గొంతెండుతున్న నగరాలు

వేసవి ఆరంభంలోనే బెంగళూరు మహానగరం తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతోంది. ప్రజలు నీటిని వృథా చేయరాదని అక్కడ ఆంక్షలు విధించారు. తాగునీటితో కార్లను కడిగినందుకు జరిమానాలు విధించడం బెంగళూరు నగర నీటి కష్టాలకు నిదర్శనంగా నిలుస్తోంది.  ఇలాంటి పరిస్థితుల్లో అన్నిచోట్లా అందరూ అప్రమత్తంగా వ్యహరించాల్సిందే. భారత్‌లో 2030 నాటికి 40 శాతం....

Updated : 01 Apr 2024 05:21 IST

వేసవి ఆరంభంలోనే బెంగళూరు మహానగరం తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతోంది. ప్రజలు నీటిని వృథా చేయరాదని అక్కడ ఆంక్షలు విధించారు. తాగునీటితో కార్లను కడిగినందుకు జరిమానాలు విధించడం బెంగళూరు నగర నీటి కష్టాలకు నిదర్శనంగా నిలుస్తోంది.  ఇలాంటి పరిస్థితుల్లో అన్నిచోట్లా అందరూ అప్రమత్తంగా వ్యహరించాల్సిందే.

భారత్‌లో 2030 నాటికి 40 శాతం ప్రజలకు సరైన తాగునీటి వసతి ఉండదని నీతిఆయోగ్‌ స్పష్టచేసింది. ‘వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌’ నివేదిక ప్రకారం 2050కల్లా ముంబయి, దిల్లీ, జైపుర్‌, లఖ్‌నవూ, చెన్నై, ఇందౌర్‌, అమృత్‌సర్‌, పుణె, శ్రీనగర్‌, కోల్‌కతా, కోజికోడ్‌లతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం లాంటి నగరాల్లో దాహంతో ప్రజలు అల్లాడక తప్పని దుస్థితి నెలకొంటుందనే హెచ్చరికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది ఐరాస నివేదిక ప్రకారం భారత్‌లోని ఇండో-గంగా బేసిన్‌లో ఇప్పటికే భూగర్భ జలమట్టాలు అడుగంటిపోయాయని, 2025 కల్లా ఈ ప్రాంతంలో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోతుందని వెల్లడించడం నీటి కరవు తీవ్రతకు అద్దం పడుతోంది. భవిష్యత్తులో తాగునీటి కష్టాలు అనేక నగరాల్లోని ప్రజలను పట్టి పీడిస్తాయన్న సంగతిని ప్రభుత్వాలు, ప్రజలు గ్రహించాలి. తదనుగుణంగా ముందునుంచే తగిన చర్యలు తీసుకోవాలి.

కుండపోత వర్షాలు కురిసినా...

దేశంలో నగరాలు విస్తరిస్తుండటంతో పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సహజ వనరుల పరిరక్షణపై దృష్టి సారించడం లేదు. అప్పటికప్పుడు తాత్కాలిక అవసరాలు తీరడంపైనే దృష్టి సారిస్తున్నారు. భవిష్యత్తుకు సంబంధించి శాశ్వత ప్రయోజనాలు నెరవేరేలా చర్యలు కొరవడుతున్నాయి. దేశంలో నాలుగు వేలదాకా నగరాల్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పాలన యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకపోవడంతో నీటి కరవు లాంటి సంక్షోభాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న నగరాల్లో వర్షాభావ పరిస్థితులు కూడా లేవు. వీటిలో చాలా వరకు నగరాలు వానాకాలంలో వరదల సమస్యతో సతమతమయ్యేవే. కుండపోత వర్షాలు కురిసి నగరాలు మునిగిపోతున్నా, వచ్చిన నీటిని ఒడిసిపట్టే మార్గాలు లేకపోవడం శోచనీయం. మంచి నీటి చెరువులను అడ్డగోలుగా ఆక్రమించి, విచ్చలవిడిగా స్థిరాస్తి వ్యాపారానికి వినియోగించడంతో నీటి వనరులు ధ్వంసమైపోతున్నాయి. బోరుబావుల తవ్వకంలో సరైన మార్గనిర్దేశకాలు పాటించకపోవడం, నగర వాసులకు నీటి వినియోగంపై సరైన అవగాహన కల్పించకపోవడం, ఇంటింటికీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోకపోవడం తదితర జల సంరక్షణ చర్యలపై ముందుచూపు కొరవడి- నగరాల్లో తాగునీటి సమస్య విలయ తాండవం చేస్తోంది.  

దేశవ్యాప్తంగా నగరాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ‘అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ (అమృత్‌)’ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ తరవాత దానికి కొనసాగింపుగా అమృత్‌ 2.0ను తెచ్చింది. ఈ పథకం కోసం దేశవ్యాప్తంగా రూ.32,793 కోట్ల విలువైన 4,676 ప్రాజెక్టులను పూర్తి చేసినా ఆశించిన ప్రయోజనాలు పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. ఈ పథకం అమలవుతున్న వరంగల్‌ లాంటి చిన్న నగరాల్లోనూ ఇప్పటికీ తాగునీటి సరఫరాలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. లీకేజీల బెడద, సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఆకర్షణీయ నగరాల పథకం కింద 2015-16లో దేశవ్యాప్తంగా వంద నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. పథకం అమలవుతున్న నగరాల్లో తాగునీటి సమస్య పరిష్కారం, మురుగునీటి శుద్ధీకరణతో మంచినీటిని ఆదా చేసే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే చర్యలు లేవు.

జల సంరక్షణ చర్యలే కీలకం

నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో ఉదాసీనత పనికిరాదు. ముందునుంచే మేల్కొనకపోతే ముప్పు తప్పదు. కృత్రిమ మేధ తదితర సాంకేతికతల ద్వారా భూగర్భ జలమట్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. ఆ సమాచారం ఆధారంగా పాలన యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన ప్రయోజనాల్ని సాధించవచ్చు. ప్రఖ్యాత పరిశోధక, సాంకేతిక విద్యాసంస్థల సాయంతో జల సంరక్షణ చర్యలు అమలు చేయాలి. నీటి ఎద్దడిని అరికట్టేందుకు ముందునుంచే అవసరమైన జాగ్రత్తలను పాటించేలా ప్రజల్లో అవగాహన పెంచాలి. బహుముఖ వ్యూహాలను పాటిస్తేనే తాగునీటి కరవును కట్టడి చేయడం సాధ్యమవుతుంది.

జి.పాండురంగశర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.