వైద్యులు నకిలీ... మందులు కల్తీ!

దేశీయ విద్యారంగం దుర్బలమని, ఇక్కడి స్థాయీప్రమాణాలు నేలబారువని ఎవరెన్ని విమర్శలు గుప్పించినా- భారత్‌లో కొంతమందికి ఓ గొప్ప సౌలభ్యముంది. ఆ ప్రత్యేకశ్రేణి ఎవరంటారా? విద్యార్హతలు లేకపోతేనేం- జంకూ గొంకూ లేకుండా తెల్లకోటు తొడుక్కుంటారు.

Updated : 31 Mar 2024 01:30 IST

దేశీయ విద్యారంగం దుర్బలమని, ఇక్కడి స్థాయీప్రమాణాలు నేలబారువని ఎవరెన్ని విమర్శలు గుప్పించినా- భారత్‌లో కొంతమందికి ఓ గొప్ప సౌలభ్యముంది. ఆ ప్రత్యేకశ్రేణి ఎవరంటారా? విద్యార్హతలు లేకపోతేనేం- జంకూ గొంకూ లేకుండా తెల్లకోటు తొడుక్కుంటారు. మెడలో స్టెత్‌స్కోప్‌ వేలాడదీస్తారు. క్లినిక్కులు తెరుస్తారు. అన్నిరకాల రోగాలకూ చికిత్స చేసెయ్యగలమంటారు. నమ్మి బుట్టలో పడినవాళ్లకు డబ్బూపోయి శనీ పట్టిన చందంగా దురవస్థ దాపురించక తప్పదు. కొంతమంది క్లినిక్కులో ఒకపక్క నిల్వలు పేర్చి మందులూ విక్రయించేస్తుంటారు. అలా కొంతమంది ప్రబుద్ధులు తెలంగాణ ఔషధ నియంత్రణ అథారిటీ (డీసీఏ) తనిఖీల్లో తాజాగా దొరికిపోయారు. వాస్తవానికి- నకిలీ వైద్యులు, అనుమతులు లేని క్లినిక్కుల బాగోతం ఒక్క తెలంగాణకే పరిమితమైన సమస్య కాదు. తరతమ భేదాలతో దేశమంతటా తామరతంపరలా అల్లుకుపోయిందీ జాడ్యం.

సుమారు మూడు నెలలక్రితం దేశరాజధానిలో నకిలీ వైద్యుల ఉత్పాతం హడలెత్తిస్తున్నదంటూ దిల్లీ ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యమొకటి దాఖలైంది. అందుకు ప్రధాన ప్రేరణ- అగర్వాల్‌ బృంద అక్రమ దందా. పిత్తాశయంలో రాళ్ల తొలగింపుతోపాటు సిజేరియన్‌ ప్రసవాలకు సంబంధించిన శస్త్ర చికిత్సల్నీ ఆ ముఠా చేస్తుండేది. ఆ క్లినిక్‌లో సర్జరీలు చేయించుకున్న ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయిన దరిమిలా దేశ రాజధానిలో గగ్గోలుపుట్టింది. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు వైద్యుల్ని, ఇంకో ఇద్దరు నకిలీ డాక్టర్లను అరెస్ట్‌ చేశారు. అలా ఆ ముఠా గుట్టు రట్టయింది. ఆమధ్య కాకినాడలో నకిలీ ఆర్‌ఎంపీ లీలలు ఇలాగే బట్టబయలయ్యాయి. జనావాసాల్లో తిరుగుతూ వృద్ధుల్ని పరిచయం చేసుకోవడం, చవగ్గా మెరుగైన వైద్యం చేస్తానని నమ్మించడం, ఇంజక్షన్‌ ఇచ్చి బాధితులు తేరుకునేలోగా అందినన్ని నగలతో ఉడాయించడంలో అతగాడు రాటుతేలిపోయాడు. గ్రామాల్లో సంచరిస్తూ డాక్టర్‌ ముసుగులో చోరీలు చేయడంలో ఆరితేరిన మోసగాడు వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో చాలామందికి టోపీ పెట్టాడు! దొంగ సర్టిఫికెట్లు పుట్టించి రెండు దశాబ్దాలకు పైగా భాగ్యనగరంలోని పలు కాలనీల్లో క్లినిక్కులు తెరిచి చేతనైనంత రాబట్టుకున్న నకిలీ వైద్య దంపతులు నిరుడు జూన్‌లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అప్పట్లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన జాబితా ప్రకారం- గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు వందమంది నకిలీ డాక్టర్లు వైద్య శిఖామణులుగా చలామణీ అవుతున్నారు. గోదావరి జిల్లాల్లోనూ అనుమతులు, అర్హతలు వంటివేమీ లేకుండా ఇష్టారాజ్యంగా క్లినిక్కులు నిర్వహిస్తూ మూడు సూదులు ఆరు సిరంజీలుగా లక్షల్లో దండుకుంటున్న నకిలీ వైద్య పుంగవుల లీలావిలాసాలెన్నో వెలుగు చూశాయి. దేశంలోని తక్కినచోట్లా ఐఎంఏ(ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌)లో సభ్యత్వం పొందకుండానే వైద్యం వెలగబెడుతున్నా, శస్త్రచికిత్సలు సైతం చేసేస్తున్నా, సొంతంగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నా- తనిఖీలు, కనీస పర్యవేక్షణ, నిఘా కొరవడటమన్నది ప్రపంచంలో మరే దేశంలోనైనా సాధ్యమవుతుందా? విడ్డూరమేమిటంటే, దేశంలో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ తరహా బోగస్‌ వైద్యులు 10లక్షల మంది వరకు ఉంటారని స్వయంగా ఐఎంఏ మొన్న నవంబరులో ప్రకటించింది. తద్వారా, స్వీయవైఫల్యాన్ని భారత వైద్యమండలి నిర్లజ్జగా చాటుకున్నట్లయింది!

ఆరోగ్యం భారత పౌరుల ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం ఘనంగా చాటుతున్నా- బహుముఖ సవాళ్లు ఆ స్ఫూర్తిని కుళ్లబొడుస్తున్నాయి. భారత్‌లో 57శాతానికి పైగా డాక్టర్లు సరైన అర్హతలు లేకుండానే అపర ధన్వంతరులుగా చలామణీ అవుతున్నారని ఆమధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ సూటిగా ఆక్షేపించింది. 140కోట్లకు పైబడిన జనాభాకు, ముఖ్యంగా గ్రామీణ భారతావని అవసరాలకు తగినంత మంది వైద్యులు కొరవడిన దుష్పరిణామాలు అడుగడుగునా గోచరిస్తున్నాయి. ఫార్మసిస్టుల్లోనూ కల్తీల జోరు హడలెత్తిస్తోంది. ఆమధ్య పంజాబులో అయిదు వేల మందికి పైగా నకిలీ ఫార్మసిస్టుల ఉదంతం గగ్గోలు పుట్టించింది. నకిలీ ఔషధాలకు సంబంధించి నేరం రుజువైతే, ఐరోపాలో పదిహేనేళ్ల వరకు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. అటువంటిదిక్కడ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా నకిలీ డాక్టర్లు, కల్తీ ఔషధాలు ఇంతగా జోరెత్తడమేమిటి? మనుషుల ప్రాణాలు పోవడానికి కారకులైనవాళ్లు ఎవరెంతటివారైనా సరే- కఠిన దండన అమలు జరిగితీరుతుందన్న బెదురు కల్తీగాళ్లలో కొరవడటమే అసలైన అనర్థం.

దేశం బంధవిముక్తమై ఏడున్నర దశాబ్దాల కాలం గతించింది. ఇప్పటికీ అర్హతలు లేనివాళ్లు వైద్యులవుతూనే ఉన్నారని, కోట్లాది సాధారణ పౌరుల బతుకులతో చెలగాటమాడుతూ యావత్‌ సమాజానికే వాళ్లు పెనుముప్పుగా పరిణమిస్తున్నారని లోగడ సుప్రీంకోర్టు సూటిగా ఆక్షేపించింది. వైద్యవృత్తిలో చొరబడిన నకిలీల ఏరివేతలో ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాలనీ సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది. తెల్లకోటు యమభటుల పీచమణచే పకడ్బందీ కార్యాచరణ ఏదీ? వైద్య పట్టాలు అసలైనవా నకిలీవా అని విచారించే నైపుణ్యం తనకు ఎక్కడిదని మెడికల్‌ కౌన్సిల్‌ చేతులెత్తేయడంకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? పదోతరగతి ఆపై చదువులతోనే డాక్టర్లుగా చలాయించుకుంటున్నవాళ్ల సక్రమ వడపోతకు సరైన ఏర్పాట్లు కొరవడినన్నాళ్లు- దేశంలో జీవించే హక్కు ఉండీ లేనట్లే!

భారత్‌లో వైద్యాన్ని వృత్తిగా చేపట్టదలచే ఎవరైనా ఎంసీఐ నిబంధనావళికి కట్టుబాటు చాటాలి. శిశువు గర్భంలో ఉన్నప్పటినుంచి మనిషి ప్రాణానికి అత్యంత గౌరవం ఇస్తామని, రోగి ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం కల్పిస్తామని ప్రమాణపత్రం మీద సంతకం చేయాలి. ఆ సద్వివేచన, మానవీయ స్ఫూర్తి- నకిలీ వైద్యుల ఉరవడిలో కొట్టుకుపోతున్నాయి. ధనపిశాచ సంతతి దుర్లక్షణాలు పోటెత్తుతున్నాయి. డాక్టర్లు, నర్సులు, మంత్రసానులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది... వీరిలో ఎవరికి సరైన విద్యార్హతలు, శిక్షణ కొల్లబోయినా- ప్రజారోగ్యానికది శరాఘాతమవుతుంది. అంగట్లో సర్టిఫికెట్లు కొనుక్కుని వైద్యావతారం ఎత్తేవాళ్ల పీడ విరగడ అయ్యేదెలా? వివిధ పాఠశాలల బోర్డులు మొదలు విశ్వవిద్యాలయాల వరకు వేర్వేరు అంచెల ధ్రువీకరణ పట్టాలను డిజిటల్‌ రూపంలో అందించాలని కేంద్రం ఎన్నాళ్లుగానో సూచిస్తోంది. దాంతోపాటు దేశం నలుమూలలా సర్టిఫికెట్ల తనిఖీకి వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావడం మంచిది. నకిలీ ధ్రువపత్రాల తయారీని అడ్డుకోగలిగే వ్యవస్థాగత సంస్కరణలు చురుకందుకోవడంతోపాటు పటిష్ఠ నిఘా సాకారమైతేనే- మాయదారి వైద్యుల కూసాలు కదులుతాయి!

 బాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు