South Korea flood: సొరంగం నుంచి 13 మృతదేహాలు వెలికితీత

దక్షిణ కొరియా(South Korea)లో చియాంగ్జు సెంట్రల్‌ సిటీ వద్ద వంతెన కింద వరదలో పెద్ద ఎత్తున వాహనాలు చిక్కుకొన్న ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందనే ఆరోపణలొస్తున్నాయి. 

Updated : 17 Jul 2023 11:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ కొరియా(South Korea)లోని చియాంగ్జు సెంట్రల్‌ సిటీ వద్ద సొరంగంలో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను అధికారులు వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకు 13 మృతదేహాలను బయటకు తీశారు. మరో తొమ్మిది మంది ఆచూకీ తెలియడంలేదు. ఈ ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని స్థానిక పత్రికలు ఆరోపిస్తున్నాయి. ఈ సొరంగాన్ని వరద నీరు ముంచెత్తడానికి గంట ముందే వరద నియంత్రణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అప్పుడే  అధికారులు స్పందించి ఈ  సొరంగం వద్ద ట్రాఫిక్‌ను మళ్లించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెబుతున్నారు.

కుతకుతలాడుతున్న ప్రపంచం

శనివారం ఒక్క రోజే దక్షిణ కొరియా (South Korea) వ్యాప్తంగా 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాస్తవానికి ఈ దేశంలో ఏడాదికి 1,000 ఎంఎం నుంచి 1,800 ఎంఎం వరకు వర్షపాతం నమోదవుతుంది. సగటు వర్షపాతంలో దాదాపు నాలుగో వంతు ఒక్క రోజులోనే పడటం గమనార్హం. ఫలితంగా భారీగా కొండచరియలు, మట్టి పెళ్లలు విరుచుకుపడటంతో బురదతో కూడిన వరదలు వచ్చినట్లు అంతరిక్ష చిత్రాలు వెల్లడిస్తున్నాయి. శుక్రవారం ఇక్కడి చెంగ్‌చియాంగ్‌ ప్రావిన్స్‌లో కొండచరియలు విరగి ఓ రైలుపై పడ్డాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు.

బుధవారం వరకు దేశంలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు దేశవ్యాప్తంగా 39 మంది మరణించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిహోవ్‌ నది కట్టలు తెంచుకొని చియాంగ్జు నగరంలోకి ప్రవేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని