Updated : 18/06/2022 18:50 IST

Heeraben Modi: ఆ విజయాల వెనుక కనిపించని సంతకం!

‘అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!’ అంటుంటారు. తానెంత ఉన్నత హోదాలో ఉన్నా అమ్మ చాటు బిడ్డనే అంటున్నారు ప్రధాని మోదీ. ఆయన తల్లి హీరాబెన్‌ వందో పుట్టినరోజు సందర్భంగా.. ఆమె కాళ్లు కడిగి ఆశీర్వచనాలు తీసుకున్నారాయన. అంతేకాదు.. తనను ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అమ్మ పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. అమ్మతో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని ఓ సుదీర్ఘ బ్లాగ్‌ రూపంలో రాసుకొచ్చారు మోదీజీ. తన విజయం వెనుక కనిపించని సంతకమే అమ్మ అంటూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.

అలాగని ‘హీరాబెన్‌’ ఉన్నత విద్యావంతురాలు కాదు.. గొప్ప గొప్ప వారి ఆదర్శాలూ ఆమెకు తెలియవు.. ఆమెకు తెలిసిందల్లా అమ్మగా బిడ్డలకు ప్రేమాప్యాయతల్ని పంచడం.. వారికి వ్యక్తిత్వ విలువలు నేర్పి సమాజంలో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడం. మరి, ఈ ఆదర్శమూర్తి శత వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

అందుకు అమ్మే ఉదాహరణ!

తన తల్లి హీరాబెన్‌ వందో పుట్టినరోజు సందర్భంగా ఆమెతో తనకున్న జ్ఞాపకాల్ని బ్లాగ్‌లో ఇలా రాసుకొచ్చారు మోదీ. అందరు తల్లుల్లాగే తన తల్లీ అనితర సాధ్యురాలు అంటున్నారు. ‘చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పుల్ని ప్రతిబింబిస్తాయంటారు. అందుకు అమ్మే గొప్ప ఉదాహరణ! మా చిన్నతనంలో వర్షాకాలంలో ఓ రోజు బాగా వాన కురుస్తోంది. దాంతో ఇంటి పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయి. ఆ సమయంలో ఎక్కడెక్కడైతే నీళ్లు లీకవుతున్నాయో.. అక్కడ బకెట్లు, పాత్రలు పెట్టింది. అలా సేకరించిన నీళ్లను తదుపరి అవసరాల కోసం వినియోగించచ్చన్నది తన ఆలోచన. నిజానికి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అమ్మ ఆలోచించిన విధానం గొప్పది. నీటి పొదుపుకి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేముంటుంది?

అప్పుడు పసి పిల్లాడినైపోతా..!

ఇదొక్కటనే కాదు.. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడంలో ఆమెకు ఆమే సాటి. ఇప్పటికీ తనను కలిసినప్పుడల్లా తాను స్వయంగా తయారుచేసిన స్వీట్లు తన చేతులతో నాకు తినిపిస్తుంటుంది. పసిపిల్లాడిలా లాలిస్తుంది. తినడం పూర్తయ్యాక న్యాప్‌కిన్‌తో నా ముఖమంతా తుడుస్తుంది. ఈ వయసులోనూ ఎప్పుడూ ఓ న్యాప్‌కిన్‌ తన నడుముకు చుట్టుకునే ఉంటుంది.. అందరమ్మల్లాగే మా అమ్మా ఎంతో సింపుల్‌గా ఉంటుంది.. తను అనితర సాధ్యురాలు!’ అంటూ అమ్మను ఆకాశానికెత్తేశారు మోదీజీ.

అమ్మతో కలిసి రెండుసార్లే..!

ప్రతి సందర్భంలోనూ తన తల్లిని వ్యక్తిగతంగా కలుసుకొని ఆమె ఆశీర్వచనాలు తీసుకునే మోదీ.. బహిరంగంగా కలిసింది మాత్రం రెండుమార్లే అంటున్నారు. ‘అమ్మ అనే పదంలో ఎన్నో భావోద్వేగాలు నిండి ఉన్నాయి. మా అమ్మ ఎన్నో త్యాగాలకు ప్రతిరూపం. నన్ను వ్యక్తిగతంగా, మానసికంగా, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు ఆమె ఎన్నో కష్టాలు పడింది. అయితే ఆమెతో కలిసి బహిరంగంగా కనిపించింది మాత్రం రెండే రెండుసార్లు. ఒకటి - ఏక్తా యాత్ర ముగించుకొని గుజరాత్‌కు తిరిగొచ్చాక నిర్వహించిన బహిరంగ సభలో అమ్మ పాల్గొని నా నుదుట తిలకం దిద్ది నన్ను ఆశీర్వదించింది. ఇంక రెండోసారి - 2001లో గుజరాత్‌ సీఎంగా ప్రమాణం చేసే సమయంలో బహిరంగ సభలో అమ్మ పాల్గొంది.

అమ్మే నా టీచర్..!

చదువు లేకపోయినా జీవితాన్ని చదవాలని తెలిసేలా చేసింది అమ్మే. ఒకసారి నా గురువుల్ని సన్మానించాలని అనుకున్నా. మా అమ్మే నాకు అతిపెద్ద టీచర్‌. అందుకే ఆమెనూ సన్మానించాలని ఆహ్వానించా. కానీ ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించింది. తన బదులు నాకు చిన్నప్పుడు అక్షరాలు దిద్దించిన స్థానిక టీచర్‌ని గౌరవించమని కోరింది. ఆమె ఆలోచనా విధానం, దూరదృష్టి నన్నెప్పుడూ ఆశ్యర్యానికి గురిచేస్తూనే ఉంటాయి. ఎన్నో కష్టనష్టాలకు, త్యాగాలకు మరో రూపం అమ్మ. ఎన్నో పోరాటాల కంటే ఉన్నతమైనది తల్లి బలమైన సంకల్పం..!’ అంటూ ఎమోషన్‌ అయ్యారు మోదీ. అమ్మ గొప్పతనానికి అద్దం పట్టేలా ఉన్న ఈ సుదీర్ఘ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.


చదువు రాకపోతే ఏంటి ?!

ఒక పురుషుడిని ‘నువ్వేం కాగలవు ?’ అని అడిగితే డాక్టర్‌, ఇంజినీర్‌, శాస్త్రవేత్త.. ఇలా ఎవరి ఆసక్తిని బట్టి వాళ్లు చెబుతుంటారు. అదే స్త్రీని ‘నువ్వేం కాగలవు ?’ అనడిగితే మాత్రం.. అన్నింటికంటే ముందు అమ్మతనానికే ఓటేస్తుంది. సంతానానికి సత్ప్రవర్తన నేర్పి సమాజోద్ధారకులుగా వారిని మార్చగలనని చెబుతుంది. హీరాబెన్ కూడా అదే చేసింది. ఆమెకి చదువు రాదు! అయితే ఏంటి ? ఎదుటివారికి కష్టం, నష్టం కలిగించకూడదని తెలుసు! ఆ విలువలే మోదీకి నేర్పింది!

అడుగడుగునా ఆమె ముద్ర!

గుజరాత్‌కు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పటిలానే తల్లి దీవెనల కోసం వెళ్లారు మోదీ! అప్పుడు ఆమె మోదీకిచ్చిన సందేశం ‘బాబూ.. లంచం తీసుకోకు!’ అని. వినడానికి మామూలు మాటలానే ఉన్నా.. అప్పుడు 50 ఏళ్లున్న మోదీని ఇంకా పసిపిల్లాడిగానే భావించి సత్ప్రవర్తన నేర్పించాలనుకుందా తల్లి హృదయం.

అంతేకాదు.. మోదీ ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. దాంతో తనే స్వయంగా ఏటీఎమ్ క్యూలో నిలబడి కొడుక్కి మద్దతుగా నిలిచింది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఒక సాధారణ మహిళగానే వెళ్లి కొడుక్కి ఓటు వేస్తుంటారు హీరాబెన్. ఇలా ఆయన విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాదు.. ప్రజలు ఆయనకు పట్టే నీరాజనాలు చూసి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతారు కూడా!


ఆమె ‘ఆరోగ్య’ రహస్యం అదేనట!

వందేళ్ల వయసులోనూ అటు ఉత్సాహంగా ఉంటూనే.. ఇటు ఉన్నతంగా ఆలోచిస్తుంటారు హీరాబెన్. ఆరోగ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు. ఇదంతా ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్లే సాధ్యమంటున్నారు ఆమె వ్యక్తిగత వైద్య నిపుణులు. హీరాబెన్ ఎక్కువగా ఇంటి ఆహారానికే ప్రాధాన్యమిస్తారట! ఒకవేళ కుటుంబంతో కలిసి బయటి ప్రదేశాలకు వెళ్లినా.. ఇంటి నుంచే స్నాక్స్‌, ఇతర పదార్థాలు తయారుచేసుకొని తీసుకెళ్లడం ఆమెకు అలవాటట! అంతేకాదు.. పప్పులు, కాయధాన్యాలు, కిచిడీ, అన్నం, చపాతీ.. వంటివి రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే ఆమె.. నూనెలు, మసాలాలు తక్కువగా వాడుతుంటారట! ఇవే కాదు.. కరోనా టీకా తీసుకునే విషయంలోనూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు హీరాబెన్. తన 99 ఏళ్ల వయసులో వ్యాక్సిన్‌ తీసుకొని.. దీనిపై చాలామందిలో ఉన్న అపోహలు, భయాల్ని పటాపంచలు చేశారామె.

అక్షరం ముక్క నేర్చుకోకముందే.. ఆడిపాడే వయసులో ఓ టీ కొట్టు వ్యాపారి ‘దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ’ని వివాహం చేసుకున్న హీరాబెన్ ఆరుగురు సంతానానికి జన్మనిచ్చారు. మోదీ మినహా అందరూ ప్రభుత్వోద్యోగాల్లో స్థిరపడ్డారు.

చివరగా మనలో మన మాట.. పెద్ద పెద్ద పట్టాలు పుచ్చుకున్నప్పటికీ ఒక్క సంతానాన్ని గాడిలో పెట్టడమే ఈ రోజుల్లో గగనమవుతోంది. అలాంటిది తన సంతానానికి తల్లిగా, వ్యక్తిత్వ విలువలు నేర్పిన గురువుగా హీరాబెన్ సాధించింది అఖండ విజయం అని చెప్పచ్చు.. ఆమె పెంపకానికి జోహార్లు పలకచ్చు.. ఏమంటారు ?!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని