తెలుగు యువతకు విముక్తి

కొంతకాలంగా ఆగ్నేయాసియా దేశాలు సైబర్‌ నేరాలకు అడ్డాగా మారాయి. నేర ముఠాలు భారతీయ యువతకు ఉద్యోగాల ఎరవేసి, అక్కడకు పిలిపించి ఆన్‌లైన్‌ మోసాలు చేయిస్తున్నాయి. ఇలాంటి వారిని కాపాడి స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం నడుం కట్టింది.

Published : 11 Jun 2024 01:35 IST

కొంతకాలంగా ఆగ్నేయాసియా దేశాలు సైబర్‌ నేరాలకు అడ్డాగా మారాయి. నేర ముఠాలు భారతీయ యువతకు ఉద్యోగాల ఎరవేసి, అక్కడకు పిలిపించి ఆన్‌లైన్‌ మోసాలు చేయిస్తున్నాయి. ఇలాంటి వారిని కాపాడి స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం నడుం కట్టింది.

ఆగ్నేయాసియా దేశాల సైబర్‌ మోసగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, గూగుల్‌ యాడ్స్‌ వంటి వేదికలు, నకిలీ యాప్స్‌ ద్వారా భారతీయులకు ఉద్యోగాల ఆశ చూపుతారు. వలలో చిక్కిన వారిని మొదట థాయ్‌లాండ్‌కు చేర్చి, అక్కడి నుంచి మయన్మార్, కంబోడియా, లావోస్‌ దేశాల్లోని నిర్బంధ సైబర్‌ శిబిరాలకు పంపుతారు. అక్కడ వారితో ఆన్‌లైన్‌ నేరాలు చేయిస్తున్నారు. గడచిన నాలుగైదు నెలల్లో కంబోడియా నుంచి 360 మంది భారతీయులను క్షేమంగా తీసుకొచ్చామని సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం (ఐఫోర్‌సీ) ప్రధానాధికారి రాజేశ్‌ కుమార్‌ ఇటీవల వెల్లడించారు. ఆ తరవాత విడుదలైన మరో 60 మంది ఇటీవల దిల్లీ చేరుకున్నారు. వారిలో ఆంధ్ర, తెలంగాణలకు చెందినవారు, ముఖ్యంగా విశాఖపట్నం, చుట్టుపక్కల ప్రాంతాలవారే 15 మంది ఉన్నారు. గత ఏడాది కాలంలో దాదాపు 115 మంది ఏపీ యువకులు కంబోడియా సైబరాసురుల ఊబిలో చిక్కుకున్నట్లు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యనార్‌ వెల్లడించారు. ఉద్యోగాల ఆశ చూపి మన యువకులను ఎల్లలు దాటిస్తున్న స్థానిక ఏజెంట్లు ముగ్గురిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏజెంట్లు ప్రతి ఉద్యోగార్థి నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేశారు.

కంబోడియాలోని సిహనౌక్‌ పట్టణంలోని జిన్‌బెయ్‌ కాంపౌండ్‌ సైబర్‌ మోసాలకు నిలయంగా మారింది. ఉద్యోగాల ఆశతో అక్కడకు చేరుకున్న భారతీయ యువకులకు సైబర్‌ ముఠాలు దేశదేశాల వారిని మోసం చేసి డబ్బు కొల్లగొట్టే పనులు అప్పగిస్తాయి. క్రిప్టో కరెన్సీ, ఫెడెక్స్, స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణాలు, ఆన్‌లైన్‌ గేములు, రుణయాప్‌లు, డేటింగ్‌ పేరుతో నేరాలు, మోసాలు చేయిస్తారు. రోజుకు ఇంతమందిని మోసం చేసి ఇంత సంపాదించాలని నిర్దేశిస్తారు. తాము చెప్పిన మొత్తాన్ని సంపాదించలేకపోయిన వారికి ఒక్క పూటే భోజనం పెడతారు. ఎదురు తిరిగినవారికి రోజుల తరబడి భోజనం పెట్టకుండా మాడ్చేస్తారు. చీకటి గదుల్లో ఉంచి బేస్‌బాల్‌ బ్యాట్లతో కొడతారు. ఈ చిత్రహింసలపై ఇటీవల జిన్‌బెయ్‌ కాంపౌండ్‌లో 300 మంది భారతీయులు ఎదురుతిరిగారు. భారతీయులను విడిపించడానికి కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగి విజయం సాధించింది. కంబోడియా, లావోస్, మయన్మార్‌లలో చిక్కుకున్న భారతీయులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం గత నెలలో వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీని నియమించింది. సీబీఐ, ఎన్‌ఐఏ వంటి దర్యాప్తు సంస్థల అధికారులు సైతం ఈ కమిటీలో ఉన్నారు. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌ మధ్య జాతీయ సైబర్‌ నేరాల రిపోర్టింగ్‌ పోర్టల్‌కు రోజుకు సగటున ఏడు వేల చొప్పున 7.40 లక్షల ఫిర్యాదులు అందాయని ఐఫోర్‌సీ అధిపతి రాజేశ్‌ కుమార్‌ చెప్పారు. వాటిలో 85శాతం ఆన్‌లైన ఆర్థిక మోసాలకు సంబంధించినవి. అందులోనూ 46శాతం మోసాలకు ఆగ్నేయాసియా దేశాలే ఆలవాలంగా నిలుస్తున్నాయి.

కొవిడ్‌ మహమ్మారి విరుచుకు పడటానికి ముందు ఆగ్నేయాసియాలోని కంబోడియా, లావోస్, మయన్మార్, ఫిలిప్పీన్స్‌ దేశాల అధికారులు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల) కోసం చైనాలోని జూదశాల(క్యాసినో)లను తమ దేశాలకు రావలసిందిగా ఆహ్వానించారు. మయన్మార్‌లోనైతే వాటి కోసం ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ఏర్పరచారు. నేడు ఆగ్నేయాసియా దేశాల్లో 340 క్యాసినోలు ఉన్నాయి. వాటిలో సంఘటిత నేరగాళ్ల ముఠాలు చొరబడ్డాయి. కొవిడ్‌ కాలంలో ప్రభుత్వాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో పలు క్యాసినోలు ఖాళీ అయ్యాయి. వీటిని సంఘటిత నేరగాళ్లు అక్రమ ధనాన్ని చట్టబద్ధమైనదిగా చలామణీ చేయడానికి, ఆన్‌లైన్‌ మోసాలకు ఉపయోగించడం మొదలుపెట్టారు. బంగారం దొంగరవాణా వంటి నేరాల ద్వారా సంపాదించిన సొమ్మును మొదట క్రిప్టో కరెన్సీగా, ఆపైన చట్టబద్ధమైన ధనంగా మార్చి దేశాల ఎల్లలు దాటించడానికి మయన్మార్, కంబోడియా, లావోస్‌ దేశాల్లోని క్యాసినోలు ఉపయోగపడుతున్నాయి. మరోవిధంగా చెప్పాలంటే ఈ క్యాసినోలు షాడో బ్యాంకింగ్‌ వ్యవస్థగా మారాయి. దీన్నిబట్టి సైబర్‌ నేరాల విస్తృతి, తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా నేరాలపై పోరుకు అంతర్జాతీయ సమన్వయ సహకారాలు అవసరం.

 ఆర్య

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.