BJP: భాజపా ఆధిక్యం ఎందుకు తగ్గింది?

మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా సీట్లు సాధించాలన్న భారతీయ జనతా పార్టీ కల కల్లగా మిగిలింది. కనీసం సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లనూ భాజపా సాధించలేకపోయింది.

Published : 11 Jun 2024 01:38 IST

మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా సీట్లు సాధించాలన్న భారతీయ జనతా పార్టీ కల కల్లగా మిగిలింది. కనీసం సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లనూ భాజపా సాధించలేకపోయింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఆ పార్టీకి భారీ భంగపాటు ఎదురైంది. దీనికి కారణాలు ఏమిటి?

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో విజేతలకు విజయ గర్వం కొరవడితే, పరాజితులు తామే విజేతలమైనట్లు పొంగిపోతున్నారు. ఇది నిజంగా చిత్రమైన పరిస్థితి. కొత్త లోక్‌సభలో తమకు కనీస మెజారిటీ అయిన 272 సీట్లకు మించి, ఏకంగా 400 స్థానాలకు పైగా వస్తాయని భారతీయ జనతా పార్టీ హోరెత్తించింది. తీరా భాజపా సొంతంగా 240 సీట్లు మాత్రమే సాధించింది. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ 99 సీట్లతో సరిపుచ్చుకోవడం భాజపాకు ఆనందదాయకమే. అయితే, కనీస మెజారిటీ అయిన 272 సీట్లకు 32 స్థానాలు కొరతపడటం భాజపాను నీరసపరచింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ వరసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ 272 సీట్లకు దరిదాపుల్లోకి రాలేకపోయింది. మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ వరసగా 44, 52, 99 సీట్లు గెలిచింది. వాటన్నింటినీ కలిపినా అవి 2024 ఎన్నికల్లో భాజపా సాధించిన 240 సీట్లకన్నా తక్కువే. అయినా రాహుల్‌ గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో తానే విజేతనన్నట్లు మురిసిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భాజపాకు సాధారణ మెజారిటీ దక్కకుండా చేయడమే తన లక్ష్యమనుకుని ఉంటే దాన్ని సాధించానని సంబరపడటంలో తప్పు లేదు. అయితే, నరేంద్ర మోదీ వరసగా మూడోసారి ప్రధాన మంత్రి పదవిని చేపట్టకుండా నిలువరించడంలో రాహుల్‌ సఫలం కాలేకపోయారు. ఇప్పటిదాకా మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన ఘనత జవహర్‌లాల్‌ నెహ్రూకు మాత్రమే ఉంది.

వ్యతిరేక ప్రచారం వల్ల...

ఈ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామంటూ భాజపా చేసుకున్న ప్రచారం ఆ పార్టీకే నష్టం కలిగించింది. భాజపాకు 400 సీట్లు వస్తే అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని బుట్టదాఖలు చేస్తారని, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఓబీసీలకు రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్‌ ప్రచారం చేయడానికి అవకాశం ఇచ్చినట్లయింది. ఈ దుష్ప్రచారం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని దళితులపై బాగా ప్రభావం చూపింది. అందుకే వారు భాజపానే కాదు, మాయావతి బీఎస్పీని సైతం కాదని కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలకు ఓటు వేశారు. అంతేకాదు, ఉత్తర్‌ ప్రదేశ్‌ జనాభాలో 18 నుంచి 20శాతం వరకు ఉండే ముస్లిములూ భాజపాకు దూరమయ్యారు. తాము రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం తమను దెబ్బ తీస్తోందని భాజపా నాయకులు గ్రహించారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని ముస్లిములకు ఇవ్వాలనుకొంటోందని నరేంద్ర మోదీ ప్రచారం మొదలుపెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. తమకు రాజ్యాంగాన్ని రద్దుచేసే ఉద్దేశం లేదని చెప్పినా ఫలితం దక్కలేదు. పైగా, భాజపా నాయకులు విడవకుండా సాగించే ముస్లిం వ్యతిరేక ప్రచారం ఆ వర్గాన్ని పార్టీకి దూరం చేసింది. రాజకీయ నాయకుల పిలుపు మేరకు ముస్లిములు భాజపాను ఓడించాలని పట్టుదలగా ఓటు వేశారు. బీఎస్పీ కానీ, ఇతరులు కానీ నిలబెట్టిన బలహీన ముస్లిం అభ్యర్థులకు ఓటు వేస్తే తమ ఓట్లు నిష్ఫలమైపోతాయని అందరూ గంపగుత్తగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు ఓటు వేశారు. ముస్లిములు మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థులను పనిగట్టుకుని ఓడించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వాపోయారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రామ్‌పుర్‌ లోక్‌సభా నియోజకవర్గంలోని ఒక గ్రామంలో నూటికి నూరు శాతం ముస్లిం ఓటర్లే ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆ గ్రామంలోని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్‌ పథకం కింద 550 ఇళ్లు మంజూరు చేసింది. అయినా, అక్కడ పోలైన 2,300కు పైగా ఓట్లలో ఒక్కటి కూడా భాజపాకు పడలేదు.

సంకీర్ణ ధర్మం పాటిస్తూ...

ఎన్డీయే కూటమిలో ఏపీలోని తెలుగుదేశం, జనసేన పార్టీలు, బిహార్‌లోని జేడీ(యు) సైతం ఉన్నాయి. మోదీ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే అది ఆంధ్రప్రదేశ్, బిహార్‌ల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. తొలిసారిగా మోదీ సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహిస్తున్నారు. అందువల్ల, గతంలో మాదిరిగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇకపై భాజపాకు ఉండకపోవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆయా అంశాల్లో సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ మోదీ ముందుకు సాగాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. మరోవైపు లోక్‌సభలో బలమైన ప్రతిపక్షం ఏర్పడటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో గట్టి ప్రతిపక్షం కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగని, లోక్‌సభలో రాహుల్‌ గాంధీ దూకుడు ప్రదర్శిస్తే నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు ఆయనకు దీటుగా స్పందిస్తారు. ఏది ఏమైనా 18వ లోక్‌సభ జాతి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా విస్తృత చర్చలతో పటిష్ఠ చట్టాలను రూపొందించాలి. అవే, వికసిత భారత్‌కు చుక్కానిలా నిలుస్తాయి. 


తప్పని నిరాశ

త్తర్‌ ప్రదేశ్‌లో టికెట్ల పంపిణీలో ముఖ్యమంత్రి యోగితోపాటు ఇతర రాష్ట్ర నాయకుల మాటను భాజపా అధిష్ఠానం సాగనివ్వలేదన్న కథనాలు వెలువడ్డాయి. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్నీ అధిష్ఠానమే నియంత్రించిందని అంటున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో సీట్లు తగ్గబట్టే భాజపా లోక్‌సభలో 272 స్థానాలను దాటలేకపోయింది. దీనికి భాజపా కేంద్ర నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన అధీర్‌ రంజన్‌ చౌధరి (కాంగ్రెస్‌) 1990ల నుంచి పశ్చిమ్‌ బెంగాల్‌లో బెర్హంపుర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. ఈసారి ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ గుజరాత్‌ నుంచి తెచ్చి నిలిపిన మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ చేతిలో ఓడిపోయారు. బెర్హంపుర్‌ నియోజకవర్గంలో 52శాతం ఓటర్లు మైనారిటీలేనని ఇక్కడ గమనించాలి. డెబ్భై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన అధీర్‌ రంజన్‌- ‘బెర్హంపుర్‌ అభివృద్ధికి 30 ఏళ్లుగా రక్తాన్ని, చెమటను ధారపోశాను. అయినా ఓటమిని ఒప్పుకోక ఏం చేస్తాం’ అని నిట్టూర్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.