర్‌ రాక్షసులకు అడ్డుకట్ట వేయాల్సిందే!

కంబోడియాలోని సైబర్‌ కుంభకోణ కేంద్రాల నుంచి ఇటీవల విముక్తులైన 60 మందితోపాటు ఇంతవరకు ఆ దేశం నుంచి మొత్తం 360 మంది భారతీయులు బయటపడ్డారు. కానీ, కంబోడియాతోపాటు ఇతర ఆగ్నేయాసియా దేశాలైన మయన్మార్, లావోస్, వియత్నాం సైబర్‌ మోసాల కేంద్రాల్లో ఇంకా 1,000 మంది వరకు భారతీయులు కట్టుబానిసలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కంబోడియాలో ఉద్యోగ అవకాశాలు ఆశించే భారతీయులు అధికార ఏజంట్లనే ఆశ్రయించాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయ వెబ్‌సైట్‌ హెచ్చరిస్తోంది. ఇతర ఆగ్నేయాసియా దేశాల్లోని మన రాయబార కార్యాలయాలూ ఇలాంటి హెచ్చరికలనే చేస్తున్నాయి.

రూఢి చేసుకున్నాకే...

కంబోడియాలో ఉద్యోగాలు ఇవ్వజూపుతున్న సంస్థలు చట్టబద్ధమైనవేనని రూఢి చేసుకోవాలని, పర్యటక వీసాపై వచ్చి ఉద్యోగం చేయడం వంటి అవకతవకలకు పాల్పడవద్దని అక్కడి భారత రాయబార కార్యాలయం భారతీయులను హెచ్చరిస్తోంది. లావోస్‌లోని భారత రాయబార కార్యాలయమూ ఇలాంటి హెచ్చరికనే చేస్తోంది. భారతీయులను మొదట పొరుగు దేశం థాయ్‌లాండ్‌కు రప్పించి అక్కడి నుంచి అక్రమంగా సరిహద్దు దాటించి లావోస్‌లోకి తీసుకెళ్తున్నట్లు వెల్లడించింది. లావోస్‌లోని స్వర్ణ త్రిభుజి ప్రత్యేక ఆర్థిక మండలిలో కాల్‌సెంటర్, క్రిప్టో కరెన్సీ కుంభకోణాలకు పాల్పడే మోసకారి కంపెనీలు భారతీయులకు డిజిటల్‌ సేల్స్, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్, కస్టమర్‌ సపోర్ట్‌ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్నాయి. ఈ బోగస్‌ కంపెనీలు భారత్, దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్‌లలో ఏజెంట్లను నియమించుకున్నాయని లావోస్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఆ ఏజంట్లు భారతీయ ఉద్యోగార్థులకు భారీ జీతభత్యాలను ఆశచూపుతూ టైపింగ్‌ పరీక్ష, సులువైన ముఖాముఖి ప్రక్రియలు నిర్వహించి నియామకాలు చేపడుతున్నాయి. వీసాలు ఇప్పిస్తామని, హోటల్‌ బస కల్పిస్తామని, తిరుగు ప్రయాణానికి విమాన టికెట్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. దీనికి ఆశపడి వచ్చిన భారతీయులను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడేలా చేస్తున్నాయని మన రాయబార కార్యాలయం పేర్కొంది. తాము రక్షించిన భారతీయులు చాలా గడ్డు పరిస్థితుల్లో పనిచేయడం గమనించినట్లు వెల్లడించింది. కొంతమంది భారతీయులతో గనుల తవ్వకం, కలప కర్మాగారాల్లో గొడ్డు చాకిరీ వంటివి చేయిస్తున్నారు. కంబోడియాలో తనను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు కుటుంబ సభ్యులకు వీడియో సందేశం పంపించిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. లావోస్, థాయ్‌లాండ్‌లకు పర్యటక వీసా మీద వెళ్ళినవారు అక్కడ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదనే సంగతి తెలుసుకోవాలని భారతీయ ఉద్యోగార్థులకు రాయబార కార్యాలయం హితవు పలికింది. మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా గత సెప్టెంబరు నుంచే తన వెబ్‌సైట్‌లో ఇలాంటి హెచ్చరికను ఉంచింది. ఆగ్నేయాసియా దేశాల్లోని కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చినవారు అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి ఆయా కంపెనీలు నిజమైనవో కాదో నిర్ధారించుకోవడం మేలు. ఆయా దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలన్నీ హెల్ప్‌లైన్‌ నంబర్లను ఇస్తున్నాయి. భారత రాయబార కార్యాలయాలు ఇంతగా హెచ్చరిస్తున్నా ఉద్యోగార్థులు వాటి వెబ్‌సైట్లను చూసి జాగ్రత్తపడటం లేదని సుప్రీంకోర్టు న్యాయవాది, సైబర్‌ చట్టాల నిపుణుడు పవన్‌ దుగ్గల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యకృత్యంగా మారుతున్న సైబర్‌ నేరాల విషయంలో అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. భారతదేశంలో ఉపాధి అవకాశాల కొరత వల్లనే మన యువత ఆగ్నేయాసియా దేశాల్లో మోసగాళ్ల బారిన పడుతున్నారని డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ నిపుణుడు అమోల్‌ కులకర్ణి వంటివారు అభిప్రాయపడుతున్నారు. ఈ దేశాల్లో భారతీయులను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమిస్తున్నారు. వివిధ ప్రాంతీయ భాషలకు చెందినవారిని ఎంచుకొని ఆయా ప్రాంతాలవాసులను ఆన్‌లైన్‌లో మోసం చేసేందుకు వాడుకుంటున్నారు. భారతీయ ఉద్యోగార్థులను మొదట ఆగ్నేయాసియా దేశాల్లోని బోగస్‌ కాల్‌ సెంటర్లకు తీసుకెళ్ళి శిక్షణ ఇచ్చి కొన్ని నెలలపాటు క్రమం తప్పకుండా 700 నుంచి 800 డాలర్ల వరకు జీతాలు చెల్లిస్తున్నట్లు విదితమవుతోంది. ఆపైన వారి పాస్‌పోర్ట్‌లు లాగేసుకుని ఎక్కడికీ వెళ్ళకుండా నియంత్రిస్తారు. ఇదొక కొత్తరకం మానవ అక్రమ రవాణాగా భావించవచ్చు. వారిని వదిలిపెట్టాలంటే భారీ మొత్తాలను ఎదురు చెల్లించాలని డిమాండ్‌ చేస్తారు. నియామకాల ఏజంట్లు కూడా జాడలేకుండా పోతారు.

అందరి సహకారంతో...

ఆగ్నేయాసియా దేశాల్లోని ముఠాల నుంచి ఎదురవుతున్న సైబర్‌ నేరాల ముప్పును ఎదుర్కోవడానికి కేంద్ర హోంశాఖ వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఉన్నత స్థాయి కమిటీని నెలకొల్పింది. ఈ కమిటీ విదేశాంగ శాఖతో, వివిధ సామాజిక మాధ్యమాల ప్రతినిధులు, భద్రతా సంస్థలతో సమన్వయం నెరపుతోంది. ఇది ఆగ్నేయాసియా దేశాల్లోని భద్రతా సంస్థల సహకారమూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయా దేశాల్లో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను గుర్తించడం, భారతీయులను కాపాడి స్వదేశానికి చేర్చడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్‌ మోసాలవల్ల భారతీయులు పోగొట్టుకున్న డబ్బును తిరిగి వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సైబర్‌ మోసాలపై భారతీయులకు అవగాహన పెంచడానికి రిజర్వు బ్యాంకు ‘బీ ఎవేర్‌’ అనే చిన్న పుస్తకాన్ని, ‘జీరో లయబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌’ అనే పత్రాన్ని ప్రచురించింది. వినియోగదారు మోసం జరిగిందని నిర్ణీత కాలవ్యవధిలో ఫిర్యాదుచేస్తే సంబంధిత ఫైనాన్స్‌ కంపెనీ పరిహారం చెల్లించకతప్పదని రిజర్వు బ్యాంకు సైతం వెల్లడించింది. బ్యాంకులు, పే వ్యాలెట్లు కూడా అనుమానాస్పద లావాదేవీలను అడ్డుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో సైబరాసురుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే అన్ని వర్గాలు సమన్వయంతో సమష్టి కృషి జరపాల్సిందే!


ఉద్యోగాల ఎర

ఆన్‌లైన్‌ నేర ముఠాలు సామాజిక మాధ్యమాల ద్వారా, పలు ఇతర పద్ధతుల్లో భారతీయులకు ఎరవేస్తున్నాయి. అంతర్జాతీయ సంఘటిత నేర ముఠాలు భారతీయులకు మంచి ఉద్యోగాల ఆశ చూపి మయన్మార్‌లో తిరుగుబాట్లు, హింస నిత్యం ప్రజ్వరిల్లే తూర్పు ప్రాంతాల్లో పనిచేయడానికి పంపుతున్నాయి. కల్లోల ప్రాంతాలుగా పేరొందిన చోట్ల ఈ ముఠాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఆన్‌లైన్‌ కుంభకోణాలు, ధన అక్రమ చలామణీ, మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధిస్తామని మయన్మార్‌ ప్రభుత్వం ప్రకటించినా సంక్షుభిత ప్రాంతాల్లో సర్కారు అజమాయిషీ కొరవడింది. సంఘటిత నేర ముఠాల మాటే చలామణీ అవుతోంది.


అరూణిమ్‌ భూయాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు