Qatar Airways: కుదుపుల బారిన మరో విమానం.. 12 మందికి గాయాలు!

దోహా నుంచి డబ్లిన్‌ వెళ్తోన్న ఖతర్‌ ఎయిర్‌వేస్‌ (Qatar Airways) విమానం ఆకాశంలో భారీ కుదుపులకు లోనైన ఘటనలో 12 మంది గాయపడ్డారు.

Published : 26 May 2024 21:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఘటన మరువక ముందే అలాంటిదే మరో ప్రమాదం నమోదైంది. ఖతర్‌లోని దోహా నుంచి ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ వెళ్తోన్న ఖతర్‌ ఎయిర్‌వేస్‌ (Qatar Airways) విమానం ఆకాశంలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 12 మంది గాయపడ్డారు. డబ్లిన్‌ విమానాశ్రయం ఈ విషయాన్ని ‘ఎక్స్‌’ వేదికగా ధ్రువీకరించింది. ఖతర్‌ ఎయిర్‌వేస్‌ సైతం.. కొద్దిమంది ప్రయాణికులు, సిబ్బందికి విమానంలో స్వల్ప గాయాలయ్యాయని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ఒక ప్రకటనలో తెలిపింది.

ఖతర్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం (క్యూఆర్‌017) ఆదివారం దోహా నుంచి డబ్లిన్‌కు బయల్దేరింది. అయితే, మార్గమధ్యలో తుర్కియే గగనతలంపై ఉండగా తీవ్ర కుదుపులకు లోనైంది. అయితే, షెడ్యూల్‌ ప్రకారమే డబ్లిన్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. అప్పటికే పైలట్లు సంబంధిత సమాచారాన్ని చేరవేయడంతో.. విమానాశ్రయంలో పోలీస్‌, అగ్నిమాపక విభాగం, సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మొత్తం ఆరుగురు ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది గాయపడినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు, సిబ్బందికి పూర్తి సాయం అందజేస్తున్నట్లు తెలిపారు.

బస్సుల వలే విమానాల్లో ఆ కుదుపులెందుకు..!

మే 21న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవడంతో ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. లండన్‌ నుంచి సింగపూర్‌ వెళ్తున్న ఎస్‌క్యూ321 విమానంలో ఈ ఘటన జరిగినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని