మహిళలకు రక్షాకవచం... హెచ్‌పీవీ టీకా!

భారతీయ మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఒకటి. ఏటా సుమారు లక్షా 25 వేలమంది దీనిబారిన పడుతున్నారు. దాదాపు 70 వేలమంది తనువు చాలిస్తున్నారు. విస్తృతస్థాయిలో హెచ్‌పీవీ టీకాను అందించడం ద్వారా బాలికలందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరముంది.

Published : 23 May 2024 00:40 IST

భారతీయ మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఒకటి. ఏటా సుమారు లక్షా 25 వేలమంది దీనిబారిన పడుతున్నారు. దాదాపు 70 వేలమంది తనువు చాలిస్తున్నారు. విస్తృతస్థాయిలో హెచ్‌పీవీ టీకాను అందించడం ద్వారా బాలికలందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరముంది.

ఎక్కువగా 30 ఏళ్ల వయసు పైబడిన మహిళల్లో ఈ క్యాన్సర్‌ కనిపిస్తుంది. హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ)తో సంభవిస్తుంది. ఈ వైరస్‌ ఎంత ఎక్కువ కాలం శరీరంలో ఉంటే, క్యాన్సర్‌ కలిగించడానికి అంతగా అవకాశం ఉంటుంది. హెచ్‌పీవీ కుటుంబంలో వందకు పైగా వైరస్‌లలో డజన్‌ వైరస్‌లను గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కారకాలుగా గుర్తించారు. క్యాన్సర్‌పై సరైన అవగాహన లేకపోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించక పోవడం, ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, ఖరీదైన వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో లేకపోవడం మన దేశంలో ఈ వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. నిరక్షరాస్యత, వ్యక్తిగత ఆరోగ్యంపై నిర్లక్ష్యం, వ్యాధి నిర్ధారణలో జాప్యం కూడా వ్యాధి తీవ్రతకు దోహదపడుతున్నాయి. క్రమం లేని రక్తస్రావం జరగడం వ్యాధి ప్రధాన లక్షణం. అయితే, నివారించదగిన క్యాన్సర్‌ వ్యాధుల్లో ఇది కూడా ఒకటన్న సంగతి గుర్తించాలి.

సార్వత్రిక కార్యక్రమం

హెచ్‌పీవీ వైరస్‌ నిరోధకంగా అందుబాటులోకి వచ్చిన టీకా వైద్య శాస్త్రంలో విప్లవాత్మక ఆవిష్కరణ. ఇది 70శాతందాకా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ టీకాను అవసరమైన మందుల జాబితాలో చేర్చడమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ అందుబాటులోకి తీసుకురావాలని పిలుపిచ్చింది. అయిదు నుంచి పదేళ్లపాటు రక్షణ కల్పించే ఈ టీకా పలురకాలుగా లభ్యమవుతుంది. హెచ్‌పీవీ టీకా తీసుకోవడం వల్ల కొన్ని ఇతరత్రా వైరస్‌ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఉదాహరణకు 80శాతం వరకు మలద్వార క్యాన్సర్లను, 60శాతం వెజైనల్‌ క్యాన్సర్లను అరికడతాయి. హెచ్‌పీవీ6, హెచ్‌పీవీ11 ద్వారా సంక్రమించే జననాంగ పులిపిరి కాయల నుంచి రక్షణ కల్పిస్తాయి. బాలికల వయస్సును బట్టి టీకా రెండు లేదా మూడు మోతాదుల్లో వేయించాల్సి ఉంటుంది. తొమ్మిది నుంచి 13 సంవత్సరాల వయసున్న బాలికలకు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో అధిక సంఖ్యలో బాలికలకు టీకాలు వేయడం వల్ల వైరస్‌ తీవ్రత తగ్గి సమూహ నిరోధకత ద్వారా ఇతర బాలికలకు కూడా కొంతవరకు రక్షణ కలుగుతుంది. టీకా వేసిన చోట కొద్దిపాటి నొప్పి, వాపు, ఎరుపుదనం లాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప చాలా వరకు సురక్షితమేనని తేలింది. దాదాపు 125 దేశాలు తమ టీకా పంపిణీ వ్యవస్థలో హెచ్‌పీవీ టీకాకు కూడా స్థానం కల్పించాయి. 47 దేశాల్లో బాలికలతోపాటు బాలురకు కూడా ఈ టీకా ఇస్తున్నారు. మన దేశంలో పదిహేనేళ్లు పైబడిన 50 కోట్ల మంది యువతులు, మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉన్నట్లు అంచనాలున్నాయి. జాతీయ సాంకేతిక సలహా సంఘం రెండేళ్ల క్రితమే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను సార్వత్రిక టీకా కార్యక్రమంలో చేర్చాలని సూచించింది. అందుకు అనుగుణంగా నీతి ఆయోగ్‌ 2022లో దీన్ని సార్వత్రిక టీకా కార్యక్రమంలో అంతర్భాగం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో హెచ్‌పీవీ టీకాలు అందజేస్తున్నాయి. దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాల్లో ప్రజలకు కొంతమేర అవగాహన కల్పించడం ద్వారా బాలికలకు టీకాలు వేయిస్తున్నారు.

ముందున్న కర్తవ్యం

టీకాల తయారీలో ముందంజలో ఉన్న భారతదేశం విస్తృతంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తయారు చేయడంపై దృష్టి సారించాలి. దేశీయ టీకాతో తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ మందికి పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్‌ మహమ్మారి కలగజేసే నష్టంతో పోలిస్తే టీకాల కోసం వెచ్చించే ఖర్చు చాలా తక్కువేనని భావించాలి. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను సార్వత్రిక టీకా పంపిణీ కార్యక్రమంలో అంతర్భాగంగా చేయడం ద్వారా బాలికలందరికీ ఉచితంగా వేసి క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడాలి. కౌమారదశలో ఉన్న బాలికలకు వ్యక్తిగత శుభ్రత, లైంగిక ప్రవర్తన వంటి అంశాల్లో సరైన అవగాహన కల్పించాలి. 21 సంవత్సరాల వయసు దాటిన మహిళలందరికీ క్రమం తప్పకుండా పాప్‌స్మియర్‌ పరీక్ష ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి వైద్య చికిత్స చేయించడం ద్వారా మరణాలను అరికట్టాలి. అభివృద్ధి చెందిన దేశం దిశగా అడుగులు వేయాలంటే జనాభాలో సగభాగమైన మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందే. విస్తృత రీతిలో టీకాల పంపిణీ ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌  ముప్పునుంచి మహిళలను కాపాడాలి.

డాక్టర్‌ పి.వి.సుధాకర్‌
(ఏపీ వైద్యవిద్య మాజీ అదనపు సంచాలకులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.