Updated : 30/10/2021 12:49 IST

దాతృత్వంలోనూ శ్రీమంతురాళ్లే!

ఉద్యోగాల్లోనే కాదు.. వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు ఎంతోమంది మహిళలు. తమ వ్యాపార వ్యూహాలతో కంపెనీలను లాభాల బాట పట్టిస్తున్నారు. ఏటికేడు లక్షల కోట్ల ఆర్జనతో దేశంలోనే సంపన్న మహిళలుగా ఎదుగుతున్నారు. అంతేకాదు.. దాతృత్వంలోనూ పోటీ పడుతూ తమ మంచి మనసును చాటుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది వితరణలో ముందు నిలిచిన కొందరు వ్యాపారవేత్తల జాబితాను తాజాగా హురున్ ఇండియా ప్రకటించింది. ‘ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్‌ 2021’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో తొమ్మిది మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. మరి, వారెవరు? ఎంతెంత విరాళంగా అందించారు? రండి.. తెలుసుకుందాం..!

రోహిణి నీలేకని, ఫిలాంత్రపిస్ట్

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని సతీమణిగానే కాకుండా.. సమాజ సేవతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రోహిణి నీలేకని. ఓవైపు రచయిత్రిగా కొనసాగుతూనే.. మరోవైపు పలు సేవా కార్యక్రమాలూ చేపడుతుంటారామె. ఈ క్రమంలోనే నీరు-పారిశుద్ధ్య సమస్యల్ని పరిష్కరించేందుకు Arghyam Foundation, అందరికీ విద్యా ఫలాలు చేరువ చేయడానికి Akshara Foundation, EkStep.. వంటి స్వచ్ఛంద సంస్థలు స్థాపించారు. మరోవైపు Ashoka Trust for Research in Ecology and the Environment (ATREE) బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీల్లో ఒకరిగా కొనసాగుతున్నారామె. ఇలా తన సేవా కార్యక్రమాలతోనే కాదు.. దాతృత్వంతోనూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా హురున్ విడుదల చేసిన ఫిలాంత్రపీ లిస్ట్‌లో రూ. 69 కోట్ల దాతృత్వంతో మహిళల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు రోహిణి.

 

లీనా తివారీ, యూఎస్‌వీ ప్రై. లి. ఛైర్‌పర్సన్

(Photo: leenagandhitewari.blogspot.com)

మనదేశంలో జనరిక్ మందులు తయారుచేసే ప్రైవేటు రంగ సంస్థ యూఎస్‌వీ ఫార్మా. మధుమేహం, గుండె సంబంధిత సమస్యలకు సంబంధించిన ఔషధాలను తయారుచేయడంలో పేరుగాంచిందీ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు లీనా తివారీ. ఆమె తాతయ్య విఠల్ బాలకృష్ణ గాంధీ యూఎస్‌వీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని 1961లో స్థాపించారు. తన తాతయ్య, తండ్రి తర్వాత ఈ కంపెనీ బాధ్యతల్ని భుజాలకెత్తుకున్న లీనా.. తన వ్యాపార దక్షతతో సంస్థను లాభాల బాట పట్టిస్తున్నారు. ఇటీవలే ఫోర్బ్స్ విడుదల చేసిన ‘వంద మంది భారతీయ సంపన్నుల’ జాబితాలో రూ. 3.28 లక్షల కోట్ల సంపదతో 43వ స్థానంలో నిలిచారు లీనా. ఇక తాజాగా హురున్ ఫిలాంత్రపీ లిస్ట్‌లో రూ. 24 కోట్ల విరాళంతో రెండో స్థానాన్ని ఆక్రమించారు. ప్రస్తుతం ఆమె భర్త ప్రశాంత్ యూఎస్‌వీ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 

అను అగా, Thermax Ltd. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్

దేశంలో బిలియనీర్‌ బిజినెస్ ఉమన్‌గా పేరు తెచ్చుకున్నారు అను అగా. 1996 నుంచి 2004 వరకు Thermax Ltd. అనే ఇంజినీరింగ్‌ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించిన ఆమె.. తన వ్యాపార వ్యూహాలతో కంపెనీని అభివృద్ధి చేశారు. 2004లో ఈ పదవి నుంచి విరమణ పొందినప్పట్నుంచి కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు సామాజిక సేవ పైనా దృష్టి సారించారు అను. విద్యపై ఎక్కువ మక్కువ చూపే ఆమె.. పేద విద్యార్థులకు విద్యాఫలాల్ని అందించేందుకు ఏర్పాటైన ‘ఆకాంక్ష’ అనే స్వచ్ఛంద సంస్థతో మమేకమై పనిచేశారు. ప్రస్తుతం Teach For India అనే ఎన్జీవోకు ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతోన్న ఈ ఫిలాంత్రపిస్ట్‌.. గతంలో ఓసారి రాజ్యసభకు కూడా నామినేట్‌ అయ్యారు. అను సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2010లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ఇలా సేవలోనే కాక.. దాతృత్వంలోనూ ముందుండే ఈ బిజినెస్‌ లేడీ.. తాజాగా హురున్ విడుదల చేసిన ఫిలాంత్రపీ లిస్ట్‌లో రూ. 20 కోట్ల వితరణతో మహిళల్లో మూడో స్థానం దక్కించుకున్నారు.

 

రాధా వెంబు, జోహో కో ఫౌండర్

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ‘జోహో’ సహ వ్యవస్థాపకురాలిగా రాధా వెంబు అందరికీ సుపరిచితమే! 1996లో తన అన్నయ్య శ్రీధర్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించారామె. ప్రపంచవ్యాప్తంగా ఈమెయిల్‌ సర్వీస్‌ అందించే ప్రముఖ సంస్థల్లో ఒకటిలా జోహో మెయిల్‌ను నిలబెట్టడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. సంస్థ కోట్లకు పడగెత్తినా తాను మాత్రం సాధారణ ఉద్యోగిలా ఉండడానికే ఇష్టపడతానంటారు రాధ. ప్రస్తుతం ఈ సంస్థకు యాభై కోట్లకు పైగా యూజర్లున్నారు. జోహో ప్రొడక్ట్స్‌ నిర్వహణ బాధ్యతతో పాటు బృందాలనూ ముందుండి నడిపిస్తున్నారామె. పని ప్రదేశంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా చూడడం, ఎగ్జిక్యూటివ్‌లకు పూర్తి స్వేచ్ఛనివ్వడం, పనిలో నాణ్యతను ప్రదర్శించడం.. ఇవే తన సంస్థ విజయ రహస్యాలని చెప్పే రాధ.. ఈ ఏడాది హురున్ అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక తాజాగా ఇదే సంస్థ విడుదల చేసిన ఫిలాంత్రపీ లిస్ట్‌లో రూ. 12 కోట్ల వితరణతో మహిళల్లో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

 

కిరణ్ మజుందార్ షా, బయోకాన్ ఛైర్‌పర్సన్

‘బయోకాన్ లిమిటెడ్’ పేరుతో దేశంలోనే అతిపెద్ద బయో ఫార్మాస్యూటికల్ కంపెనీని నెలకొల్పిన ఘనత ఆ సంస్థ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షాకే దక్కుతుంది. 1978లో ఈ సంస్థను స్థాపించిన కిరణ్.. దీని ద్వారా మధుమేహం, క్యాన్సర్, రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపే వ్యాధులను నయం చేసే మందుల్ని ఉత్పత్తి చేసే దిశగా కృషి చేశారు. చక్కటి వ్యాపార దక్షతతో మలేషియాలోనూ ఓ ఫ్యాక్టరీని నెలకొల్పి దాని ద్వారా ఆసియాలోనే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థగా బయోకాన్‌ను అభివృద్ధి చేశారామె. అంతేకాదు.. కొత్త తరహా ఔషధాలు రూపొందించే విషయంలో చొరవ తీసుకొని ముందుకు దూసుకుపోతున్నారు కిరణ్. ఈ క్రమంలోనే వివిధ క్యాన్సర్ల చికిత్స కోసం తయారుచేసే ఔషధాలలో ఉపయోగించే మందు విషయంలో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్‌డీఏ) అనుమతి కూడా తీసుకున్నారు.

కేవలం వ్యాపారంలో రాణించడమే కాదు.. తనలో సేవాగుణం కూడా ఉందంటున్నారు కిరణ్. అందుకే భవిష్యత్తులో ఓ మెడికల్ సెంటర్‌ను ఏర్పాటుచేసి, దాని ద్వారా క్యాన్సర్ చికిత్స కోసం అవసరమైన మందుల్ని సామాన్యులకు సైతం చేరువ చేసే ఆలోచనలో ఉన్నారీ బిజినెస్ వుమన్. ఇలా తనలోని క్రియేటివ్ ఆలోచనలతో కంపెనీని ముందుండి నడిపించడంతో పాటు సేవలోనూ ముందున్న కిరణ్.. తాజా హురున్ ఫిలాంత్రపీ లిస్ట్‌లో రూ. 9 కోట్ల విరాళంతో ఏడో స్థానాన్ని ఆక్రమించారు.

వీరితో పాటు.. మంజు డి గుప్తా & ఫ్యామిలీ (రూ. 16 కోట్లు), సారా జార్జ్‌ ముత్తూట్‌ & ఫ్యామిలీ (రూ. 10 కోట్లు), రేణు ముంజల్‌ & ఫ్యామిలీ (రూ. 8 కోట్లు), కవిత యదుపర్తి సింఘానియా & ఫ్యామిలీ (రూ. 5 కోట్లు).. తదితరులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని