వ్యవసాయ పర్యటకానికి కొత్త చివుళ్లు

ఇటీవలి కాలంలో వ్యవసాయ పర్యటకం ప్రాచుర్యం పొందుతోంది. నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలు తీరిక సమయాల్లో ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించాలి. 

Updated : 28 Mar 2024 04:10 IST

ఇటీవలి కాలంలో వ్యవసాయ పర్యటకం ప్రాచుర్యం పొందుతోంది. నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలు తీరిక సమయాల్లో ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించాలి.

వ్యవసాయ క్షేత్రాల సందర్శన ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. విదేశీయులు సైతం మన పొలాలను చూడటానికి, ఇక్కడి పద్ధతులను ఆకళింపు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సందర్శకులకు వినోదం, విజ్ఞానం, సాగు అనుభవాలను అందించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చడం వ్యవసాయ పర్యటకం ప్రాథమిక లక్ష్యం. దేశ వ్యవసాయ పర్యటక విపణి 2023-28 మధ్య 19.9శాతం సమ్మిళిత వార్షిక వృద్ధిరేటును సాధిస్తుందని అంచనా. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాలు వ్యవసాయ పర్యటకంలో ముందున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, మలేసియా తదితర దేశాల్లోనూ విస్తృతమవుతోంది. మన దేశంలో వ్యవసాయానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చే విభాగాలను అనుసంధానిస్తే జీడీపీకి ఆ రంగం సహకారం పెరుగుతుంది. ఇందుకు వ్యవసాయ పర్యటకాన్ని ప్రోత్సహించడం మంచిది. కేరళలో సుగంధ ద్రవ్యాల తోటలు, తమిళనాడులోని ఊటీ తదితర చోట్ల తేయాకు, కర్ణాటకలోని కూర్గ్‌లో కాఫీ తోటలు, సంబంధిత పరిశ్రమలు ఆకట్టుకుంటున్నాయి. రాజస్థాన్‌లో డెయిరీ అభివృద్ధి, పశువుల పోషణ, కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో యాపిల్‌ తోటలు, మహారాష్ట్రలో పండ్ల సాగు, వాటిని శుద్ధిచేసే పరిశ్రమలు... ఇలా మరెన్నో ప్రాంతాలు పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

వ్యవసాయ పర్యటకం పట్టణాలు, నగరాల్లో ఉండే వారికి గ్రామీణ జీవితంపై అవగాహన కలిగిస్తుంది. విద్యార్థులు సాగులో ఆచరణాత్మక అనుభవం సాధించడానికి తోడ్పడుతుంది. ఆహార సరఫరాతోపాటు పలు రకాల మొక్కలు, జంతువులు, హస్తకళలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, దుస్తులు, గ్రామీణ జీవన శైలి గురించి తెలుసుకుంటారు. ప్రకృతి వైపు ఆకర్షితులయ్యేందుకు దోహదపడుతుంది. పర్యటకులను వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్ళి అక్కడి పనులను పరిచయం చేస్తే సేద్య రంగంలో కష్టనష్టాలేమిటో వారికి అవగాహన కలుగుతుంది. తాజా ఆహారాన్ని, ఉత్పత్తులను వారు ఆస్వాదించగలుగుతారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులపైనా అవగాహన పెంచుకోవచ్చు. ఈ తరహా పర్యటకంలో ఆహార, వసతి, వినోద, ప్రయాణ ఖర్చులు తక్కువే. కాబట్టి యాత్రికులపై ఆర్థిక భారం తక్కువగానే ఉంటుంది. పర్యటకులు రావడం దేశంలో వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి దోహదం చేస్తుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు క్రమంగా అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయ పర్యటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కేంద్ర పర్యటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక అంశాలతో కూడిన టూరిస్టు సర్క్యూట్‌ల అభివృద్ధి కోసం ‘స్వదేశీ దర్శన్‌’ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగస్వాములను ప్రోత్సహించడానికి ఏటా పురస్కారాలనూ ప్రదానం చేస్తోంది.

ఇటీవలి కాలంలో వివాహాలు, సమావేశాలను పొలాల్లో ఏర్పాటుచేసే ధోరణి పెరుగుతోంది. విస్తరిస్తున్న ఆరోగ్య స్పృహ, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రకృతి అనుకూల మార్గాల అన్వేషణ కారణంగా అగ్రి టూరిజం అంతకంతకు ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఉపాధి కల్పనలోనూ పర్యటక రంగానిది కీలకపాత్ర. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా మహారాష్ట్ర మొదటిసారిగా వ్యవసాయ పర్యటక విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘వ్యవసాయ పర్యటక అభివృద్ధి సంస్థ’ను ఏర్పాటుచేసింది. దీని ద్వారా రైతులను భాగస్వాములుగా చేర్చి వ్యవసాయ పర్యటకాన్ని ప్రోత్సహిస్తోంది. రవాణా, వసతి వంటి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తూ యాత్రికులు వ్యవసాయ క్షేత్రాల్ని సందర్శించేలా చర్యలు తీసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ పర్యటకానికి పలు అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ, తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాలు ఇందుకు అనుకూలం. ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే వ్యవసాయ పర్యటకం మరింత అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇందులో ప్రధాన సమస్య. దీని అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతోపాటు స్థానికుల సహకారం ఎంతో అవసరం. సాగు పనుల నుంచి సాంస్కృతిక అంశాల వరకు విభిన్న అనుభవాలను అందించడం ద్వారా పర్యటకులను ఆకర్షించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి. రైతుల సహకారంతోనే విజయం సాధ్యమవుతుంది.     దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించే దేశ విదేశీ యాత్రికులను ఆకర్షిస్తే    వ్యవసాయ పర్యటకం పురోగతి సాధిస్తుంది.

డి.ఎస్‌.బాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.